భారత్‌లో కేసులు 21 లక్షలను మించి పోవచ్చు
యేల్‌ స్కూల్‌ శాస్త్రవేత్త మనీషా జుతానీ హెచ్చరిక
నవంబర్‌లో కేసులు పీక్‌ స్టేజీకి: ఐసీఎమ్మార్‌
దవాఖానలు సరిపోకపోవచ్చని ఆందోళన
మళ్లీ లాక్‌డౌన్‌ బాటలో తమిళనాడు

దేశంలో కరోనా కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పాజిటివ్‌ కేసుల విషయంలో ఇండియా అమెరికాను కూడా దాటవచ్చని ఆ దేశానికి చెందిన ఓ శాస్త్రవేత్త అంచనా వేశారు. ఈ అంచనాకు తగినట్లుగానే ఐసీఎమ్మార్‌ ఏర్పాటు చేసిన ఓ కమిటీ జరిపిన అధ్యయనం కూడా.. నవంబర్‌లో దేశంలో కరోనా కేసులు పీక్‌ స్టేజీకి (అత్యధికసంఖ్యకు) చేరుకోవచ్చని హెచ్చరించింది. మరోవైపు, కరోనా విజృంభణ దృష్ట్యా రాష్ట్రాలు మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా కసరత్తు ప్రారంభించాయి. మంగళ, బుధవారాల్లో ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్‌ కేసుల్లో భారతదేశం అమెరికాను దాటినా అశ్చర్యపోనవసరం లేదని ఆ దేశానికి చెందిన యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌ శాస్త్రవేత్త మనీషా జుతానీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరికాలో 21 లక్షల కేసులు నమోదయ్యాయి. మనదేశంలో సోమవారానికి నమోదైన కేసుల సంఖ్య 3,32,424కు చేరుకున్నది. మూడు రోజులుగా దేశంలో సగటున 11వేలకు పైగా కేసులు నమోద వుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మనీషా జుతానీ తన అంచనాలను వెలువరిం చారు. ఈ ఏడాది చివరి దా కా భారత్‌లో కేసుల పెరుగుదల నమోదవుతూనే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రత తగ్గేలోపు ఇండియాలో కేసులు అమెరికాను దాటేస్తాయన్నారు.

ఐసీఎమ్మార్‌ చేసిన ఓ అధ్యయనం మనీషా అంచనాలను సమర్థించే విధంగా ఉంది. దేశంలో నవంబర్‌ నాటికి కరోనా కేసులు గరిష్ఠస్థాయికి చేరుకొంటాయని ఐసీఎమ్మార్‌ ఏర్పాటు చేసిన ఆపరేషన్స్‌ రీసెర్చ్‌ గ్రూప్‌ అధ్యయనం వెల్లడించింది. లాక్‌డౌన్‌ వల్ల దేశంలో కేసుల పెరుగదల నెమ్మదించిందని, కేసులు పీక్‌ స్టేజీకి చేరే సమయం 34-76 రోజులకు పెరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. కట్టుదిట్టమైన ఆంక్షల కారణంగానే దేశంలో కరోనా కేసులు 83 శాతం తక్కువగా నమోద య్యాయని స్పష్టం చేశారు. అయితే, కరోనా విజృంభణ నేపథ్యంలో నవంబర్‌ నెలలో కరోనా కేసులు పీక్‌ స్టేజికి చేరుకుంటాయని, ఆ నెల మధ్యకు దవాఖానాలు నిండిపోయి బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తంచేశారు. కరోనా నివారణకు దేశ జీడీపీలో 4.5 శాతం ఖర్చు కావొచ్చని ఈ నివేదికలో అంచనావేశారు.

24 గంటల్లో 11,502 కొత్త కేసులు
దేశవ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 24 గంటల్లో కొత్తగా 11,502 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 325 మంది చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,424కు చేరుకున్నది. మరణాలు 9,520కి పెరిగాయి. ఒక్కరోజులో 11వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇది మూడో రోజు. ఇప్పటి వరకు కొవిడ్‌ నుంచి 1,69,797 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 51.07 శాతంగా నమోదైంది.

19 నుంచి చెన్నైలో లాక్‌డౌన్‌
తమిళనాడులో రాజధాని చెన్నైతో పాటు పరిసర జిల్లాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే పళనిస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. చెన్నై, గ్రేటర్‌ చెన్నై పరిధిలోకి వచ్చే చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో ఈ నెల 19-30 వరకు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధించనున్నట్టు వెల్లడించారు. ఈ జిల్లాల్లోని రేషన్‌కార్డుదారులు, కార్మికులు, పేదలకు ఆర్థిక సహాయం కింద రూ. 1000 అందించనున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా గుజరాత్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను మళ్లీ విధించాలన్న ఆలోచన ఏమీ లేదని ఆ రాష్ర్టాల సీఎంలు ప్రకటించారు. మరోవైపు, కరోనా పరీక్షలకు సంబంధించి పొరుగు రాష్ట్రాలకు సాయం చేస్తామని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ముందుకొచ్చారు.

Courtesy Namasthe Telangana