* పెట్రో పైప్‌లైను పేరిట ఏడు జిల్లాల్లో ఇష్టారాజ్యం
* కంటితుడుపు పరిహారంతో కలకలం
* భగ్గుమంటున్న రైతాంగం
* 25న విజయనగరంలో కలెక్టరేట్‌ వద్ద ధర్నా
                 ‘పెట్రో పైప్‌లైన్‌ పేరిట రాష్ట్రంలోని ఏడు జిల్లాలో కేంద్ర సర్కారు చేస్తున్న భూ కబ్జా ఇది . గ్రామసభలు, చర్చలు, రైతుల అంగీకారం లేకుండా భూమిని గుంజుకుంటున్న అధికారులు అచ్చంగా కబ్జాదారులు మాదిరే వ్యవహరిస్తున్నారు. సెంటు భూమికి రూ.రెండు వేలు మాత్రమే పరిహారం ఇస్తాం. ఇది రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్ణయించిన ధర. అంతేకాదు… ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. వద్దంటే ఈ డబ్బులు కూడా రావు.అని పారాదీప్‌ నుంచి హైదరాబాద్‌ వరకూ పెట్రోలియం పైప్‌లైన్‌ ఏర్పాటు చేస్తోన్న ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఒసిఎల్‌) అధికారులు రైతాంగాన్ని బెదిరిస్తున్నారు. శ్రీకాకుళంలో సెంటుకు రెండు వేలిచ్చి, విజయనగరం జిల్లాలో ప్రాంతాన్ని బట్టి రూ.2,200 నుంచి 3,100 ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తోంది. ఇతర జిల్లాలోనూ పరిస్థితి ఈ విధంగానే ఉంది. ఈ ధర తమకు ఏ మాత్రమూ ఆమోదయోగ్యం కాదని, భూసేకరణ చట్టం ప్రకారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. స్థానిక రైతులకు అండగా నిలిచి, వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులూ ఐఒసిఎల్‌ చెప్పిన మాటలకు తల ఊపుతున్నారు. దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి నుండి రైతులను కాపాడాలని, ఆయా జిల్లాల్లో ఉన్న డిమాండ్‌ను బట్టి సెంటు భూముకి రూ.25 వేలు నుంచి రూ.36 వేలు ఇవ్వాలని ఎపి రైతు సంఘం డిమాండ్‌ చేస్తోంది. భూసేకరణ చట్ట ప్రకారం డబ్బులు చెల్లించకుంటే, పనులను అడ్డుకుంటామని రైతులు హెచ్చరిస్తున్నారు.
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి
ఒడిశాలోని పారాదీప్‌ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ వరకు రూ.3,338 కోట్ల వ్యయంతో 1,212 కిలోమీటర్ల పైపులైన్‌ను ఐఒసిఎల్‌ నిర్మిస్తోంది. రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా 723 కిలోమీటర్లు, తెలంగాణలో 160 కిలోమీటర్లు, ఒడిశాలో 329 కిలోమీటర్ల మేర పైపులైన్‌ వేయనున్నారు. ఆరు అడుగుల లోతు, మూడు అడుగుల వెడల్పుతో శ్రీకాకుళం జిల్లాలో సుమారు 140 కిలోమీటర్ల మేర ఇచ్ఛాపురం నుంచి లావేరు వరకూ మొత్తం 16 మండలాల్లోని 133 గ్రామాల మీదుగా పైపులైను నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే కొన్నిచోట్ల పనులు కూడా చేపట్టింది. ఐఒసిఎల్‌ ప్రతినిధుల బెదిరింపులు, అధికారుల అదిలింపులతో శ్రీకాకుళం జిల్లా రైతులు చెక్కులను తీసుకున్నారు. అయితే, తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆలస్యంగా గుర్తించిన రైతులు పనులను ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ప్రస్తుతం నిలిచిపోయాయి. విశాఖ, విజయనగరం జిల్లాల రైతులు రెండు నెలల క్రితం విశాఖలోని ఐఒసిఎల్‌ కంపెనీ ముందు ధర్నా చేశారు. అయినా, ఐఒసిఎల్‌ ఏకపక్షంగా ముందుకు సాగుతోంది. పరిహారం చెల్లింపుల్లో అన్యాయంపై ఈ నెల 25న విజయనగరం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేయాలని రైతులు ఇప్పటికే నిర్ణయించుకున్నారు.

రైతులతో చర్చించకుండానే ధర నిర్ణయం
రైతులతో చర్చించి వారికి ఆమోదయోగ్యమైన పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాల్సిన ఐఒసిఎల్‌ అందుకు భిన్నంగా ఏకపక్షంగా ధర నిర్ణయించి అమలు చేస్తోంది. లావేరు మండలం వెంకటాపురంలో ఎస్‌.అప్పలనాయుడుకు ఐదెకరాలుంది. అందులో 70 సెంట్లలో పైపులైను వేశారు. సెంటు భూమికి రూ.రెండు వేలు చొప్పున రూ.1.40 లక్షలే ఇచ్చారు. మెయిన్‌ రోడ్డును ఆనుకొనివున్న ఆ ప్రాంతంలో సెంటు భూమి రూ.50 వేలు వరకూ ఉంది. రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్ణయించిన ధరలనే లెక్కించి ఇస్తున్నామని, ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అని, వద్దంటే ఈ డబ్బులు కూడా రావని అధికార్లు హెచ్చరించడంతో చేసేది లేక చెక్కు తీసుకున్నానని ‘ప్రజాశక్తి’ వద్ద ఆ రైతు వాపోయారు. పైపులైను పనుల కోసం ప్రొక్లయిన్‌తో తవ్వకాలు చేయడంతో తన పొలం ధ్వంసమైందని, చదును చేసుకునేందుకు రూ.పది వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే మండలం పోతయ్యవలసలో సతివాడ అనంతకు రెండెకరాలు పొలం ఉండగా, అందులోని 35 సెంట్లలో పైపులైన్‌ వేశారు. 40 అరటి చెట్లు, 12 తాటిచెట్లు, ఆరు మునగ చెట్లు ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి రూ.1.23 లక్షలు మాత్రమే ఇచ్చారు. పైపులైన్‌ వేయడానికి ధ్వంసం చేసిన భూమిని ఆయన తన సొంత ఖర్చుతో యథాస్థితికి తీసుకొచ్చాడు. ఇక్కడ సెంటు భూమి రూ.25 వేల వరకు ఉంది.

పెట్రోలియం, మినరల్‌ చట్టం ప్రకారం చెల్లింపులు
పెట్రోలియం, మినరల్స్‌ పైపులైను చట్టం-1962 మేరకే పరిహారం చెల్లిస్తు న్నామని ఐఒసిఎల్‌ సమర్థించుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులూ ఐఒసిఎల్‌కే వంత పాడుతున్నారు. పైపులైన్లు వేస్తున్నారుగానీ, భూములు తీసుకో వట్లేదు కదా అంటూ రైతుల డిమాండ్‌ను తోసిపు చ్చుతున్నారు. పైపులైను వేసిన తర్వాత ఆ భూముల్లో బావులు, చెరువులు, జలాశయాలు, గృహ నిర్మాణాలు, కట్టడాలు, మొక్క లు నాటడం వంటివి నిషిద్ధమని నోటీసుల్లో ఐఒసిఎల్‌ పేర్కొంది. దీంతో, తమ భూములను ఇతర అవస రాలకు వినియోగించుకునేందుకు, కుటుంబ పరిస్థి తినిబట్టి రియల్‌ ఎస్టేటు వారికి అమ్ముకొనేందుకు వీలుండదని రైతులు వాపోతున్నారు..

రైతులకు న్యాయం చేస్తాం
పైపులైను కోసం భూములు ఇస్తున్న రైతులకు న్యాయం చేస్తాం. పనులు పూర్తయిన తర్వాత పొలాలను యథాస్థితికి తీసుకురావాల్సిన బాధ్యత కంపెనీదే.
బి.శ్రీనివాసులు, జాయింట్‌ కలెక్టర్‌, శ్రీకాకుళం

పనులు అడ్డుకుంటాం
పైపులైను వేసిన తర్వాత భూమి ధరలు పడిపోతున్నాయి. భూసేకరణ చట్టం ప్రకారం అయినా డబ్బులు చెల్లించాలి. లేకుంటే పనులను అడ్డుకుంటాం.
మీసాల రమణ, వెంకటాపురం, శ్రీకాకుళం

Courtesy Prajasakthi…