12 ఏళ్ల వ్యవధిలో కుమారులు సహా 8 మందిని పోగొట్టుకున్న ఇల్లాలు
4 రోజుల క్రితమే రోడ్డు ప్రమాదంలో మరో కుమారుడు మృతి
తాజాగా ఇంటి పెద్ద మృత్యువాత

న్యూస్‌టుడే, ఆర్మూర్‌ : అన్ని కుటుంబాలకు హితులు..స్నేహితులు..బంధువులు ఉంటారు. మంచి చెడుల్లో తోడుగా ఉంటారు. ఆ ఇంటికి మాత్రం మృత్యువే బంధువు. క్రమం తప్పకుండా అది  ఆ ఇంటికొస్తుంది. తనకు ఇష్టమైన వాళ్లను తనతో తీసుకెళ్తుంది. అలా వివాహమైన పదహారేళ్లకే ఓ ఇల్లాలికి భర్తను దూరం చేసింది. సంతానంలో ఆరుగుర్ని కబళించింది. తనకు ఇష్టమైన మనవడిని, తాజాగా కష్టనష్టాల్లో తనకు అండగా ఉన్న తల్లిని కూడా కబళించడంతో ఆమె కుంగిపోయింది. దైవమా! మాపై ఎందుకింత పగబట్టావంటూ! ఏడవడం తప్ప ఇంకేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కన్నీరింకిన కళ్లతో నిట్టూరుస్తోంది.

పాతికేళ్ల గండం
నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ శాస్త్రినగర్‌కు చెందిన రహిమున్నీసాకు, షేక్‌ కరీంతో 28 ఏళ్ల కిందట వివాహమైంది. కరీం సైకిల్‌పై తిరుగుతూ తంబాకు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి ఎనిమిది మంది సంతానం. అందరూ మగ పిల్లలే. పన్నెండేళ్ల క్రితం కరీం మరణించగా..సంతానంలో ఆరుగురు వివిధ కారణాలతో పాతికేళ్లు నిండక మునుపే ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఐదో కుమారుడు ముజాహిద్‌ (21) నాలుగు రోజుల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృత్యువుపాలయ్యాడు. ఆదివారం రహిమున్నీసా తల్లి రషీదా బేగం(70) కూడా  అనారోగ్యంతో కన్నుమూశారు. మొత్తంగా ఆ ఇంట్లో 12 ఏళ్ల వ్యవధిలో ఎనిమిది మంది, రెండున్నరేళ్లలోనే నలుగురు మరణించడం విషాదకర పరిణామం. ‘‘మా అమ్మకు నేనొక్కదాన్నే కుమార్తెను. అందుకే అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుంది. 28 ఏళ్ల వైవాహిక జీవితంలో జరిగిన విషాదాల్లో తల్లే నాకు తోడునీడగా ఉంది. నా కన్నీరు తుడిచింది. అవసరమైన ధైర్యాన్నిచ్చింది. ఆమె కూడా దూరమవడంతో నాకు ఓదార్పు కరవైంది’’ అంటూ రహిమున్నీసా కన్నీటిపర్యంతమవుతోంది.

ఒక్కొక్కరు ఒక్కో కారణంతో
* 24 ఏళ్ల కిందట మొదటి కుమారుడు వకీల్‌ మూడేళ్ల వయస్సులోనే మూర్ఛ వ్యాధితో మృతిచెందాడు.
* 12 ఏళ్ల క్రితం షేక్‌ కరీం (రహిమున్నీసా భర్త) ఊపిరితిత్తుల సమస్యతో, తొమ్మిదేళ్ల కిందట మూడో కుమారుడు ఇర్ఫాన్‌ (22) అదే కారణంతో కన్నుమూశారు.
* ఏడేళ్ల కిందట రెండో కుమారుడు ఇమ్రాన్‌ (24) ఆటో ప్రమాదంలో, రెండున్నరేళ్ల కిందట ఆరో కుమారుడు ముబీన్‌ (18) ప్రమాదవశాత్తు చెరువులో మునిగి, 15 నెలలకు ముందు నాలుగో కొడుకు షేక్‌ ఇజాజ్‌ (24) గుండెపోటుతో మరణించారు.
* గత బుధవారం ఐదో కుమారుడు ముజాహిద్‌ (21) డిచ్‌పల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.
* ఎనిమిదేళ్ల కిందట ఇమ్రాన్‌ (రహిమున్నీసా మనవడు) పుట్టిన 12 రోజులకే అనారోగ్యంతో అసువులుబాశాడు.

(Courtesy Eenadu)