– ‘లింగ నిష్పత్తి అంతర సూచీ’లో మరింత దిగజారిన భారత్‌
– పొరుగుదేశాలు మనకంటే మెరుగు
– ‘మహిళల ఆరోగ్యం, మనుగడ, ఆర్థిక భాగస్వామ్యం’పై డబ్ల్యూఈఎఫ్‌ అధ్యయనం

న్యూఢిల్లీ : లింగ నిష్పత్తి అంతర సూచీ (జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌-జేజీఐ)లో భారత్‌ స్థానం మరింత దిగజారింది. గతేడాది 108వ స్థానంలో ఉన్న భారత్‌.. ఈ ఏడాది నాలుగు స్థానాలు దిగజారి 112వ స్థానానికి చేరింది. మహిళల ఆరోగ్యం, మనుగడ, ఆర్థిక, రాజకీయ భాగస్వామ్యాలపై వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంలో ఐర్లాండ్‌ మొదటిస్థానంలో ఉండగా, భారత సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్‌ 50వ స్థానంలో ఉంది. ఇక పొరుగు దేశాలైన చైనా (106), శ్రీలంక (102)లు మనకంటే కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఈ విభాగంలో యెమెన్‌ చివరి స్థానం(153వ)లో ఉంది. దీనిపై జెనీవా వేదికగా ఉన్న డబ్ల్యూఈఎఫ్‌ స్పందిస్తూ… ‘తాజా గణాంకాల ప్రకారం లింగ అంతరాలు తగ్గించడానికి మరో 99.5 ఏండ్లు అవసరం అవుతుంది. ఇది గతేడాది 108 ఏండ్లుగా ఉంది. మహిళలు విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, రాజకీ యాలు, ఆర్థిక విషయాల్లో ఇంకా సమానత్వం సాధించాల్సి ఉన్నది. అంతేగాక రాజకీయాలపరంగా చూస్తే 95 ఏండ్ల వ్యత్యాసం కనబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 25.2 శాతం మహిళలు చట్టసభలకు ఎన్నికవుతుండగా, వారిలో 24.1 శాతం మంది

మంత్రి పదవుల్లో ఉన్నార’ని తెలిపింది.
ఇక ఇండియా విషయానికొస్తే.. ఇక్కడ మహిళలకు ఉపాధి అవకాశాలు చాలా పరిమితం (35.4 శాతం)గా ఉన్నాయి. ప్రయివేటు సంస్థలలో ఉన్నత పదవుల్లో (కంపెనీ బోర్డులలో) ఉన్నవారు 13.8 శాతానికే పరిమితమయ్యారు. 82 శాతం పురుషులతో పోలిస్తే నాలుగింట ఒకవంతు మహిళలు మాత్రమే కార్మిక శక్తిలో భాగమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో భారత్‌ 145వ స్థానంలో ఉన్నది. ఆరోగ్యం విషయంలో మహిళలకు ఇక్కడ సరైన వసతులు లేవని డబ్ల్యూఈఎఫ్‌ తేల్చింది. పాకిస్తాన్‌, వియత్నాంలలోనూ ఇవే పరిస్థితులున్నాయి. పుట్టినపిల్లల్లో.. వంద మంది మగపిల్లలకు గానూ 91 మందే బాలికలున్నారు. అమ్మాయిలు, గృహిణులపై పెరుగుతున్న హింస, బలవంతపు పెండ్లిళ్లు, వివక్ష కారణంగా స్త్రీల ఆరోగ్యం దెబ్బతింటుందని నివేదిక తెలిపింది. రాజకీయాలలో మహిళల సాధికారత విషయంలో గతంలో కంటే భారత్‌ కాస్త మెరుగైంది. దేశాన్ని ఓ మహిళ ఏలడంతో రాజకీయాలలో వారి ప్రాతినిథ్యం పెరుగుతూ వస్తుందనీ కానీ పార్లమెంటులో మాత్రం వారు 14.4 శాతం మంది మాత్రమే ఉన్నారని పేర్కొంది. ఈ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ 122వ స్థానంలో ఉండటం గమనార్హం.

Courtesy Nava telangana