– రైతులకు మద్దతునివ్వడంలో అత్యంత దిగువన..
– పట్టించుకోని పాలకులు
– అధిక ప్రాధాన్యమిస్తున్న అభివృద్ధి చెందిన దేశాలు

న్యూఢిల్లీ: ప్రధానరగా మనది వ్యవసాయిక దేశం. 130 కోట్ల మందికి అన్నం పెడుతున్న రైతన్నలే దేశానికి వెన్నెముక లాంటి వారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకున్నా.. విత్తనాలు, ఎరువుల ధరలు పెరుగుతున్నా.. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు రాకున్నా.. రైతులు మాత్రం సాగును వీడలేదు. మరి దేశానికి అన్నం పెడుతున్న రైతులకు వారి కష్టానికి తగిన మద్దతు లభిస్తుందా..? అంటే కచ్చితంగా లేదనే సమాధానం వినిపిస్తున్నది. ఏండ్లకేండ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ పాలకులు.. సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని చింపిన విస్తరి మాదిరిగా చేశారు. ఇక 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనీ, 2022 నాటికి రైతుల తలరాతలు మారుస్తామని మాయమాటలు చెప్పిన బీజేపీ.. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు గంపగుత్తగా అప్పగిస్తున్నదే తప్ప రైతులకు మద్దతు ధరలను కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నది. ఇప్పటివరకూ అందుకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక కూడా విడుదల చేయలేకపోయింది.

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్‌లో రైతులకు ప్రభుత్వాలు ఇస్తున్న మద్దతు చాలా రెట్లు తక్కువగా ఉన్నది. 2016 లెక్కల ప్రకారం.. అగ్రరాజ్యం అమెరికాలో ఒక రైతు ఏడాదికి ఆ దేశ ప్రభుత్వం నుంచి వివిధ సబ్సిడీల ద్వారా సగటున రూ. 5 లక్షల (7,253 డాలర్లు) మద్దతు పొందుతున్నాడు. కెనడాలో కర్షకులకు ఏడాదిలో సుమారు రూ. 5,20,000 (7415 డాలర్లు) అందిస్తుండగా.. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) సభ్యదేశాల్లో దాదాపు రూ. 75 వేల (1068 డాలర్లు)కు తగ్గకుండా ఇస్తున్నారు. ఇక భారత్‌లో (2018-19 గణాంకాల ప్రకారం) ఒక రైతు ప్రభుత్వం నుంచి పొందుతున్న సబ్సిడీ విలువ రూ. 3,430. ఇది పైన పేర్కొన్న దేశాలతో పోల్చుకుంటే వేల రెట్లు తక్కువ.

దేశీయ మద్దతూ తక్కువే..
భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రైతులకు మద్దతు ధరలను కల్పించడం అత్యంత ఆవశ్యకం. ఇప్పటికీ దేశ జీడీపీలో సగానికంటే ఎక్కువ వాటా వ్యవసాయరంగం నుంచే ఉన్నది. కానీ దేశంలో 5 ఎకరాలు అంతకంటే తక్కువగా ఉన్న రైతులే ఎక్కువ మంది ఉన్నారు. పెద్ద రైతులున్నా.. వారు ఎక్కువ భాగం కౌలుకు ఇస్తున్నారే తప్ప స్వయంగా పొలాల్లో దిగి సాగు చేసేది తక్కువ. అయినప్పటికీ దేశానికి ఆహార భద్రతను కల్పించడంలో చిన్న రైతుల పాత్రే కీలకం. వీరికి మద్దతునివ్వాల్సిన పాలకులు మాత్రం ఆ పని చేయడం లేదు. ది సెంటర్‌ ఫర్‌ డబ్ల్యుటీవో స్టడీస్‌ (సీడబ్ల్యూఎస్‌) నివేదిక ప్రకారం.. రైతులకు దేశీయ మద్దతు (మార్కెట్‌ ధర మద్దతు, ఇన్‌పుట్‌ రాయితీల వంటి వాటి ద్వారా దీనిని నిర్ణయిస్తారు)ను అందిస్తున్న దేశాల్లో భారత్‌ అత్యంత దిగువన ఉంది. అమెరికాలో రైతులకు డొమెస్టిక్‌ సపోర్టు రూ. 42 లక్షలుండగా.. కెనడాలో రూ. 9 లక్షలు, ఈయూలో రూ. 6 లక్షల దాకా ఉంటే.. భారత్‌లో ఇది రూ. 20 వేలు మాత్రమే.

అక్కడెందుకు ఎక్కువ..
అభివృద్ధి చెందిన దేశాల్లో రైతులకు సబ్సిడీలు, మద్దతు ధరలు ఎక్కువగా ఉండటానికి కారణం ఆయా దేశాలు డబ్ల్యుటీవో అగ్రిగేట్‌ మెసర్‌మెంట్‌ ఆఫ్‌ సపోర్టు (మొత్తం కొలత యొక్క మద్దతు-ఎఎంఎస్‌) ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్నాయి. దీని ద్వారా ఈ దేశాలకు అగ్రిమెంట్‌ ఆన్‌ అగ్రికల్చర్‌ (ఎఒఎ) పరిమితులకు మించి రైతులకు మద్దతు ధరలు కల్పించడానికి వీలు కల్పిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా మరి కొన్ని దేశాలకు ఈ అర్హత ఉన్నప్పటికీ.. అభివృద్ధి చెందిన దేశాల వాటా (95.77 శాతం)తో పోలిస్తే మిగతా దేశాల వాటా (4.23 శాతం) చాలా తక్కువగా ఉంది.

ఇక మనదేశానికొస్తే ఇక్కడ పాలకులు తీసుకునే విధానపరమైన నిర్ణయాలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ప్రధానంగా రెండు సీజన్‌లకు గానూ కేంద్ర ప్రభుత్వం పంటలకు కొద్దిపాటి పెంపుతో మద్దతు ధరలను ప్రకటిస్తుంది. అదీ నామమాత్రమే. క్వింటాలుకు రూ. 50 నుంచి రూ. 100 పెంచి విత్తనాలు, ఎరువులలో సబ్సిడీలు ఎత్తివేస్తున్నది.

దీంతోపాటు రైతులకు సరైన కాలంలో బ్యాంకులు రుణాలివ్వకపోవడంతో వారు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకు వెళ్లి అప్పులపాలవుతున్నారు. అన్ని కష్టాలకోర్చి పంటలు పండించినా కొన్ని సార్లు పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాక రైతులు ప్రాణాలు తీసుకుంటున్నా.. పాలకులు మాత్రం వారిని వృద్ధిలోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టడం లేదు. పోగా.. సెజ్‌లు, ఆధునిక వ్యవసాయం పేరిట భూములను ప్రయివేటు పెట్టుబడిదారులకు అప్పగిస్తుండటం గమనార్హం.

Courtesy Nava Telangana