అతని పేరు సింహాద్రి అలియాస్‌ శివ (38). చదివింది పదో తరగతి. గతంలో అపార్ట్‌మెంట్‌ వాచ్‌మ్యాన్‌గా పని చేశాడు. ఆ తర్వాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో అడుగుపెట్టి దెబ్బతిన్నాడు. ఆపై… అడ్డదారిలో డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. కాసుల కోసం ప్రాణాలు కూడా తీశాడు. ఇలా ఒకరూ ఇద్దరూ కాదు… 20 నెలల్లో పది మందిని చంపాడు. అదికూడా… సైనైడ్‌ కలిపిన ప్రసాదం ఇచ్చి! ఈ సీరియల్‌ కిల్లర్‌ బారిన పడి స్వామీజీ నుంచి సామాన్య గృహిణి వరకు ప్రాణాలు కోల్పోయారు. శివతోపాటు అతనికి సలహాలు ఇచ్చి, సహకరించిన మరొకరిని పశ్చిమ గోదావరి పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ నవదీప్‌ మీడియాకు తెలిపిన ప్రకారం ఇవీ వివరాలు…

  • భక్తి ముసుగులో లక్షల్లో మోసం ఆనక ప్రసాదంలో సైనైడ్‌ కలిపి అమానుషంగా చంపేయడం
  • ఇరవై నెలల్లో మూడు జిల్లాల్లో శివ ముఠా వరుస ఘాతుకాలు
  • గుప్త నిధులు, బంగారం రెట్టింపు, రైస్‌ పుల్లింగ్‌ కాయిన్‌ పేరిట
  • ఒక్కొక్కరికీ ఒక్కోలా బురిడీ.. వథ
  • ఒక్క కృష్ణాలోనే నలుగురు మృతి
  • గోదారి జిల్లాల్లో మరో ఆరుగురు
  • సైనైడ్‌, ఆభరణాలు, నగదు స్వాధీనం

ఏలూరు క్రైం : ఏలూరు వెంకటాపురం పంచాయతీలోని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన వెల్లంకి సింహాద్రి అలియాస్‌ శివ వాచ్‌మ్యాన్‌ నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అవతారమెత్తి బాగా నష్టపోయాడు. ఆ తర్వాత… వ్యక్తుల బలహీనతలు, నమ్మకాలను సొమ్ము చేసుకునే పనిలో పడ్డాడు. రైస్‌ పుల్లింగ్‌ కాయిన్‌, రంగురాళ్లు, గుప్త నిధులు, బంగారం రెట్టింపయ్యే మార్గం అంటూ.. బాగా డబ్బున్న వారిపైన, అప్పుల నుంచి బయటపడాలనుకునే వారిపైనా కన్నేశాడు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన షేక్‌ అమానుల్లా అలియాస్‌ బాబు అలియాస్‌ శంకర్‌ (61)ను కలుపుకొన్నాడు. మోటారు వాహనాల విడి భాగాలకు నికెల్‌ కోటింగ్‌ వేసే శంకర్‌ వద్ద సైనైడ్‌ ఉంది. అదే సైనైడ్‌ను ఆయుర్వేద మందులు, ప్రసాదంలో కలిపి.. హత్యాకాండలకు తెరతీశారు.

బంధువులే తొలి బలి
భక్తి పేరిట కొందరికి, రైస్‌పుల్లింగ్‌ కాయిన్‌ కొనిపెడతామని కొందరికి, గుప్తనిధులు ఉన్నచోటు చూపిస్తామని కొందరికి, బంగారం తెస్తే రెట్టింపు చేస్తామని కొందరికి శివ ముఠా వల వేసింది. సొంత బంధువులనే తొలిగా బలి తీసుకొంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పేపర్‌మిల్లు వద్ద ఉంటున్న కొత్తపల్లి రాఘవమ్మ వద్దకు చుట్టపు చూపుగా శివ వెళ్లాడు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న రాఘవమ్మను ఆయుర్వేదంతో బాగుచేస్తానని నమ్మించాడు. ఆమెకు ఇచ్చే మందుల్లో సైనైడ్‌ కలిపి చంపేశాడు. ఆమె ఇంట్లోంచి లక్ష రూపాయలకుపైగా నగదులో ఉడాయించాడు. ఇదే జిల్లా బొమ్మూరులో ఉంటున్న వరసకు వదిన అయ్యే సామంతకుర్తి నాగమణిని కూడా ఇలాగే హత్యచేసి, ఐదులక్షల డబ్బులు, నగలుతో పరారయ్యాడు. ఏలూరులో తాను అద్దెకుంటున్న రాములమ్మ వద్ద ఉన్న బంగారం, వెండి వస్తువులు, నగదుపై కన్నేసి.. ఆమెనూచంపేశాడు. గుప్త నిధుల జాడ చూపుతానని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి మరికొందరిని హతమార్చాడు. చివరికి…అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద మందు అంటూ ఒక స్వామీజీని కూడా సైనైడ్‌తో చంపేశాడు.

పట్టేసిన కాల్‌డేటా: ఏలూరు కేబీడీటీ హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కాటి నాగరాజు (49) రైస్‌పుల్లింగ్‌ కాయిన్‌ కోసం తెలిసినవారినల్లా సంప్రదిస్తున్నారు. ఎవరో శివ గురించి ఆయనకు చెప్పగా, వెళ్లి కలిశారు. ఇదే అదనుగా తీసుకున్న శివ.. ఆ కాయిన్‌ ఇస్తానని గత నెల 16వ తేదీన తన వద్దకు పిలిపించుకొన్నాడు. అతడు చెప్పినట్టు నాగరాజు రెండు లక్షల రూపాయల నగదు, నాలుగున్నర కాసుల బంగారు నగలు పట్టుకుని ఇంటినుంచి వెళ్లారు. ఏలూరు సమీపంలోని వట్లూరి మినీబైపాస్‌ రోడ్డులో శివను కలుసుకొన్నాడు. నాగరాజుకు ప్రసాదం అంటూ సైనైడ్‌ పెట్టాడు. ఆ ప్రసాదం తిన్న నాగరాజు మృతి చెందాడు. అతని వద్ద నుంచి నగదు, బంగారు ఆభరణాలు శిశ అపరిహరించుకుపోయాడు. అయితే, నాగరాజు మరణించిన తీరు బంధువులకు అనుమానం వచ్చింది. ఇంటి నుంచి డబ్బు, నగలుతో వెళ్లిన నాగరాజు మృతదేహం వద్ద అవేవీ కనిపించకపోవడంతో.. వారు ఏలూరు త్రిటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీ్‌పసింగ్‌ గ్రేవాల్‌ ఆదేశాలతో డీఎస్పీ దిలీ్‌పకిరణ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నాగరాజు కాల్‌డేటా ఆధారంగా పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు.

ఒకే ఒక్కడు పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. అతని సెల్‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి ఉంది. అతడు ఎవరనే దిశగా పోలీసులు దర్యాప్తు చేశారు. అతని కాల్‌డేటాను జల్లెడ పట్టగా, గతంలో అనుమానాస్పదంగా మృతిచెందిన వారి ఫోన్‌ నంబర్లు కూడా ఆ కాల్‌ లిస్టులో కనిపించాయి. పోలీసులు వారి సంబంధికులను కలుసుకొని వివరాలు తెలుసుకున్నారు. దాన్నిబట్టి నాగరాజు మృతిచెందిన పద్ధతికీ మిగతా మరణాలకూ సంబంధం ఉన్నట్టు గుర్తించారు. మృతుల బంధువులు ఇచ్చిన వివరాల ఆధారంగా ఎట్టకేలకు మంగళవారం శివను, అమానుల్లాను ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. తన సర్వీసులోనే ఇలాంటి ఘాతుకాలు చూడలేదని ఎస్పీ నవదీప్‌ అనడం గమనార్హం. అరెస్టు సమయంలో శివ వద్ద నుంచి సైనైడ్‌, 23 కాసుల బంగారు ఆభరణాలు, లక్షా 63 వేల 400 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. హంతకుడు గత 20 నెలల్లో కృష్ణాలో నలుగురిని, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆరుగురిని అతి కిరాతకంగా హత్య చేశాడని తెలిపారు.

సైలెంట్‌గా సఫా
శరీరంపై ఒక్క గాయం ఉండదు! చంపిన గుర్తులు కనిపించవు! హత్య జరిగిన ఆనవాళ్లు దొరకవు! శివ ముఠా మార్క్‌ హత్యాకాండ ఇది. దీనికోసం సైనైడ్‌ వాడారు. సైనైడ్‌ను ప్రసాదంలో పెట్టి సైలెంట్‌గా తినిపించేయడం, కనురెప్పపాటులో హతుడు లేక హతురాలి వద్ద ఉన్నదంతా మూట కట్టుకొని పరారయిపోవడం! శరీరంపై ఎలాంటి గాయాలు, అనుమానాస్పద పరిస్థితులు లేకపోవడంతో… కుటుంబ సభ్యులు కూడా ఇది సహజమరణంగా భావించేవారు. ఇలా 20 నెలల్లో 10 హత్యలకు పాల్పడి శివ రూ.28.50 లక్షలు సంపాదించాడు. ఏలూరులో ఇంటి స్థలం కొని ఇటీవలే సొంత ఇల్లు కట్టుకొన్నాడు.

Couretsy AndhraJyothy..