• యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించండి
  • 2 నెలల కార్యాచరణ సిద్ధం చేసుకోండి
  • రాష్ట్రానికి కేంద్ర బృందం సూచన
  • హైదరాబాద్‌నగరంలో పర్యటన

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా టెస్టులు, ట్రేసింగ్‌ పెంచాలని, యాంటీజెన్‌ టెస్టులు చేయాలని సర్కారుకు కేంద్ర బృందం సూచించింది. కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వచ్చే రెండు నెలలో చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు సూచించింది. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని కేంద్ర బృందం సోమవారం హైదరాబాద్‌లో పర్యటించింది. తొలుత గచ్చిబౌలి లోని తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ అఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌), గాంధీ ఆస్పత్రి, తర్వాత కట్టడి ప్రాంతమైన దోమల్‌ గూడలోని దోభీ గల్లీని సందర్శించి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరీశిలించారు. టిమ్స్‌ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌, ఐసీయూ విభాగాల్లో ఏర్పాటు చేసిన సదుపాయాలను కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారు. ధోబీగల్లీలో 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో కేంద్ర బృందం ఇక్కడ సందర్శించింది. ఈ ప్రాంతంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ముషీరాబాద్‌ డివిజన్‌ పటాన్‌బస్తీలోని కట్టడి ప్రాంతాన్ని పరిశీలించారు. మరోవైపు గాంధీ ఆస్పత్రికి కేంద్ర వైద్య బృందం వస్తున్నారని తెలుసుకుని ఆస్పత్రిని అద్దంలా తయారు చేశారు.

కేంద్ర బృందం సభ్యులు గాంధీ ఆస్పత్రిలోకి వెళ్లకుండా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ప్రకాశ్‌రావు చాంబర్‌కు వెళ్లారు. పది నిమిషాలు మాత్రమే గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు తదితరులతో సమావేశమయ్యారు. అక్కడనుంచి గాంధీ ఆస్పత్రికి వెళ్లకుండానే తిరిగి వెళ్లిపోయారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, సీనియర్‌ ఆధికారులతో సమావేశమై కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకోవాలసిన చర్యల పై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో కొవిడ్‌ మేనేజ్‌ మెంట్‌ పై ప్రజారోగ్య సంచాలకులు డాక్టగర్‌ గడల శ్రీనివాసరావు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్రంలో సర్వైలెన్స్‌, కంటైన్మెంట్‌ చర్యలు, ఆస్పత్రుల సన్నద్దత, వైద్య సంరక్షణ పరికరాల సమీకరణ, వైరస్‌ నివారణ చర్యలపై కేంద్ర బృందానికి వివరించారు. ఇక కేంద్ర బృందం ఇతర రాష్ర్టాల క్షేత్ర స్థాయి పర్యటనల అనుభవా న్ని పంచుకుంది. కేంద్ర బృందం రాష్ట్రంలో కరోనా నియత్రణ చర్యలు, వైద్య పరీక్షల సామర్థ్యం పెంచడం, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ మరియు క్లినికల్‌ మెనేజ్‌ మెంట్‌ పై సూచనలు చేసింది.

అన్నింటికి సిద్ధంగా ఉన్నాం :కేంద్ర బృందానికి రాష్ట్ర సర్కారు వెల్లడి
రాష్ట్రంలో కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి తెలియజేసింది. వైరస్‌ పరంగా ఎలాంటి విపత్తు వచ్చి నా ఎదర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర బృందానికి పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్‌లో వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కోవిడ్‌ ఆస్పత్రులు ఉన్నాయని 33 జిల్లాల్లో ఇందుకోసం 107 ఆస్పత్రులను గుర్తించడమే కాక తగిన మౌలిక వసతులు ఏర్పాటు చేశామని వెల్లడించింది.

ఆస్పత్రుల్లో మొత్తం బెడ్ల సంఖ్య: 17081
మొత్తం ఐసోలేషన్‌ బెడ్లు : 15465
ఐసీయూ బెడ్లు : 1145
వెంటిలెటర్లు ఉన్న ఐసీయూ బెడ్లు : 471
ఆక్సిజన్‌ పైపు లైను కలిగిన బెడ్లు : 3537
ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేయాలనుకున్న సంఖ్య : 12030

Courtesy Andhrajyothi