‘ఒకే భాష పై వ్యతిరేకత

 “భారతదేశం అనేక భాషలకు నెలవు. ప్రతి భాషకూ ప్రాధాన్యం ఉంది. కానీ, దేశం మొత్తానికి ఒక భాష

ఉండాలి. ప్రపంచంలో దేశానికి ఒక గుర్తింపు ఇచ్చేదిగా ఆ భాష ఉండాలి. ఇప్పుడు దేశ ఐక్యతకు బాగా తోడ్పడగలిగే భాష హిందీయే. ఎక్కువగా మాట్లాడే భాష కూడా అదే”

హిందీ దివస్ సందర్భంగా భాజపా అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. హిందీ జాతీయ భాషగా ఉండాలని గానీ, ఇతర భాషలతో పాటు దేశమంతా దాన్ని తప్పనిసరిగా బోధించాలని గానీ ఎవరు సూచనచేసినా వివాదం కావడం రివాజుగా మారింది. దేశంలో ప్రధాన భాషలన్నీ హిందీ కంటే ఎందులోనూ తక్కువ కాదు. ఇంకా కచ్చితంగా చెప్పుకోవాలంటే హిందీకంటే ఎన్నో శతాబ్దాలు ముందుగా గొప్ప సాహిత్యాన్ని, పద సంపదను సృష్టించుకున్న భాషలెన్నో ఉన్నాయి. తమిళం దాదాపు రెండు వేల ఏళ్ల క్రితమే సమగ్ర భాషగా ఊపిరిపోసుకోవడం మొదలు పెట్టింది. కన్నడ, తెలుగు భాషల్లో గొప్ప సాహిత్యం వెయ్యేళ్లకు ముందు నుంచే ఉంది. అంత ఘనమైన చరిత్ర ఉండబట్టే భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని ఉద్యమాలు వచ్చాయి. సొంత భాషల్లో పరిపాలన, విద్యాబోధన సాగాలన్న ఆకాంక్ష అన్ని సమాజాల్లో కిందటి శతాబ్దం మొదట్లోనే బలంగా వేళ్లూనుకుంది. దీన్ని కాంగ్రెస్ నాయకత్వం 1920ల్లోనే ఆమోదించినా, దేశ విభజన సృష్టించిన వాతావరణం వేరేగా ఆలోచించేలా చేసింది. ఒక భాష మాట్లాడే వారికి ఒక రాష్ట్రం ఏర్పాటుచేస్తే సంకుచిత భావాలు ఏర్పడి జాతీయవాద దృక్పథానికి విఘాతం కలిగే ప్రమాదం ఉందని స్వాతంత్ర్యానంతరం నెహ్రూ, పటేల్, రాజాజీలాంటి వాళ్లు గట్టిగా భావించిన మాట నిజం. అందుకే భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటుచేయకుండా చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి పొట్టిశ్రీరాములు బలిదానంతో చరిత్ర మలుపు తిరిగింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

అన్నీ సుసంపన్నమైనవే… భాష ప్రజలను బంధించే గొప్ప శక్తి అయినా, అన్ని సందర్భాల్లోనూ అది ఆ పని చేయలేదనడానికి ఆంధ్రప్రదేశ్ చరిత్రే నిదర్శనం. ఆధునిక సమాజ అవసరాలను తీర్చే శక్తి అన్ని ప్రధాన భాషలకూ ఉందనడంలో ఎవరికీ సందేహం లేదు. కొత్త పదాలను చేర్చుకుంటూ, నిరంతరం సుసంపన్నమయ్యే శక్తి రాజ్యాంగం గుర్తించిన 22 భాషలకూ ఉందనే అనుకుందాం. కానీ, ఇన్ని భాషా సమూహాల మధ్య పెద్దయెత్తున భావాల మార్పిడికి ఉమ్మడి భాష లేకుండా సాధ్యమవుతుందా? దేశమంతా ఒక శ్రామిక విపణిగా ఏర్పడి, దేశం నలుమూలల నుంచీ ఉపాధికోసం ఎక్కడెక్కడికో వెళ్ళడం అవసరంగా మారిన తరవాత ఒక్క భాషతో వ్యవహారాలు చక్కబడతాయని చెప్పుకోలేం. ఆంగ్లం, హిందీ ఈ అవసరాన్ని తీర్చడంలో అగ్రభాగాన ఉండటం అందరికీ కనిపించే దృశ్యం. అనేకమంది అవసరార్థం హిందీని నేర్చుకుంటున్నారు. ఇక ఆంగ్లం సంగతి చెప్పాల్సిన పనిలేదు. అది నేర్చుకోకపోతే అన్ని విధాలుగా వెనుకబడిపోతామన్న భావన బలంగా నాటుకుపోయింది.

స్వాతంత్యం వచ్చిన తొలి నాళ్లలో బ్రిటీషు వారిపై కోపం ఇంకా చల్లారని నేపథ్యంలో ఆంగ్ల భాషపై వ్యతిరేకత పెద్దయెత్తునే చెలరేగింది. పరాయిపాలన పోయిన తర్వాత ఆంగ్లాన్ని అధికార భాషగా కొనసాగించాల్సి పనిలేదు. అది నేర్చుకోకపోతే అన్ని విధాలుగా వెనుకబడిపోతామన్న భావన బలంగా నాటుకుపోయింది.

స్వాతంత్యం వచ్చిన తొలి నాళ్లలో బ్రిటీషు వారిపై కోపం ఇంకా చల్లారని నేపథ్యంలో ఆంగ్ల భాషపై వ్యతిరేకత పెద్దయెత్తునే చెలరేగింది. పరాయిపాలన పోయిన తర్వాత ఆంగ్లాన్ని అధికార భాషగా కొనసాగించాల్సి అవసరం ఏమిటన్న ప్రశ్నలు రాజ్యాంగ పరిషత్తులో లోతైన చర్చలకు దారితీశాయి. స్వాతంత్యానికి ముందు మహాత్మాగాంధీ, నెహ్రూలతో పాటు మరికొందరు నేతలు హిందూస్థానీని

జాతీయ భాషగా వాడాలని – అభిప్రాయపడ్డారు. ఉర్దూ-హిందీ సమ్మేళనంగా సులభంగా మాట్లాడుకునే హిందూస్థానీ భాష దేశ అవసరాలు – తీర్చుతుందనీ, దాన్ని ఉర్దూ, దేవనాగరి లిపుల్లో రెండింటిలో రాసే అవకాశం కల్పిస్తే అనుసంధాన భాషగా | పనికొస్తుందని భావించారు. విభజనకు ముందూ తరవాతా పెరిగిన మతపరమైన సంకుచిత దృక్పథాలు హిందూస్థానీకి ఆ అవకాశాన్ని దక్కనీయలేదు. సంస్కృత పదాలతో హిందీని, అరబ్బీ-పర్షియన్ పదాలతో ఊర్దూని నింపివేయడం సమాంతరంగా జరిగాయి. సాధారణ ప్రజల అవసరాలను తీర్చే భాష రాజకీయాల కోసం పక్కకు వెళ్ళిపోయింది. గాంధీ, నెహ్రూలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. శుద్ధ హిందీని జాతీయ భాషగా చేయాలనీ, దాన్ని అన్ని ప్రాంతాల వాళ్లు విధిగా నేర్చుకోవాలని, అలా నేర్చుకోని వాళ్లు దేశభక్తులు కాలేరనే వ్యాఖ్యలు రాజ్యాంగ పరిషత్తులోనే వినిపించాయి.

జాతీయ భాష అనేది లేకపోతే దేశంలో జాతీయ భావన బలపడదనే వాదనలూ చోటు చేసుకున్నాయి. అన్ని రకాల వాదనలనూ నిగ్గు తేల్చిన తరవాత జాతీయ భాషగా ఏ ఒక్కదాన్నీ ప్రకటించకుండా దేశంలోని ప్రధాన భాషలన్నింటికీ ఒకే స్థాయి, హోదాను ఇస్తూ రాజ్యాంగంలో చోటు కల్పించారు. హిందీని మాత్రం జాతీయ స్థాయిలో అధికార భాషగా గుర్తించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 15 ఏళ్ల తరవాత, అంటే 1965 నుంచి కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలకు హిందీని వాడాలని నిర్ణయించారు. 1965 నాటికి కూడా పూర్తిగా హిందీలోనే వ్యవహారాలు నడిపే పరిస్థితి కనపడకపోవడంతో అధికార అనుబంధ భాషగా ఆంగ్లాన్ని కొనసాగించే వెసులుబాటు కల్పించారు. ఆ సమయంలోనే త్రిభాషా సూత్రం పై జాతీయస్థాయిలో ఏకీభావాన్ని సాధించారు. అప్పటినుంచి భాషాపరమైన వివాదాలు పెద్దగా తలెత్తలేదు. త్రిభాషా సూత్రాన్ని నూటికి నూరుపాళ్ళూ అమలుచేసిన రాష్ట్రం ఏదీలేదు. రాష్ట్ర అధికార భాష, దాంతో పాటు ఆంగ్లం మాత్రమే బోధనా స్థాయిలో స్థిరపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు మాతృ భాష తప్ప మరే భాషా అంతగా పట్టుబడని పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రైవేటు రంగంలో విద్యాబోధన యావత్తూ ఆంగ్లంలో కొనసాగడంతో మాతృ భాషల్లో సరిగా ఆలోచించలేని కొత్త తరాలు పుట్టుకొచ్చాయి. భాషలకు నిజమైన ప్రమాదం ఈ తరాల నుంచే ఉంది. సొంత భాష పదసంపద మెదళ్లలో ఎంతగా తగ్గిపోతే అంతగా ఆ భాష బలహీనపడుతుంది.

హిందీని విధిగా అందరూ నేర్చుకోవాలన్న దగ్గరే పేచీ మొదలవుతోంది. మాతృభాష కాని దాన్ని బలవంతంగా రుద్దడం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. శ్రీలంక అనుభవం అందరికీ తెలిసిందే. బలవంతంగా సింహళ భాషను రుద్దడంతోనే అక్కడ తమిళ తీవ్రవాదం పుట్టుకొచ్చింది. ఒక భాష వల్ల ప్రయోజనం ఉందనుకుంటేనే స్వచ్ఛందంగా జనం ఆ భాష వైపు కదులుతారు. ప్రజల అవసరాలను తీర్చని ఏ భాషా బలవంతగా కొనసాగలేదు. సంస్కృతం, పర్షియా భాషలు దేశంలో వందలాది సంవత్సరాలు అధికార భాషలుగా చలామణీ అయ్యాయి. శాసనాలు, దానపత్రాలు, రాజాజ్ఞలు ఆ భాషల్లో వెలువడినా అవి జనం భాషలు కాలేకపోయాయి. రాజభాషలు కావడం వల్ల తమ అవసరాల కోసం కావాల్సిన కొన్ని పదాలను మాత్రం జనం తమ భాషల్లోకి తెచ్చుకున్నారు. అమిత్ షా వ్యాఖ్యల విషయానికొస్తే అవేమీ కొత్తవి కావు. జనసంఘ్ కాలం నాటి నుంచి హిందీకి అగ్రపీఠం వేయాలన్నది ఆ పార్టీ నేతల విధానంగానే ఉంది. హిందీ నిర్బంధ బోధనాంశంగా ఉండాలని 1954లోనే జనసంఘ్ డిమాండ్ చేసింది. దేవనాగరిక లిపిని అన్ని భాషలూ వాడాలని అభిప్రాయపడింది. ఉన్నత విద్య హిందీలోనే ఉండాలని కోరుకుంది. అంతెందుకు … భాషా ప్రయుక్త రాష్ట్రాలకు జనసంఘ్ సుముఖత వ్యక్తం చేయలేదు. 1967 నాటికి వైఖరి కొంత మార్చుకుని స్వచ్ఛందంగా ఆమోదిస్తేనే హిందీని దేశవ్యాప్తంగా అమలుచేయాలని చెప్పింది. ఒకప్పుడు ఆంగ్లాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. ఆంగ్లం కొనసాగడమంటే భాషా బానిసత్వం కొనసాగడమేననీ విమర్శించింది. సంస్కృతం, హిందీ పునాదిగా త్రిభాషా విధానం ఉండాలని అభిప్రాయపడింది. వీటి నుంచి బీజేపీ చాలా దూరం జరిగింది. జాతి అంటే ఒక జాతీయ భాష ఉండాలనే సిద్ధాంతం ఐరోపాలో 19వ శతాబ్దంలో ప్రబలంగా ఉండేది. చాలా దేశాలు ఒక భాష, ఒక మతం ప్రాతిపదికగా అక్కడ ఏర్పడ్డాయి. ఆ సిద్ధాంతం మోతాదు మించినప్పుడు దారుణ యుద్ధాలకు దారితీసింది. ఇప్పుడు ఎవరూ దాన్ని పెద్దగా విశ్వసించడం లేదు. భారత్ లాంటి బహుళ భాషా దేశంలో ఆ సిద్ధాంతానికి ఎప్పుడూ చోటు దక్కదు.

దక్షిణాదినా విస్తరణ హిందీని బలవంతంగా రుద్దడంపై వ్యతిరేకత ఉన్నా, దక్షిణాది రాష్ట్రాల్లో సైతం ఆ భాష బాగా వ్యాపిస్తోంది. హిందీ సినిమా రంగం ఇందుకు ప్రధానకారణం. హిందీ పాట కలిగించిన మమకారం అంతాఇంతా అని చెప్పలేం. ఇక హిందీ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల సైతం ఆ భాషా వ్యాప్తిలో కీలక పాత్ర పోషిస్తోంది. 1971లో హిందీ మాట్లాడే వారు దేశ జనాభాలో 38.99 శాతం ఉంటే, 2011 నాటికి వారు 48.83 శాతమయ్యారు. బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం లాంటి ప్రధాన భాషలు మాట్లాడే ప్రజల శాతం సాక్షంగా తగ్గింది. ఉదాహరణకు 1971లో దేశ జనాభాలో తెలుగు మాట్లాడే వారి శాతం 8.16 గా ఉంటే, 2011 నాటికి 6.70కి తగ్గిపోయింది. ఈ కారణంగానే కొందరు స్వభాషాభిమానుల్లో హిందీ పై ఒక భయం నెలకొంది. హిందీని రెండో భాషగానో, మూడో భాషగానో నేర్చుకుంటే… ఎలాగూ నేర్చుకున్నారు కాబట్టి జాతీయ సమైక్యత పేరుతో భవిష్యత్తులో దానికే పెద్ద పీట వేస్తే, మిగతా భాషలు క్రమేపీ ప్రాధాన్యాన్ని కోల్పోయే ప్రమాదం వస్తుందనేది వాళ్ల భావన. ఇన్ని భయాలు ఉన్న నేపథ్యంలో జాతీయ ఐక్యతను హిందీ భాషతో ముడిపెట్టే ఆలోచనకు వ్యతిరేకతే వ్యక్తమవుతుంది.

జాతీయ భాష ఉంటేనే జాతీయవాదం ఉంటుందనే వాదనను ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్ర నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఒక భాషతో భారత్ ను ఎవరూ గుర్తించటం లేదు. బహుభాషల, బహుమతాల ప్రజలతో ఘనంగా వర్ధిల్లుతున్న స్వేచ్ఛా ప్రజాస్వామ్యంగానే దాన్ని గుర్తిస్తున్నారు. అదే మనకు గర్వకారణం. ప్రపంచం మన అనుభవం నుంచి నేర్చుకునేది ఆ ఘనతనే!

– ఎన్. రాహుల్ కుమార్.