• ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,
  • నిర్మాత సురేశ్‌బాబు ఇంట్లో సోదాలు
  • రామానాయుడు స్టూడియో, సురేష్‌
  • ప్రొడక్షన్స్‌ ఆఫీసుల్లో పత్రాల పరిశీలన
  • వెంకటేశ్‌, నాగార్జున, నాని ఇళ్లల్లోనూ?

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు.. ఇళ్లు కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ ప్రత్యేక బృందాలు బుధవారం సోదాలు నిర్వహించాయి. సురేశ్‌ బాబు సోదరుడు, ప్రముఖ హీరో వెంకటేశ్‌తోపాటు హీరోలు నాగార్జున, నాని ఇళ్లల్లో.. హారికహాసిని క్రియేషన్స్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థల కార్యాలయాల్లో, ఐటీ అధికారులు సోదాలు జరిపినట్లు సమాచారం. వేర్వేరు బృందాలుగాఏర్పడ్డ ఐటీ అధికారులు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.

ఆయా ప్రముఖుల ఆదాయవ్యయాలు, పన్ను చెల్లింపులకు సం బంధించిన కీలకపత్రాలు, సాంకేతిక ఆధారాలను స్వాధీ నం చేసుకున్నారు. ఒకే రోజు.. ఒకే సమయంలో.. ఇలా సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు నిర్వహించడం సంచలనంగా మారింది. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్‌రావు ప్రణీత్‌ హోమ్స్‌ అనే రియల్‌ఎస్టేట్‌ వ్యాపార సంస్థలో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయన కూకట్‌పల్లిలోని వెంకట్రావు నగర్‌లో తన తండ్రితో కలిసి నివాసం ఉంటున్నా రు. ప్రణీత్‌ హోమ్స్‌ లావాదేవీలు, పన్ను చెల్లింపులకు సం బంధించి.. ఆ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు.

అలాగే, ఆ సంస్థ ఎండీ నరేందర్‌, మరో నలుగురు డైరెక్టర్లు, ఇతర భాగస్వాముల ఇళ్లల్లోనూ ఏకకాలంలో తనిఖీలు చేశారు. ప్రణీత్‌ హోమ్స్‌ సంస్థకు సంబంధించి బాచుపల్లి, మల్లంపల్లిల్లోని వెంచర్లలో పెద్దమొత్తంలో అక్రమాలు జరిగాయని సమాచారం. అలాగే, ఎమ్మెల్యే కృష్ణారావు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆదాయ, వ్య యాల సమాచారంపై.. ఎమ్మెల్యే, ఆయన కుమారుడి బినామీ లా వాదేవీలకు సంబంధించి తమకు అందిన సమాచారంపై అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఎమ్మెల్యే బినామీలతోపాటు ఎమ్మెల్యేతో, ఆయన కుమారుడితో సన్నిహితంగా ఉండే వారి ఇళ్లల్లోనూ తనిఖీ చేసినట్లు సమాచారం.

సాధారణ తనిఖీలే!
నిర్మాత సురేశ్‌ బాబు ఇల్లు, కార్యాలయాల్లో, రామానాయుడు స్టూడియోలో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు రామానాయుడు స్టూడియో లావాదేవీలను, ఐటీ రిటర్నులను పరిశీలించారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, దగ్గుబాటి ఫార్మ్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రాజేశ్వరీ ఫార్మ్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్పిరిట్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ ఎంటర్‌టైన్‌మెం ట్‌ ఎల్‌ఎల్‌పీ, సురేష్‌ ప్రొడక్షన్స్‌, సురేష్‌ యాడ్స్‌ తదితర కార్యాలయాల్లోనూ సోదాలు జరిపారు. గడిచిన 2సంవత్సరాలతోపాటు ప్రస్తుత సంవత్సర ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించిన ప త్రాల్ని ఆయా సంస్థల ఆడిటర్ల సమక్షంలో పరిశీలించారు. ఏటా జరిగే సాధారణ తనిఖీల్లో భా గంగానే వచ్చామని అధికారులు వెల్లడించారు.

కల్కి ఆశ్రమ రికార్డులు

చెన్నైకి తరలింపు
ఏపీలోని చిత్తూరు జిల్లాలో కల్కి ఆశ్రమాల నుంచి పలు రికార్డులను ఐటీ అధికారులు చెన్నైకి తరలించినట్టు తెలిసింది. వరదయ్యపాళెంలోని ఆనందలోక క్యాంపస్‌-2, బత్తలావ ల్లం సమీపంలోని ఏకం ఆధ్యాత్మిక కేంద్రంలో ఇటీవల సీజ్‌ చేసిన గదుల నుంచి అవసరమైన రికార్డులను బుధవారం చెన్నై నుంచి వచ్చిన అధికారులు తీసుకెళ్లినట్టు సమాచారం.

అక్టోబ రులో వన్‌హ్యూమానిటీ కేర్‌ సంస్థకు అనుబంధమైన బత్తలవల్లంలోని ఏకం ఆధ్యాత్మిక కేంద్రం, సమీపంలో ఉన్న గోల్డెన్‌ టెంపుల్‌ క్యాంపస్‌(జీసీ- 2), ఉబ్బలమడుగు సమీపంలోని క్యాంపస్‌-1, 2, 3, 4 కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు జరిపి కీలక పత్రాలు, కంప్యూటర్లు, హార్డ్‌ డిస్కులను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. సోదాల అనంతరం అధికారులు ఆనందలోక క్యాంపస్‌-2, ఏకం ఆశ్రమాల్లోని రెండు గదులను సీజ్‌ చేశారు. బుధవారం చెన్నై నుంచి వచ్చిన ఐటీ అధికారులు ఆ గదులను తెరిచి, అవసరమైన రికార్డులను చెన్నై ఐటీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లినట్లు సమాచారం.

Courtesy AndhraJyothy..