సజాతీయ విజ్ఞానంలోనే కరోనాకు సరైన మందు

సృష్టి ఆదినుండి అనేక ప్రకృతి విపత్తులు కరువు-కాటకాల, అంటురోగాల, భూకంప-సునామీల రూపాల్లో సహజంగానే చోటుచేసుకుంటాయి. అప్పుడప్పుడు కొంతమంది స్వార్థ మానవులు కృత్రిమ విపత్తులను సృష్టించి, వాటి విలయ తాండవాలను చూస్తూ వికృతానందాన్ని పొందుతారు. ఇది ఒక వికిలి చేష్ఠ. ప్రస్తుతం మన ముందున్న కరోనా మహమ్మారి మాత్రం సహజ పరిణామంలో భాగంగానే పుట్టుకొచ్చింది కాని, మానవ మాత్రులెవరు దానిని సృష్టించలేదు. అశాస్త్రీయతను పుడుముకున్న ఆధునికానంతర మానవులు ఆవేశంతో కొన్ని దేశాలను, మతాలను, సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ కాలయాపన చేస్తున్నరే తప్ప, అసలు సమస్య నిర్మూలన గురించి ఆలోచించడం లేదు. ఇంకా ఆధునిక భావాలను ఆవృతం చేసుకున్న బుద్ధిజీవులు సైన్సు, శాస్త్రీయతపట్ల మక్కువ చూపతున్న ఆధునిక శాస్త్రీయ భావనలను సజాతీయ వైజ్ఞానిక పద్దతులకు జోడించి ఏదైనా పరిష్కారాన్ని కనుగొందమన్న విచారణను చేయడం లేదు!

స్థూలంగా అటు ప్రాచీన, ఆధునికానంతర దేవుళ్ళు, ఇటు ఆధునిక సైన్సు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో విఫలమైనాయి. అందువల్లనే, భక్తులు, వైద్యులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులతో సహా ప్రజలందరూ ఒక అనిశ్చితిలోకి నెట్టబడ్డారు. కరోనా కరాళ నృత్యం నుండి ఎలా బయట పడతామన్నది ఒక ప్రశ్నయితే? కరోనానంతర కాలపు ప్రపంచాన్ని అంచనావేసి, దానికి తగినట్లు విధానాలను ఎలా రూపకల్పన చేయాలన్నది మరొక సవాలు. ఏది ఏమైనప్పటికీ, కరోనా మహమ్మారిని ఎంత త్వరగా నిలువరిస్తే, అంత ప్రాణ, ఆర్థిక నష్టాలను తగ్గించవచ్చు. ఇక ఆధునిక సైన్సుకు కరోనాను ఎదుర్కొనే శక్తి కల్గియుందన్న అంశాన్ని తాత్వికంగా, శాస్త్రీయంగా పరిశీలిద్దాం.

ఆధునిక సైన్సు 14వ శతాబ్దంలో పాశ్చాత్య దేశాలల్లో చోటు చేసుకున్న జ్ఞానవికాసయుగం ద్వారా వెలుగులోకి వచ్చింది. 14 నుండి 20వ శతాబ్దం వరకు అనేక సిద్దాంతాలను అభివృద్ధి చేసి, ఆవిరి యంత్రం నుండి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దాక అద్భుతమైన అనేక సాంకేతిక పరికరాలను సృష్టించింది. మతాల భావవాద ఆధ్యాత్మిక సిద్దాంతాలను తుంగలోకితొక్కి భౌతికవాద, పరిణామ సిద్దాంతాలను ఆకాశానికి ఎత్తింది. యావత్తు ప్రపంచ పోకడనే మార్చేసింది. ఈ ఆధునిక కాలం మహా అద్భుతమైనదే కాని, కొన్ని స్పష్టమైన లోటుపాట్లను కల్గియుంది. ఉదాహరణకు ఈ కాలంలో కనుక్కొన్న మోటారు వాహనాల మూలంగా కాలుష్యం, మెడిసిన్ మూలంగా సైడ్ ఎఫెక్ట్ లు, మొబైల్ మూలంగా రేడియేషన్ వంటి పలు నూతన సమస్యలు ఉత్పన్నమైనవి. అంటే ఆధునిక శాస్త్రవిజ్ఞానం అందించిన సాంకేతికతలల్లో ఆచరణ పరమైన లోపాలున్నవనేది సుస్పష్టం.

ఈ లోపాలను ఎత్తి చూపుతూ అభివృద్ధి కాదు, సుస్థిరాభివృద్ధి కావాలంటు ఆధునికానంతర శాస్త్రవేత్తలు పుట్టుకొచ్చారు. వీరందరూ 21వ శతాబ్దానికి చెందినవారు. దీని మూలంగా భౌతికవాద సిద్ధాంతాల ప్రతిపాదనల ఆధారంగా మానవ మేధస్సు ఏ సమస్యనైన పరిష్కరిస్తుందన్న ఆధునికవాదానికి తూట్లు పడి, మానవ మేధస్సు పరిమితమైందని, దాని ద్వారా అసలైన సత్యాలను శోధించలేమనే సాపేక్షవాద ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. పైగా శాస్త్రం చనిపోయిందని, చరిత్ర అక్కరకు రానిదని, భావజాలాలు అసంబంధమైనవని చెబుతూ వ్యక్తి కేంద్రక ఆలోచన విధానాన్ని సృష్టించారు. ఈ దెబ్బతో మోటానరేటివివులు (సంపూర్ణ హేతువులు) కూలిపోయాయి, శాస్త్రాభివృద్ధి ఆగిపోయింది. ప్రాస అలంకార ప్రాయమైన వినూత్న భాషా పదజాల ప్రయోగాలతో విభేదికరణ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అందువల్లనే 21వ శతాబ్దంలో నూతన సాంకేతిక పరికరాలు పాత సిద్ధాంతాల ప్రాతిపాదికన విరివిగా ప్రాచుర్యంలోకి వచ్చిన, తాత్వికంగా, శాస్త్రీయంగా ఒక్క నూతన సిద్ధాంతాన్ని కూడ కనుక్కోలేకపోయిందన్నది నగ్నసత్యం.

కరోనా రుగ్మతను నిగూఢంగా పరిశీలిస్తే అది ఒక ఆధునికాంతర వ్యాధి అని అర్థమవుతుంది. ఎందుకంటే, ఆధునిక శాస్త్రీయ ధర్మం ప్రకారం ఏ వ్యాధైన ఖచ్చితంగా మందుల ద్వారా నయం కావాలి, కాని కరోనాకు మందులు లేవు. వాటికి బదులుగా భౌతిక దూరం, క్వారంటైన్, చేతులు కడుక్కోవడం లాంటి సామాజిక ఆచరణలను మనం నివారణోపాయాలల్లో భాగంగా పాటిస్తున్నాం. తాత్వికంగా చెప్పాలంటే ఆధునిక వైద్య సిద్ధాంతపు సరిహద్దులను దాటిన కరోనాకు ఆధునిక శాస్త్రీయ మెథడాలజీ ప్రకారం ఖచ్చితమైన మెడిసిన్ కనుక్కోవడం ఇప్పటికిప్పుడే సాధ్యం కాదు. అలాగే, ఆధునికానంతర వైజ్ఞానిక ప్రమేయాల భౌతిక దూరం, క్వారంటైన్ వంటి సామాజిక ఆచరణల ద్వారా కరోనా నిర్మూలన అంత తేలికైన పనికాదు. పైగా చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. కనుక, ఈ రెండు కాలాల ముందున్న సజాతీయ వైజ్ఞానిక దృక్పథాల ద్వారనే మనం ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనవచ్చు.

ఆధునిక చికిత్స సంపూర్ణంగా ‘రసాయన-భౌతిక పదార్థాల సమ్మేళనం’ ఆధారంగా జరుగుతుంటే, సజాతీయ చికిత్స మాత్రం ‘జైవిక-రసాయన సమ్మేళనం’ ద్వార జరుగుతుంది. అందువల్లనే సజాతీయ వైద్యులు జీవశక్తి కల్గియున్న పసరులను, పదార్థాలను మందులుగా మారుస్తారు. జీవులన్ని తీసుకునే ఆహారం కూడా ఈ కోవకే చెందుతుంది. కాని ఆధునిక వైద్యులు జడ పదార్థాల నుండే మందులను తయారు చేస్తారు. ఇది పూర్తిగా యాంత్రికపరమైనది. ప్రస్తుత తరుణంలో కరోనా నివారణకు జైవిక పదార్థమైన రక్తం నుండి వేరుచేసిన ప్లాస్మాను ఔషధంగా వాడాలనే వాదన ప్రపంచవ్యాప్తంగా ముందుకొస్తుంది. ఈ చికిత్సా విధానం భారతీయ సాంక్రమిత వ్యాధుల నివారణను పోలి ఉంది. ఈ చికిత్స ఉదాహరణలు మనదేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే భారతీయ సజాతీయ విజ్ఞానపు చికిత్సకు ఆధునిక సాంకేతికతలను అన్వయిస్తే మంచి ఫలితాలను రాబట్టవచ్చు.

మన దేశంలో సంభవించే సాంక్రమిత వ్యాధుల నివారణకు గ్రామీణ దేవతలకు ప్రత్యక్ష సంబంధం ఉంది. చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ వంటి రోగాలు మానవులకు లేదా జంతువులకు సంక్రమించినప్పుడు తెలుగు రాష్ట్రాలలో పోచమ్మ, ముత్యాలమ్మ వంటి దేవతలను కొలవడం జరుగుతుంది. నిజానికి వారు దేవతలు కారు. సాంక్రమిత వ్యాధులకు మందులు కనిపెట్టిన మొదటి వైద్యులు. హరప్ప కాలం నాటి చారిత్రాత్మక మూర్తులు. ఆ తర్వాతి కాలంలో ఆర్యుల రాక మూలంగా ఇలాంటి విజ్ఞానమంతా ఆయుర్వేదంగా సంస్కృత భాషలో గ్రంథస్థమయ్యింది. శుద్ధి, అంటరానితనం, మైల, వర్ణం వంటి కుహనా ఆచరణల మూలంగా ఆయుర్వేదం సాధారణ జబ్బుల చికిత్సలకే పరిమితం చేయబడింది. వైద్య-ఆరోగ్య అత్యవసర కేసులైన ప్రసూతి, ఎముకలు విరగడం, పాము-తేలు కాటు, పశువైద్యం లాంటి సమస్యలకు సజాతీయ వైద్యులే నేటికి మన గ్రామాలలో చికిత్సను అందించడం మనం చూస్తున్నాం. శ్రమజీవులు, నిమ్నవర్గాలు ఈ రంగాలలో ఎక్కువగా ఉన్నందున ఈ చికిత్సలోనున్న శాస్త్రీయతను పరిశీలించకుండానే దానికి “నాటు వైద్యం” అనే మోటు పేరును తగిలించారు. వాస్తవానికి క్వారంటైన్, వైరియోలేషన్ హెర్డ్ ఇమ్యూనిటీ భావనలు భారతీయ మూలవాసులకి ఏనాడో తెలుసు.

జంతువుల్లో గాలి ద్వారా సంక్రమించే స్పోటకం ఛాయలు(స్మాల్ పాక్స్) ఒక ప్రాంతంలో కనబడితే, గొర్రెల కాపరులు ఆ సమాచారాన్ని మిగతా గ్రామాలకు వేగంగా అందిస్తారు. గొర్రెలమందలకు అప్పటికప్పుడు హెర్డ్ క్వారంటైన్ నిబంధనను అమలు పరుస్తారు. ఈ వ్యాధి గాలి ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి, క్వారంటైన్ కూడ మందను రక్షించలేదని భావించిన గొర్రెలకాపరులు హెర్డ్ క్వారంటైన్ తో పాటుగా ‘హెర్డ్ ఇమ్యూనిటి’ ప్రక్రియకు వెళ్ళుతారు. ఈ క్రమంలో వ్యాధితో బాధపడుతున్న సమీప గొర్రెల మందలోకి వెళ్లి, అక్కడ చాలా సంక్లిష్టమైన వ్యాధి లక్షణాలున్న ఒక గొర్రెను పెంచుకొని, దానిని ఎలాంటి ఇన్ఫెక్షన్ లేని మంద దగ్గరికి తీసుకువస్తారు. వ్యాధిగ్రస్తమైన ఆ గొర్రె స్పోటకాల నుండి ప్లాస్మాను జాగ్రత్తగా తీసి, ప్లాస్మాకు ఒక ప్రత్యేకమైన చెట్టు పసరును కలిపి ‘గోరుకాలు’, ‘కీలు కత్తి’ లనే సర్జికల్ పరికరాల ద్వారా ఆరోగ్యకరమైన గొర్రె చెవి మీద చిన్న గాటు పెట్టి ప్లాస్మాను ఇన్జెక్ట్ చేస్తారు. దీని వల్ల ఆరోగ్యకరమైన గొర్రెలకు కూడ వైరస్ సంక్రమించిన, పసరు ద్వారా గొర్రెల శరీరంలోకి వెళ్లిన పసరుభరిత ప్లాస్మా విపరీతమైన యాంటీబాడీస్ లను అభివృద్ధి చేయడమే కాకుండా. వైరస్ మూటేషన్ ను గణనీయంగా తగ్గిస్తుంది. ఆ తర్వాత పదిహేను రోజుల క్వారంటైన్ వెళ్ళిన మందలలో క్రమక్రమంగా వ్యాధి నిరోధకశక్తి వస్తుంది. ఇలాంటి చికిత్సను పొందిన ఒక జీవి, తన జీవితకాలం మొత్తంలో మళ్లీ ఆ వైరస్ బారిన పడదు. ఈ ప్రక్రియను గమనించిన ఆధునిక శాస్త్రవేత్తలు 1923లో ‘హెర్డ్ ఇమ్యూనిటి’ భావనను పబ్లిక్ హెల్త్ లోకి తీసుకవెళ్ళారు. ఈ వాస్తవాన్ని ‘హెర్డ్’ అనే పదమే సూచిస్తుంది. ‘హెర్డ్’ అనగా ‘మంద’ అని అర్థం.

మనుష్యులల్లో ఇలాంటి సాంక్రమిత వ్యాధులు చోటుచేసుకున్నప్పుడు, వ్యాధి నుండి కోలుకుంటున్న వ్యక్తి యొక్క ప్లాస్మాను గురిగిలల్లో (చిన్నకుండ) సేకరించి, పోచమ్మ గుడి ముందు దానికి పసరు కలిపి ఆరోగ్యంగానున్న వ్యక్తుల కండరాల మీద సూదులతో ఇంజెక్ట్ చేస్తారు. ఒకవేళ ఆ సూదికాటు నరం మీద పడినట్లయితే ఆ నరం పూర్తిగా వాచి, పెద్ద పుండుగా తయారవుతుంది. కండరాల మీద వేసిన సూది పోట్ల మూలంగా బబ్బర/వేరుశనగ గింజంత బొబ్బ పుడుతుంది. ఈ బొబ్బ పుట్టడంను చికిత్స విజయసంకేతానికి సూచకంగా పరిగణిస్తారు. ఈ బొబ్బలే తర్వాత కాలంలో పుండ్లు అవుతాయి. వాటి తాలూకు బర్రలను/మర్రలను మనం నేటికీ జనపదుల మధ్య గుర్తించవచ్చు. ఈ ప్రక్రియనే ఆధునిక సైన్స్ టీకాలని పేర్కొంటుంది.

చైనా దేశపు కరోనా చికిత్సకు సంబంధించిన మెడికల్ పరిశోధన జర్నల్స్ పరిశీలిస్తే చైనా సాంప్రదాయక మెడిసిన్ పాత్ర మనకు అవగతమవుతుంది. పైగా అక్కడి పరిశోధకులు పసరు మందులలో యాంటీవైరల్ సామర్థ్యాలు లేవనే పాశ్చాత్య భావనను విడనాడి, పాశ్చాత్య, సజాతీయ చైనా మందులను జమిలిగా కోవిడ్-19 రోగులకు ఇవ్వాలని సూచించారు. క్రిటికల్ కేసుల విషయంలో సాంప్రదాయ చైనా మందుల పనితీరును శ్రద్ధగా క్రోడీకరించారు. నిజానికి చైనీయులు భారతదేశానికి చెందిన బౌద్ధ గురువైన బోధిధర్మ నుండి ఈ పరంపరను నేర్చుకున్నారు. విస్తృతమైన సజాతీయ విజ్ఞానం ఉన్న మన దేశంలో సాంప్రదాయ వైద్యాన్ని ఇలాంటి సంక్లిష్టమైన సమయంలోనైన ప్రభుత్వాలు, పరిశోధకులు గుర్తించకపోవడం దురదృష్టం. గత వారంలో మన రాష్ట్ర గవర్నర్ ఆయుర్వేద, సజాతీయ గిరిజన చికిత్సలను పరిశీలించాలని చెప్పడం గమనార్హం. ఏది ఏమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భారతదేశం ఈ సమస్యకు పరిష్కారాన్ని తన చారిత్రాత్మక అనుభవం నుండి ఇవ్వగలదన్న ఆశాభావాన్ని గుర్తుంచుకొని సజాతీయ వైద్య పరిశోధన నూతన ధృక్కోణంలో మొదలు పెట్టినట్లైతే కరోనాకు ఖచ్చితమైన టీకాను మనమే ప్రపంచానికి అందించగలం.

డాక్టర్‌ భీనవేణి రామ్ షఫర్డ్
అసిస్టెంట్ ప్రొఫెసర్, సోషియాలజీ విభాగం,
ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్,
చరవాణి: 94925 74081
ఈమెయిల్‌: bheenaveni@gmail.com