పి. చిదంబరం 
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

గత మూడునెలల్లో దాదాపు పన్నెండున్నర కోట్ల మంది భారతీయులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. 35 శాతం సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల యజమానులు, 37 శాతం స్వయం ఉపాధి వ్యాపారస్తులు ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు మెరుగుపడగలవనే ఆశను కోల్పోయారు. తమ సంస్థలను మూసివేశారు. వ్యాపారాల నుంచి నిష్క్రమించారు. ఆదాయం (ప్రజల చేతుల్లో ఉండే డబ్బు) మాత్రమే మార్కెట్‌లో డిమాండ్‌ను పునరుద్ధరిస్తుందనేది ఒక ప్రాథమిక ఆర్థిక సూత్రం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఆదాయం ఎక్కడ నుంచి సమకూరుతుంది?

కరోనా వైరస్ పై యుద్ధాన్ని 21 రోజుల్లో విజయవంతంగా పూర్తి చేస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలుత హామీ ఇచ్చారు. లాక్ డౌన్ -1, లాక్ డౌన్ -2 ప్రకటించిన సందర్భాలలో దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. అయితే ఆ తరువాయి లాక్‌డౌన్ ల నుంచి ఆయన తనకుతానే దూరం జరిగారు. లాక్‌డౌన్ -2 ముగియనున్న సందర్భంలో కరోనా మహమ్మారిపై పోరు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులకు వదిలివేశారు. అప్పటి వరకు ఆయన మాటలు తిరుగులేని శాసనాలుగా ఉండేవి. దరిమిలా లాక్ డౌన్‌లకు సంబంధించి అస్పష్ట నోటిఫికేషన్ల జారీ బాధ్యతను హోంశాఖ కార్యదర్శికి వదిలివేశారు.

రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన పథకం నరేంద్ర మోదీ మేధో శిశువు. అధిక లిక్విడిటీ (ద్రవ్యత్వం), భారీ ప్రణాళికల, చాలీచాలని వాస్తవ డబ్బుతో కూడిన కిచిడీ అది. అటువంటి దాన్ని ఉద్దీపన ప్యాకేజీగా ప్రజల ముందుంచారు! ఈ ప్యాకేజీ ఆర్థిక వేత్తల ఆమోదాన్ని గానీ, ప్రజల మద్దతును గానీ పొందలేదని భావించినందునే కాబోలు దాని వివరాలను రూపొందించి, వెల్లడించే బాధ్యతను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మోదీ అప్పగించారు. ఆర్థిక మంత్రి రెండో రోజునే తన కర్తవ్య నిర్వహణలో ఆసక్తిని కోల్పోయారు! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంకెంత మాత్రం జమ్మూ-కశ్మీర్ గురించి మాట్లాడడం లేదు. ఆ పనిని శ్రీనగర్ లోని బ్యూరోక్రాట్లకు అప్పగించారు. పాకిస్థాన్ నుంచి కశ్మీర్ లోకి ఉగ్రవాదుల చొరబాట్ల గురించి గానీ, జవాన్ల జీవితాలు ఛిద్రమైపోతున్న ఘటనల గురించి గానీ మాట్లాడడం లేదు. ఈ పనిని ఆర్మీ జనరల్స్ కు అప్పగించారు.

సరిహద్దుల్లో చైనాతో సంభవిస్తున్న ఘర్షణల గురించి కూడా ఆయన మాట్లాడడం లేదు. సైనిక దళాల ప్రధాన కార్యాలయం సిద్ధం చేసి, అందించే ప్రకటనలను చదివే బాధ్యతను రక్షణ మంత్రికి, బీజింగ్ తో సంప్రదింపులు జరిపే బాధ్యతను విదేశాంగ మంత్రికి వదిలివేశారు. వలస కార్మికులు గత ఏప్రిల్‌లో పెద్దఎత్తున స్వస్థలాలకు వెళ్ళిపోయారు. ఈ తిరుగు ప్రయాణాల్లో ఆ అభాగ్యులు పడిన అష్టకష్టాల గురించి మోదీ ఒక్క అనునయ వాక్యమూ మాట్లాడలేదు. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్ళడంలో తామెదుర్కొంటున్న సమస్యలపై వలస కూలీలలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అవి అదుపు తప్పే పరిస్థితి నెలకొన్నప్పుడు రైల్వే మంత్రి ప్రజల ముందుకు వచ్చారు. వలస కార్మికుల దుస్థితికి కేంద్ర ప్రభుత్వ బాధ్యతను ఒప్పుకోవడానికి బదులు రాష్ట్ర ప్రభుత్వాలనే ఆయన తప్పు పట్టారు. వేలాది వలస కార్మికులు ఇప్పటికీ రైల్వే, బస్ స్టేషన్ల వద్ద దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు తమను స్వస్థలాలకు తీసుకువెళ్ళే రైళ్ళు, బస్సులు ఎప్పుడు వస్తాయనేది వారికి తెలియడం లేదు.

ప్రజల వెతలు ఇలా వుండగా ప్రధానమంత్రి పత్రికల పతాక శీర్షికల కెక్కడానికి ఆరాటపడుతున్నారు. ‘కన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ’ (సిఐఐ) సర్వ సభ్య సమావేశంలో ప్రసంగించడానికి అందిన అవకాశాన్ని ఆయన బాగా ఉపయోగించుకున్నారు. ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. నాకు తెలిసినంతవరకు ప్రధానమంత్రి పదవిలో ఉన్నవారెవరూ ఇంతకు ముందు సిఐఐ సర్వసభ్య సమావేశంలో ప్రసంగించలేదు. కనుక మోదీ ఆ సమావేశంలో ప్రసంగించడం నాకు అమితాశ్చర్యాన్ని కలిగించింది అయితే ఆ సమావేశంలో మోదీ ప్రసంగం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. అది పూర్తిగా ఆయన సహజ ధోరణిలో సాగింది. ప్రధానమంత్రి ఇలా అన్నారు: ‘నన్ను విశ్వసించండి ఆర్థికాభివృద్ధిని పూర్వ స్థితికి తీసుకువెళ్ళడం కష్టం కాదు’. ఇది నిజమేనా?

ప్రధానమంత్రి అంత భరోసాతో ఎలా మాట్లాడుతున్నారు? కుంటుపడిన, మరింత స్పష్టంగా చెప్పాలంటే తిరోగమించిన ఆర్థికాభివృద్ధిని మళ్ళీ పూర్వ స్థితికి పునరుద్ధరించడం అంత సులువే అయితే 2017–-18 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశియోత్పత్తి వృద్ధిరేటులో తగ్గుదలను ప్రభుత్వం ఎందుకు అరి కట్టలేకపోయింది? 2019–-20లో నాలుగో త్రైమాసికం దాకా వరుసగా ఎనిమిది త్రైమాసికాలలో వృద్ధిరేటు పతనమవుతున్నా ప్రభుత్వం ఎందుకు నిస్సహాయంగా ఉండిపోయింది? 2019–-20 ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసికంలో వృద్ధిరేటు 3.1 శాతంగా ఉన్నది. 2002-–03 ఆర్థిక సంవత్సర (బీజేపీ అధికారంలో ఉన్న కాలమది) మూడో త్రైమాసికం అనంతరం జీడీపీ వృద్ధిరేటు చాలా తక్కువగా ఉండడం గత ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసికంలోనే అన్న వాస్తవం ప్రధానమంత్రి కి తెలిసే ఉంటుందనడంలో సందేహం లేదు. అంతేకాదు 2019-– 20 ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు (4.2 శాతం) గత 17 సంవత్సరాలలో కెల్లా అతి తక్కువ వృద్ధిరేటు అన్న వాస్తవం ప్రధానమంత్రికి తెలియదా? 2008లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంలో కూడా భారతదేశ వృద్ధి రేటును ప్రతికూలంగా ప్రభావితం చేయలేకపోయింది.

2012–-13, 2013–-14 ఆర్థిక సంవత్సరాలలో యూపీఏ ప్రభుత్వం సాధించిన ఆర్థిక ప్రగతి ఏమీ లేదంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తరచు పరిహాసాస్పదంగా మాట్లాడుతున్నారు. ఆర్థిక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అధికారిక గణాంకాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించడం సబబేనా? 2011–-12 లో వృద్ధి రేటు 5.2 శాతం (2012 ఆగస్టులో నేను మళ్ళీ ఆర్థిక మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టాను) ; 2012–-13 లో 5.5 శాతం కాగా 2013–-14 లో వృద్ధిరేటు 6.4 శాతంగా ఉన్నది. నిజం చెప్పాలంటే యూపీఏ ప్రభుత్వం మంచి అభివృద్ధి ఊపులో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఎన్ డి ఏ ప్రభుత్వానికి అప్పగించింది. ఎన్డీఏ ప్రభుత్వం ఆ వృద్ధి రేటును 2014-–15, 2015–-16 ఆర్థిక సంవత్సరాలలో కాపాడడమే గాక పెంపొందించింది. 2016-–17 ఆర్థిక సంవత్సరంలో కూడా చాల వరకు ఇదే ధోరణి కొనసాగింది. అయితే 2016 నవంబర్ 8న డిమానిటైజేషన్ (రూ.1000, రూ.500 కరెన్సీ నోట్ల రద్దు)తో వృద్ధిరేటు పతనం ప్రారంభమయింది.. పెద్ద నోట్ల రద్దు మోదీ ప్రభుత్వం దురహంకారంతో తీసుకున్న చర్య.

‘ఆర్థికాభివృద్ధిని మళ్ళీ పూర్వ స్థితికి చేర్చడం ఏమంత కష్టంకాదని’ నరేంద్ర మోదీ వక్కాణించారు. మాటలకు తగ్గ కార్యాచరణ సామర్థ్యం మోదీ ప్రభుత్వానికి ఉన్నదా? ప్రస్తుత సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించగలదా? పునరుద్ధరించగలదన్న ఆశ పారిశ్రామిక, వ్యాపార వాణిజ్య వర్గాలకు లేదు; సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల కూ లేదు; నిర్మాణ రంగానికీ లేదు; ప్రభుత్వ ఆర్థిక వేత్తలకు మినహా మరే ఆర్థిక వేత్తకూ లేదు; ఇప్పుడు దినసరి కూలీలకు, వలస కార్మికులకు కూడా మోదీ ప్రభుత్వం తమ స్థితిగతులను మెరుగుపరచగలదన్న ఆశ లేదు. ఆర్థికాభివృద్ధిని మోదీ ప్రభుత్వం పునరుద్ధరించగలదన్న ఆశ ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ పూర్తిగా అడుగంటిపోయింది.

మంచి సలహాలను వినడానికి ప్రధానమంత్రి విముఖత చూపుతున్నారు. అయితే నా కర్తవ్యాన్ని విడనాడను. ప్రధాని మోదీ తాజా మంత్రం ‘ఫైవ్ ఐ’ (ఇంటెంట్, ఇన్ క్లూజన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్,ఇన్నొవేషన్) లో కనీసం ఒక కీలక ‘ఐ’ పదం లుప్తమయింది. ఆ కనపడని అంశం ‘ఆదాయం’ (ఇన్‌కమ్). గత మూడునెలల్లో దాదాపు పన్నెండున్నర కోట్ల మంది భారతీయులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. 35 శాతం సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల యజమానులు, 37 శాతం స్వయం ఉపాధి వ్యాపారస్తులు ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు మెరుగుపడగలవనే ఆశను కోల్పోయారు. తమ సంస్థలను మూసివేశారు. వ్యాపారాల నుంచి నిష్క్రమించారు.

ఆదాయం (ప్రజల చేతుల్లో ఉండే డబ్బు) మాత్రమే మార్కెట్ లో డిమాండ్ ను పునరుద్ధరిస్తుందనేది ఒక ప్రాథమిక ఆర్థిక సూత్రం. డిమాండ్ తో సరఫరాలు, ఉత్పత్తి కార్యకలాపాలు పెరుగుతాయి. ఉత్పత్తి కార్యకలాపాల ఉద్యోగాలను మళ్ళీ తీసుకువస్తాయి, మదుపులను ప్రోత్సహిస్తాయి; ఇవన్నీ కలసికట్టుగా ఆర్థికవ్యవస్థను పునరుజ్జీవింపచేస్తాయి. ఆర్థిక మాంద్యం (2020-–21 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఈ దిశగానే సాగుతోంది కదా) కాలంలో ఆ అర్థిక సూత్రం మరింత అంగీకార యోగ్యమవుతుంది.

గౌరవనీయ ప్రధానమంత్రికి నా చివరి విన్నపం: 

మీ ప్రస్తుత ఆర్థిక సలహాదారులకు ఉద్వాసన చెప్పండి. మీకు పటిష్ఠ, ప్రయోజనకర సలహాలను ఇవ్వగల కొత్త ఆర్థిక నిపుణుల బృందాన్ని తీసుకురండి.

Courtesy Andhrajyothi