ఇప్పటి వరకు వ్యవసాయం మౌలికంగా కుటుంబ జీవనాధారంగా ఉంది. ఈ చట్టాలు అమల్లోకి వస్తే…పాశ్చాత్య దేశాల తరహాలో పూర్తిగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు… వ్యవసాయోత్పత్తుల ప్రాసెసింగ్‌ పరిశ్రమల కబ్జాలో చిక్కుకుపోతాయి. అన్నదాత ఆత్మగౌరవం కాంట్రాక్టు సేద్యపు గొర్రుకు మేడిగా మారుతుంది. సరసమైన ధరలకు జీవనాధార సరుకులు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుంటుంది. కాంట్రాక్టు ప్రకారం పంటకు ధర దక్కుతుంది కాబట్టి గిట్టుబాటు ధర సూత్రమే అక్కరకురానిదిగా మారుతుంది.

కరోనాపై పోరాటం ముసుగులో కేంద్ర ప్రభుత్వం రెండో దఫా ఆర్థిక సంస్కరణలకు తెర తీసింది. ఇందులో భాగంగా వ్యవసాయ రంగ రూపురేఖలను మార్చటంతోపాటు దేశ ఆహార భద్రత వ్యవస్థను తలకిందులు చేసే మూడు ఆర్డినెన్స్‌లను జూన్‌ మొదటివారంలో కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించింది. రాజ్యాంగం ప్రకారం వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై చట్టాలు చేసే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదే. రాజ్యాంగం ఇచ్చిన సమాఖ్య స్ఫూర్తి ఇది. కానీ ఈ ఆర్డినెన్సులు జారీ చేయటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కూడా కేంద్ర ప్రభుత్వం గండికొడుతోంది. తాజా చట్టాలు రైతును పూర్తిగా మార్కెట్‌ గుప్పెట్లో బందీని చేసేవిగా ఉన్నాయి.

మూడు ఆర్డినెన్సుల్లో మొదటిది నిత్యావసర సరుకుల సవరణ చట్టం. 1955 నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టం తెచ్చారు. ఈ సందర్భంగా నాటి కేంద్ర ప్రభుత్వం, ”నిత్యావసర సరుకులు అందరికీ సమానంగా అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో’ ఈ చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ చట్టంలో రెండు భాగాలున్నాయి. ఏది నిత్యావసర సరుకు… ఏది కాదనేది నిర్ధారించటం మొదటి భాగం. కాగా నిత్యావసర సరుకుగా నిర్ధారించిన తర్వాత దాని ఉత్పత్తి, నిల్వలు, ధరవరలు, పంపిణీలను పర్యవేక్షించటం రెండో భాగం. ఏదైనా సరుకును నిత్యావసర సరుకుగా ప్రభుత్వం ప్రకటిస్తే వ్యాపారులు ఓ మోతాదు మించి దాన్ని నిల్వ ఉంచరాదన్నది ఈ చట్టంలో షరతు. గత ఏడున్ర దశాబ్దాలుగా ఈ చట్టం అమల్లో ఉన్నందువల్లనే ఉల్లిపాయ ధరలు పెరిగినా, సిమెంట్‌ లేదా మరో పారిశ్రామిక సరుకు ధరలు పెరిగినా ఈ ధరలు నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేసే వెసులుబాటు ప్రజలకు, వారికి ప్రాతినిధ్యం వహించే పార్టీలకు ఉంది. కానీ తాజా సవరణతో ధరల నియంత్రణ, అవసరానికి మించి నిల్వలు లేకుండా చూడటం తమ బాధ్యత కాదని చెప్పేందుకే నిత్యావసర సరుకుల చట్టాన్ని సవరించింది కేంద్రం.
ఏదైనా పారిశ్రామికోత్పత్తి ధరలు వంద శాతం పెరిగినప్పుడు… వ్యవసాయోత్పత్తుల ధరలు యాభై శాతం పెరిగినప్పుడు.. యుద్ధం, ప్రకృతి వైపరీత్యం, కరువు కాటకాలు తలెత్తినప్పుడు మాత్రమే ప్రభుత్వం వ్యవసాయోత్పత్తులు, పారిశ్రామికోత్పత్తుల ధరలు నిర్ణయించటంలోనూ, నియంత్రించటంలోనూ జోక్యం చేసుకుంటుంది. అంతే తప్ప మిగిలిన సందర్భాల్లో అటువంటి జోక్యానికి తావే లేదన్నది జూన్‌ 5, 2020న కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సు సారాంశం.

ధరలు పెరిగితే తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకొంటుందనే భరోసా కూడా ఈ ఆర్డినెన్స్‌ ఇవ్వటం లేదు. గడచిన ఐదేళ్లల్లో ఏదైనా సరుకు, లేదా వస్తువు ధరల పెరుగుదల తీరుతెన్నులు అధ్యయనం చేశాక మాత్రమే ఏ సరుకును నిత్యావసర సరుకుగా నిర్ణయించాలన్నది తీర్మానిస్తుంది. పైగా అటువంటి తీర్మానం వ్యవసాయోత్పత్తుల ప్రాసెసింగ్‌ పరిశ్రమల వద్ద ఉన్న నిల్వలకు వర్తించదు. అంటే ప్రాసెసింగ్‌ పరిశ్రమ పేరుతో ఏ సరుకును ఎంతైనా నిల్వ వేసుకోవచ్చన్నది సారాంశం. అంటే బ్లాక్‌మార్కెట్‌ను చట్టబద్ధం చేసే చట్టం అన్నమాట. దాంతో ఏ సరుకు ప్రజలకు చేరేసరికి ఎంత ధర పలుకుతుంది? ఈ ధరల వల్ల ప్రజలపై ఉండబోయే భారమెంత? ఈ స్థాయిలో ధరలు పెరిగితే రైతులకు దక్కే ప్రయోజనం ఏమిటి? అన్న విషయాల గురించి ఇకమీదట ఎవ్వరూ ప్రభుత్వాన్ని నిలదీయటానికి అవకాశం లేదు. అంతా మార్కెట్‌ మయం, మార్కెట్‌ మాయ. దాని ప్రకారం నడుచుకోవటానికి ప్రజలను సిద్ధం చేయటమే ఈ ఆర్డినెన్స్‌ సారం. ప్రభుత్వం ప్రజలపై అడ్డూ అదుపూ లేని ధరల భారానికి తెరతీస్తోందన్న అభిప్రాయం కలగకుండా ఉండటానికి ఈ చట్టం వల్ల రైతాంగం మెరుగైన ధరలకు వ్యవసాయోత్పత్తులు అమ్ముకోవచ్చని ఆశ చూపుతోంది. ఇప్పటి వరకు వ్యవసాయ రంగంలో వచ్చిన అన్ని సంస్కరణలు, ఆ మాటకొస్తే ఆర్థిక వ్యవస్థలో జరిగిన అన్ని మార్పులూ రైతాంగం, ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి వచ్చినవే కదా. పాత చట్టాలు, సంస్కరణలతో ప్రజల జీవితాలు ఏ మేరకు బాగుపడ్డాయో మనందరి జీవితానుభవం రుజువు చేస్తుంది.

రెండో ఆర్డినెన్స్‌ మార్కెట్లు-మద్దతు ధరలు. ఈ ఆర్డినెన్స్‌ ద్వారా 75 సంవత్సరాలుగా మార్కెట్‌కు బందీగా వున్న రైతుకు విముక్తి కలిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ గొప్పగా చెప్పారు. దేశంలో కనీసంగా 100 పంటలు సాగవుతుంటే మద్దతు ధరల విధానం కేవలం 14 పంటలకు మాత్రమే అమలవుతోంది. ఈ మద్దతు ధరల కోసం రైతాంగం మార్కెట్‌ యార్డులు కేంద్రాలుగా సరుకులను అమ్ముకుంటున్నారు. మార్కెట్‌ యార్డుల వ్యవస్థ, మద్దతు ధరలు కొంతమేర రైతుకు రక్షణగా వుంటున్నాయి. ఈ విధమైన రక్షణ కారణంగా ప్రైవేటు శక్తుల ప్రవేశానికి అవరోధాలున్నాయి. రైతుకున్న ఈ రక్షణ కవచాలనే బంధనాలని ప్రచారం చేస్తోంది కేంద్ర ప్రభు త్వం. వ్యవసాయోత్పత్తులను మార్కెట్‌ యార్డుల్లోనే అమ్ముకో వాలన్న నిబంధనను ఎత్తేయటమే ఈ రెండో ఆర్డినెన్స్‌ సారాం శం. దాంతో మార్కెట్‌ యార్డులు, మద్దతు ధరలు గంగలో కలుస్తాయి. ఈ మాత్రం చట్టపరమైన రక్షణ ఉంటేనే ఏటా 10 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక ఇది కూడా లేకపోతే కరోనా చావులతో పోటీ పడాల్సి వస్తుంది.

మూడో ఆర్డినెన్స్‌ కాంట్రాక్టు సేద్యానికి సంబంధించినది. దీనికి పెట్టిన అందమైన పేరు రైతు సేద్యపు సేవలు, ధరల హామీ (సాధికారత, రక్షణ) ఆర్డినెన్స్‌. దీని ప్రకారం రైతులతో నేరుగా వ్యవసాయోత్పత్తుల్లో వ్యాపారం చేసే కంపెనీలు, స్వతంత్ర వ్యాపారులు, టోకు మరియు చిల్లర దుకాణం దారులు ఫలానా పంట ఫలానా రేటుకు కొనుగోలు చేస్తామని ఒప్పందాలు చేసుకోవచ్చు. ఈ ఒప్పందాలను వ్యాపారులు, పరిశ్రమ యజమానులు ఏ కారణంగానైనా ఉల్లంఘిస్తే సబ్‌ కలెక్టర్‌ సమక్షంలో పంచాయితీ చేసుకుని వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు. ఆహార ధాన్యాలు, కూరగాయలు, నూనెగింజలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, కోళ్లు మొదలు అన్ని రకాల మాంసపు ఉత్పత్తుల రైతులతో ఇకమీదట ఆయా కంపెనీలు నేరుగా ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. దీంట్లో మరో ముఖ్యమైన కోణం కూడా ఉంది. ఈ విధంగా రైతులతో ఒప్పందం కుదుర్చుకునే కంపెనీలు, వ్యాపారులు రైతాంగానికి కావాల్సిన ముడిసరుకులు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తమకు నచ్చిన ధరలకు సరఫరా చేసి దిగుబడిపై రైతుకు చెల్లించాల్సిన ఆదాయం నుండి మినహాయించు కోవచ్చు. ఇటువంటి చట్టం వ్యవసాయరంగంపై ఆధారపడిన కోట్లాదిమంది చిన్న సన్నకారు రైతులను కంపెనీకి ఉత్పత్తిని అందించే కాంట్రాక్టు కూలీలుగా మారుస్తుంది.

అంతకంటే పెద్ద ప్రమాదం మరోటి ఇందులో ఇమిడి ఉంది. వ్యాపారులు, దుకాణదారులతో ఒప్పందాలు ఏ యేడాదికాయేడాది కొత్తగా కుదుర్చుకోవాలి. అంటే ఈ సంవత్సరం ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ వచ్చే ఏడాది అదే రైతుతో ఒప్పందం కుదుర్చుకుంటుందన్న గ్యారంటీ ఏమీ లేదు. ఈ సంవత్సరం ఓ పంట కోసం ఒప్పందం కుదుర్చుకున్నాక వచ్చే ఏడాది అదే రైతుతో అదే పంట అదే మోతాదులో సరఫరా చేసేలా ఒప్పందం ఉంటుందన్న గ్యారంటీ ఏమీ లేదు. ఇక్కడ రైతాంగపు ఆదాయ భద్రతకు ప్రమాదకరంగా పరిణమించే క్లాజు ఒకటి ఉంది. ఒప్పందం మేరకు వ్యవసాయోత్పత్తులు సరఫరా చేయాల్సిన రైతులు ఒప్పందంలో ఏ మోతాదు, ఏ నాణ్యతతో సరఫరా చేస్తామని అంగీకరించారో ఆ నాణ్యతతో అదే మోతాదులో సరఫరా చేసినప్పుడు మాత్రమే సదరు కంపెనీలు రైతాంగంతో కుదుర్చుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఉత్పత్తుల్లో ఏ చిన్న తేడా వచ్చినా కంపెనీ ఒప్పందాన్ని ఉల్లంఘించేందుకు అవకాశం ఉంటుంది.

ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల కారణంగా ఉత్పత్తి తగ్గితే కొద్దిపాటి వెసులుబాటు ఉండొచ్చు కానీ నాణ్యత విషయంలో మాత్రం ఎటువంటి వెసుసులుబాటూ ఉండదు. ఆచరణలో ఉన్న అనుభవాలను గుర్తు తెచ్చుకుంటే ఈ క్లాజులో దాగి ఉన్న ప్రమాద తీవ్రత ఏమిటో అర్థమవుతుంది. మిర్చి, పత్తి, ధాన్యం పండించిన రైతులు వీటిని మార్కెట్‌ యార్డుకు తీసుకెళ్లినా లేదా వ్యాపారి కల్లం మీదకు వచ్చినా వచ్చే ప్రశ్నలు షరామామూలే. మిర్చి అయితే తాలు కాయలు ఎక్కువ ఉన్నాయనో, పత్తి అయితే గుడ్డి పత్తి ఎక్కువగా ఉందనో, పింజ తక్కువగా ఉందనో… ధాన్యం అయితే తేమ ఎక్కువైందనో, తక్కువైందనో రేటు కోత కోయటం రైతుల దైనందిన అనుభవం. రేట్లు కోత కోసేందుకు ఇప్పటి వరకు వ్యాపారులు అనధికారికంగా అమలు చేస్తున్న విధానాలకు ఈ ఆర్డినెన్స్‌ ద్వారా ప్రభుత్వం చట్టపరమైన రక్షణ కల్పించనుంది. అన్నింటికన్నా దారుణమైనది ఈ ఆర్డినెన్స్‌ లోని 9వ క్లాజు. దీని ప్రకారం వ్యాపారులు, పరిశ్రమలు ఓసారి నిర్దిష్ట మోతాదు, నిర్దిష్ట నాణ్యతతో వ్యవసాయోత్పత్తిని పండించేందుకు, సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈ ఒప్పందం ఆధారంగా అటు వ్యాపారి గానీ, ఇటు రైతు కానీ రుణాలు తీసుకోవచ్చు. ఒప్పందానికి బీమా పాలసీ కూడా తీసుకోవచ్చు. ఊళ్లల్లో రైతుల పట్టాలో ఇళ్లో తనఖా పెట్టుకుని వాటి మీద సహకార సంస్థల్లోనో, బ్యాంకుల్లోనో రుణాలు కైంకర్యం చేసే వడ్డీ వ్యాపారుల గురించిన అనుభవాలు 1930-1970 దశకాల్లో కథలు కథలుగా చెప్పేవాళ్లు మన పూర్వీకులు. ఈ చట్టాలు ఆమోదిస్తే ఇకపై ప్రతి రైతు జీవితమూ ‘రంగస్థల’మే.

ఈ ఆర్డినెన్సులు అమల్లోకి వచ్చాక రైతుకు పంట రుణాలు, కనీస మద్దతు ధరలు, రాయితీలపై ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాల్సిన చట్టపరమైన బాధ్యత ప్రభుత్వ ంపై ఉండదు. ఇప్పటి వరకు వ్యవసాయం మౌలికంగా కుటుంబ జీవనాధారంగా ఉంది. ఈ చట్టాలు అమల్లోకి వస్తే…పాశ్చాత్య దేశాల తరహాలో పూర్తిగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు… వ్యవసాయోత్పత్తుల ప్రాసెసింగ్‌ పరిశ్రమల కబ్జాలో చిక్కుకుపోతాయి. అన్నదాత ఆత్మగౌరవం కాంట్రాక్టు సేద్యపు గొర్రుకు మేడిగా మారు తుంది. సరసమైన ధరలకు జీవనాధార సరుకులు అందుబా టులో ఉంచాల్సిన బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుంటుంది. కాంట్రాక్టు ప్రకారం పంటకు ధర దక్కుతుంది కాబట్టి గిట్టుబాటు ధర సూత్రమే అక్కరకురానిదిగా మారుతుంది.

ఇటువంటి కీలకమైన షరతుల గురించి అటు రైతాంగ ప్రతినిధులతో కానీ ఇటు పార్లమెంట్‌లో కానీ ఏ మాత్రం చర్చకు అవకాశం లేకుండా ప్రభుత్వం ఆర్డినెన్సులు తెచ్చింది. వీటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, అప్రజాస్వామికంగా మోపబడ్డ ఈ ఆర్డినెన్స్‌లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకుని ఉద్యమిస్తేనే, కష్టజీవి సేద్యం…కంపెనీ చేతుల్లో తాకట్టు సేద్యంగా మారకుండా రక్షించుకోగలుగుతాము.

వి. కృష్ణయ్య
(వ్యాసకర్త సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు)

Courtesy Prajasakti