ప్రభాత్‌ పట్నాయక్‌
ప్రభాత్‌ పట్నాయక్‌

అధికారిక ప్రాథమిక అంచనాల ప్రకారం భారత దేశపు జిడిపి వృద్ధిరేటు ఏప్రిల్‌-జూన్‌ 2020 త్రైమాసికానికి గతేడాది అదే కాలపు (2019 ఏప్రిల్‌-జూన్‌) జిడిపి వృద్థి రేటుతో పోల్చితే 24 శాతం పడిపోయింది. కాస్త లోతుగా విషయాలు తెలిసిన వారు మాత్రం జిడిపి పతనం ఇంతకన్నా వాస్తవంగా ఇంకా ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు. మాజీ గణాంక అధికారి ప్రణబ్‌ సేన్‌ అంచనా ప్రకారం జిడిపి వృద్ధి రేటు 32 శాతం పడిపోయింది. మరికొంతమంది ఇతరులు అంతకన్నా కూడా ఎక్కువగానే పతనం ఉంటుందని చెప్తున్నారు.

మనం అధికారిక గణాంకాలనే పరిగణన లోకి తీసుకున్నా ప్రపంచం లోని మరే ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలకన్నా మన దేశంలో ఈ మూడు నెలల్లో ఆర్థిక వ్యవస్థ చాలా ఎక్కువగా ముడుచుకు పోయిందని చెప్పాలి. మన దేశంలో విధించిన లాక్‌డౌన్‌ కూడా ఈ మూడు నెలల కాలంలోనే మొదలైంది. తక్కిన ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థతో పోల్చినా మన దేశంలో అమలు జరిపిన లాక్‌డౌన్‌ అత్యంత నిరంకుశమైనది. అత్యంత అమానవీయమైనది. కేవలం నాలుగు గంటల వ్యవధితో లాక్‌డౌన్‌ అమలు చేశారు. అంతే గాక ఆర్థిక వ్యవస్థలో హెచ్చు, ప్రధాన భాగాన్ని ఈ కాలంలో మూత వేశారు. ఇంత చేసినా కరోనా వ్యాప్తిని లాక్‌డౌన్‌ అరికట్టలేక పోయిందనేది వేరే విషయం. లాక్‌డౌన్‌ కాలం అయిపోయి, సడలింపులు మొదలయ్యాయి. అయినా మన దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ మరింత ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇతర దేశాల్లో నమోదయ్యే కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందన్నది వేరే విషయం. ఏమైనా ఈ నేపథ్యంలో మన జిడిపి వృద్థి రేటు ఇలా పడిపోవడం పెద్ద ఆశ్చర్యం కలిగించదు.

లాక్‌డౌన్‌ కాలంలో వెంటనే పనులు కోల్పోయి, వందలాది మైళ్ళ దూరాన ఉన్న తమ స్వగ్రామాలకు కాలినడకన సైతం తరలిపోయిన లక్షలాది కార్మికులకు ప్రభుత్వం ఏ విధమైన ఊరటనూ కల్పించలేకపోవడం ఈ లాక్‌డౌన్‌ లో వ్యక్తమైన ప్రధాన లక్షణం. పలు ఇతర దేశాల్లో సార్వత్రికంగా ఆహారాన్ని పంపిణీ చేశారు. అందరికీ నగదు చెల్లించారు. కాని ఇక్కడ ప్రభుత్వం అటువంటిదేమీ చేయలేదు. తలకు 5 కిలోల చొప్పున అదనపు ఆహార ధాన్యాలను దేశంలోని 80 శాతం ప్రజానీకానికి అందిస్తామని తొలుత ప్రకటించారు. కాని వాస్తవ పంపిణీలో గుర్తింపు కార్డులు చూపాల్సిందేనని నిబంధన పెట్టారు. చాలామందికి గుర్తింపు కార్డులు లేక ఈ అదనపు ఆహార ధాన్యం అందలేదు. ఇక నగదు చెల్లిస్తామన్న హామీని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. అమెరికా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ తన జిడిపిలో 10 శాతం సహాయ కార్యక్రమాల ప్యాకేజికి కేటాయించింది. జర్మనీ 5 శాతం కేటాయించింది. జపాన్‌ అంతకన్నా ఎక్కువే కేటాయించింది. కాని మన ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో వార్షిక బడ్జెట్‌లో అప్పటికే కేటాయించిన వాటిని మినహాయిస్తే జిడిపి లో ఒక్క శాతం కూడా పూర్తిగా కేటాయించలేదు. ఆ విధంగా అత్యంత కర్కశంగా లాక్‌డౌన్‌ అమలు జరిపి, అత్యంత హీనంగా సహాయ కార్యక్రమాన్ని చేపట్టిన దేశం మనది.

అసలు వ్యవహారం ఇప్పుడే ముందుకొచ్చింది. ఇప్పుడు ఎదుర్కున్న ఆర్థిక వినాశనాన్ని మించిన వినాశనం రాబోయే కాలంలో మనం చూడబోతున్నాం. లాక్‌డౌన్‌ కాలంలో లక్షలాది కార్మికులు,
ఉద్యోగులు ఉపాధిని కోల్పోయారు. దానితోబాటు ఆదాయాలనూ కోల్పోయారు. అందువలన వారంతా తమ ప్రాణాలను నిలుపుకోడానికి తమ దగ్గర అప్పటిదాకా దాచుకున్నదేమైనా ఉంటే దానిని ఖర్చు చేయాల్సి వచ్చింది. దాచుకున్నదేమీ లేకపోతే అప్పులు చేశారు. రేపు వారందరికీ ఈ లాక్‌డౌన్‌ అనంతరం ఉద్యోగాలు తిరిగి లభించినా, వారికొచ్చే ఆదాయాన్నంతటినీ వారే ఖర్చు చేయడం సాధ్యం కాదు. చేసిన అప్పులను తీర్చాలి. తరిగిపోయిన పొదుపు మొత్తాలను తిరిగి భర్తీ చేయాలి. దానికోసం కొంత పక్కనబెట్టి తక్కినదే వారు ఖర్చు చేయగలుగుతారు. అంటే వారి వినిమయ స్థాయి గణనీయంగా తగ్గుతుంది. దీని పర్యవసానాలు ఏమిటి? వివరంగా పరిశీలిద్దాం.

లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే మళ్ళీ అందరికీ పూర్వ కాలంలో ఉన్న ఉద్యోగాలన్నీ తిరిగి వచ్చాయని, అప్పటి స్థాయిలోనే వేతనాలు చెల్లించడం మళ్ళీ మొదలైందని మాటవరసకి అనుకుందాం (నిజానికి ఆచరణలో ఆ విధంగా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే పెట్టుబడులు తిరిగి యథాతథ స్థితికి చేరుకోడానికి కొంత వ్యవధి పడుతుంది. అయినా దానిని కాసేపు పక్కన పెడదాం). ఆదాయాలు పాత స్థాయిలోనే వచ్చినా, ఆ ఉద్యోగులు, కార్మికులు పాత స్థాయిలోనే వినిమయం చేయలేరు. ఎందుకంటే వారు తాము లాక్‌డౌన్‌ కాలంలో చేసిన అప్పులను తిరిగి చెల్లించాలి. పాత స్థాయిలోనే ఉత్పత్తి జరిగినా, అదే పాత స్థాయిలో వినిమయం జరగదు కాబట్టి అధికోత్పత్తికి దారితీసే ప్రమాదం ఉంటుంది. దానిని నివారించడానికి ఉత్పత్తి స్థాయిని ముందుగానే తగ్గిస్తారు. అంటే లాక్‌డౌన్‌ ముందునాటి కంటే లాక్‌డౌన్‌ ఎత్తివేశాక ఉత్పత్తి తగ్గుతుంది. లాక్‌ డౌన్‌ కాలంలో పూర్తిగా పడిపోయిన ఉత్పత్తి స్థాయి నుండి లాక్‌డౌన్‌ ఎత్తివేశాక కొంత కోలుకున్నా, ఆ కోలుకోవడం వలన ఉత్పత్తి స్థాయి మాత్రం లాక్‌డౌన్‌ ముందుకాలం నాటి స్థాయికి చేరలేదు. లాక్‌డౌన్‌ కాలంలో ఉత్పత్తి అట్టడుగుకు పడిపోయినట్టే, లాక్‌డౌన్‌ ఎత్తివేశాక తిరిగి పాత స్థాయికి చేరుకుంటుందని వాదించేవారున్నారు. వారు రెండు విషయాలను కలగాపులగం చేస్తున్నారు. ఒకటి అట్టడుగుకు పడిపోయిన స్థాయి నుండి లాక్‌డౌన్‌ అనంతరం కోలుకోవడం. రెండవది లాక్‌డౌన్‌ పూర్వకాలపు స్థాయికి ఉత్పత్తి చేరుకోవడం. మొదటిది జరగొచ్చు కాని రెండోది మాత్రం జరగదు.

మనం చెప్పే వాదనను వ్యతిరేకించేవారు రెండు కారణాలను చూపిస్తారు. మొదటిది- లాక్‌డౌన్‌ కాలంలో ఇల్లు దాటి బైటకు రాలేనివారు చాలామంది ఉంటారు. మామూలుగా వారు కొనుగోలు చేయగలిగిన ఆర్థిక స్థోమత ఉన్నవారైనా, లాక్‌డౌన్‌ కారణంగా ఆ కాలంలో కొనలేకపోయారు. వారు ఒకసారి లాక్‌డౌన్‌ ఎత్తివేశాక, మామూలు స్థాయి కన్నా ఎక్కువగా కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు. అందుచేత మొత్తంమీద వినిమయం పెరుగుతుంది. అయితే ఈ విధంగా పెరిగే వినిమయం అంతా కలిపినా, అప్పులు తీర్చడం కోసం, కరిగిపోయిన పొదుపు నిల్వలను భర్తీ చేయడం కోసం కార్మికులు కొంత ఆదాయాలను పక్కకు పెట్టడం వలన తగ్గిపోయే వినిమయం పాటి చెయ్యదు. పైగా లాక్‌డౌన్‌ కాలంలో కూడా వినిమయం మొత్తం ఆగిపోదు కదా. ఏమేరకు వినిమయం చేయకుండా వాయిదా వేస్తారో, ఆమేరకు వినిమయం జరగకుండా పోయిందనే లెక్కవేయాలి. ఇంట్లోనే ఉండిపోవలసి వచ్చినందున ఒక వ్యక్తి ఒక కారునో, స్కూటర్‌నో, లేక పిల్లలకోసం ఆటబొమ్మలనో కొనలేకపోయా డనుకుందాం. ఇప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తివేశాక అతడు ఒకటికి బదులు రెండు కార్లను గాని, లేదా రెండు స్కూటర్లను గాని కొనడు కదా? రెండు సెట్ల బొమ్మలను పిల్లలకు కొనడు కదా? అందుచేత లాక్‌డౌన్‌ కాలంలో పేరుకుపోయిన వినిమయ శక్తితో లాక్‌డౌన్‌ అనంతర కాలంలో మార్కెట్‌లో వినిమయం పుంజుకుంటుందన్న వాదన నిలబడదు.

ఇక రెండో వాదన- లాక్‌డౌన్‌ కాలంలో షాపుల్లో స్టాకులు తరిగిపోయిన మేరకు తిరిగి భర్తీ కావు. లాక్‌డౌన్‌ ఎత్తెయ్యగానే పెరిగే వ్యాపారాన్ని అందుకోవడం కోసం అదనంగా దుకాణదారులు స్టాకులకు ఆర్డర్లు ఇస్తారు. దానివలన మార్కెట్‌లో మొత్తంమీద డిమాండ్‌ పెరుగుతుంది. ఈ వాదనా చెల్లదు. ఎందుకంటే దీనివలన కొద్దిమేరకు స్టాకులకు డిమాండ్‌ పెరగవచ్చునేమో తప్ప పూర్తిగా కాదు. లాక్‌డౌన్‌ అనంతరం ఏర్పడే అధికోత్పత్తి సమస్యను కాని, తగ్గిపోయే వినిమయం సమస్యను కాని ఇది పరిష్కరించలేదు.

ఇక్కడితో అయిపోలేదు. ఎప్పుడైతే లాక్‌డౌన్‌ ముందున్న స్థాయిలో ఉత్పత్తి లాక్‌డౌన్‌ అనంతర కాలంలో జరగదో, అప్పుడు మార్కెట్‌లో పెట్టే పెట్టుబడుల స్థాయి తగ్గిపోతుంది. ఒకసారి పెట్టుబడులు తగ్గితే, అప్పుడు ఆ మేరకు ఉపాధి తగ్గుతుంది. దాంతో వినిమయం కూడా తగ్గుతుంది. ఇదొక విష వలయం లాగా పరిణమిస్తుంది. వినిమయం తగ్గింది గనుక పెట్టుబడి తగ్గడం, పెట్టుబడి తగ్గింది గనుక ఉపాధి తగ్గడం, ఉపాధి తగ్గింది గనుక వినిమయ శక్తి తగ్గడం, దానివలన మళ్ళీ పెట్టుబడి తగ్గడం- ఇదే ఆ దిగజారుడు వలయం. ఈ దిగజారుడు సాగుతున్నకొద్దీ నిరుద్యోగం పెరిగిపోతుంది.

లాక్‌డౌన్‌కు మునుపే మన దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగి పోయింది. ఇప్పుడు ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ దిగజారడం వలన ఏ స్థాయికి అది చేరుతుందో ఊహించ లేము. అది వినాశనమే తప్ప మరొకటి కాదు. ఇలా ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్నకొద్దీ ఆర్థిక సంస్థలకు, బ్యాంకు లకు అప్పులను బకాయి పెట్టే బాపతు పెరిగిపోతారు. నిరర్థక ఆస్థులు పెరిగితే బ్యాంకులూ కూలబడతాయి. ప్రభుత్వం బలంగా జోక్యం చేసుకుంటేనే ఈ వినాశనాన్ని నివారించడం సాధ్యం.

వినాశనాన్ని నివారించడానికి ప్రభుత్వం ప్రజల వినిమయ శక్తిని పెంచాలి. అందుకోసం ప్రభుత్వం చేసే ఖర్చును బాగా పెంచాలి. ముఖ్యంగా వైద్య సంరక్షణ వంటి అంశాలకు ప్రభుత్వం నిధులు హెచ్చుగా కేటాయించాలి. ఈ పని ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జరగడం సము చితం. ఎందుకంటే అవే ఈ మహమ్మారితో తలపడడంలో ముందు ప్రజలకు బాధ్యత వహించాలి. అందుచేత కేంద్రం రాష్ట్రాలకు అదనంగా ఆర్థిక వనరులను సమకూర్చాలి.

నేరుగా ప్రజల కొనుగోలుశక్తిని పెంచడం ఇంకొక మార్గం. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని ప్రతీ కుటుంబా నికీ రు.7,500 చొప్పున ప్రతి నెలా చెల్లించాలని వామపక్ష ప్రజాతంత్ర శక్తులు డిమాండు చేస్తున్నాయి. దీనిని వెంటనే అమలు చేయడంతోబాటు ప్రతీ కుటుంబానికీ ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చేయాలి. ఇంత కాలమూ ఈ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇప్పుడు ఈ ఆర్థిక దిగజారు డును ఆపడానికైనా ఆ డిమాండ్లను తక్షణమే అమలు చేయాలి.
ఇందుకోసం అవసరమయ్యే ద్రవ్యాన్ని సమకూర్చు కోడానికి ద్రవ్యలోటు పరిమితిని సడలించి పెంచాలి. ముందు రిజర్వు బ్యాంకు నుంచి ప్రభుత్వం అప్పు చేయాలి. రిజర్వు బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు ఏ విధంగా రెపో రేటుకి రుణాలు ఇస్తుందో అదే రేటుకు ప్రభుత్వానికి కూడా ఇవ్వాలి. ఏదో ఒక మేరకు ఆర్థిక వ్యవస్థ స్థిమిత పడిన తర్వాత బాగా బలిసిన సంపన్నులపై సంపద పన్ను విధించడం వంటి చర్యల ద్వారా పెరిగిన ద్రవ్యలోటును భర్తీ చేసే చర్యలు తీసుకోవాలి.

అన్నింటికన్నా ముందుగా కేంద్రం రాష్ట్రాలకు బకాయి పడ్డ జిఎస్‌టి పరిహారాన్ని వెంటనే చెల్లించాలి. దానివలన ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి తోడ్పడడంతో బాటు కేంద్రం తన రాజ్యాంగ బద్ధమైన బాధ్యతను కూడా నెరవేర్చినట్టవుతుంది.