మందగమనం

దిగజారుతున్న భారత ఆర్థికవ్యవస్థ 
– ఐదేండ్ల కనిష్టానికి తొలి త్రైమాసికపు వృద్ధిరేట్‌ 
– 5.7 శాతంగా రాయిటర్స్‌ పోలింగ్‌లో ఆర్థికవేత్తల అంచనా 

 

2025 నాటికి 5 ట్రిలియన్‌ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి భారత్‌ వడివడిగా అడుగులేస్తున్నదని మోడీ సర్కార్‌ బడ్జెట్‌లో ప్రకటించింది. ఎన్నో సంస్కరణలను తేస్తామని ప్రస్తావించాక…దేశంలో ఆర్థికమాంద్య పరిస్థితులు జనాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి దొరకటంలేదు. ఇప్పటికే పనిచేస్తున్న సంస్థల్లోని ఉద్యోగులను తొలగిస్తున్నారు. దేశీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ) ఉన్న దానికంటే మోడీ సర్కార్‌ ఎక్కువ చూపిందని ఆర్థిక నిపుణుల వాదనలు వెలుగు చూశాయి. తాజాగా ఐదేండ్లలో ఎన్నడూలేనివిధంగా తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 5.7కే పరిమితమవుతున్నదని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్‌ నిర్వహించిన ఓటింగ్‌లో ఎక్కువ మంది ఆర్థిక నిపుణులు తమ అభిప్రాయాలను తెలిపారు.

భారత ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని సూచిస్తున్న దని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరం 2019-20 తొలి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లో దేశీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ) వృద్ధిరేట్‌ 5.7కే పరిమితమవుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్‌ నిర్వహించిన ఓటింగ్‌లో పాల్గొన్న 65మంది ఆర్థికవేత్తల్లో మెజారిటీ అంచనా ఇది. తొలి త్రైమాసికంలో ఇంత తక్కువ వృద్ధిరేట్‌ ఐదేండ్లలో ఇదే అవుతుంది. 65మందిలో 40 శాతం అంచనా 5.6 శాతం లేదా ఇంకా తక్కువగా ఉండటం గమనార్హం. ఇది నిజమైతే ఏడేండ్లలో ఇదే అతి తక్కువ వృద్ధిరేట్‌ అవుతుంది. 2018-19 సంవత్సరపు చివరి త్రైమాసికం (జన వరి-మార్చి)లో జీడీపీ వృద్ధిరేట్‌ 5.8 శాతానికి పడిపోయినట్టు అధికారిక లెక్కల్లో ఇప్పటికే తేలింది. గతేడాది మొత్తంమ్మీద (2018-19) జీడీపీ వృద్ధిరేట్‌ 6.8 శాతంగా నమోదైంది. ఆర్థికవేత్తల నుంచి ఈ నెల 21 నుంచి 26 వరకు 2019-20 సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేట్‌పై అంచనా కోరగా 6.5 శాతంగా ఉండనున్నట్టు తెలిపారు. ఇది గత నెల అంచనా 6.8 శాతం కన్నా తక్కువ కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తొలి త్రైమాసికపు జీడీపీ వృద్ధిరేట్‌ను ఈ నెల 30న(శుక్రవారం) వెల్లడించనున్నది.

విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడం, వాహనరంగంలో అమ్మకాలు కనీస స్థాయికి పడిపోవడం, ప్రజల కొనుగోలుశక్తి క్షీణించడం జీడీపీ వృద్ధిరేట్‌పై వ్యతి రేక ప్రభావాన్ని చూపినట్టు ఆర్థికవేత్తలు అంచనా వేశారు. మన ఆర్థిక వ్యవస్థకు మచ్చు తునకగా భావించే రియల్‌ ఎస్టేట్‌లోనూ అమ్మకాలు క్షీణించడాన్ని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. దీంతో, ఇటీవల సమావేశమైన ఆర్‌బీఐ అధికారులు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకోవడం.. బడా కార్పొరేట్లు, విదేశీ మదుపర్ల ఆదాయంపై సర్‌చార్జీని తొలగిస్తున్నట్టు కేంద్రం నుంచి ప్రకటన రావడం గమనార్హం.

 

(Courtacy Nava Telangana)

Leave a Reply