సరైన రక్షణ సౌకర్యాలు లేకుండానే వైరస్‌తో పోరాడుతున్న వైద్యులు

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌పై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్యులకు సరైన రక్షణ పరికరాలు కూడా లేక సతమతమవుతున్నారు. కొందరు వైద్యులు రెయిన్‌ కోట్లు, మోటారు వాహనదారులు ఉపయోగించే హెల్మెట్లను ఉపయోగించి చికిత్స చేస్తున్నారు. వ్యక్తిగత రక్షణ పరికరాలును దేశీయంగా, దక్షిణ కొరియా, చైనాల నుంచి తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇటీవల ప్రకటించారు. కానీ, అవి ఇంకా అందుబాటులోకి రావటంలేదు. దేశంలో ఇప్పటివరకూ 12 మందికి పైగా వైద్యులకు కరోనా సోకింది. సరైన సదుపాయాలులేక వీరికి వైరస్‌ సోకినట్టు తెలుస్తున్నది.

కోల్‌కతాలో..
కోల్‌కతాలోని కరోనా వైరస్‌ ప్రధాన చికిత్సా కేంద్రం బెలియాఘట డిసీజ్‌ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యులకు రోగుల పరీక్షించేందుకు గతవారం ప్లాస్టిక్‌ రెయిన్‌ కోట్లను ఇచ్చారు. జూనియర్‌ వైద్యులు ఈ విషయాన్ని బయటపెట్టారు. ‘మా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నాం. తగిన వ్యక్తిగత రక్షణ పరికరాలను అందచేయాలి.. మా ప్రాణాలను ముప్పువాటిల్లితే.. ఇక చికిత్స అందించేది ఎవరు?’ అంటూ ఓ వైద్యురాలు ప్రశ్నించారు. ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ ఆసిస్‌ మన్నా దీనిపై స్పందించేందుకు నిరాకరించారు.

తమ వద్ద ఎన్‌-95 మాస్కులు అందుబాటులో లేకపోవటంతో మోటారుబైక్‌ హెల్మెట్‌ను ఉపయోగిస్తున్నానని దేశరాజధానికి సమీపంలోని హర్యానాకు చెందిన ఈఎస్‌ఐ ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ సందీప్‌ గార్గ్‌ చెప్పారు. ‘నేను హెల్మెట్‌ పెట్టుకుంటున్నాను. దానిపై శస్త్రచికిత్స ఉపయోగించే మాస్క్‌ మరొకదానిని వేసుకొని చికిత్స అందిస్తున్నాను’ అన్నారు. కాగా, దీనిపై ఆరోగ్య మంత్రిత్వశాఖ మాత్రం స్పందించటంలేదు.
తగిన రక్షణ సామాగ్రి అందుబాటులో ఉండటంలేదని హర్యానా రోహతక్‌లోని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నడుపుతున్న ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యులు ఆరోపిస్తున్నారు.

ప్రజారోగ్యంపై జీడీపీలో 1.3శాతమే…
సునామీలా చుట్టుముడుతున్న వైరస్‌ మహమ్మారి ప్రజల ప్రాణాలను తీసుకుంటున్నది. ప్రజారోగ్య వ్యవస్థే ఇప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అగ్రభాగాన నిలిచి అలుపెరుగని పోరాటం చేస్తున్నది. నిధుల కొరత అనుక్షణం వెన్నాడుతూనే ఉన్నది. మన జీడీపీలో ప్రజారోగ్య రంగానికి కేటాయిస్తున్నది కేవలం 1.3శాతమే. ఇది ప్రపంచంలో అతి తక్కువ కావటం గమనార్హం.

Courtesy Nava Telangana