గజ్వేల్‌లో బ్యాంకు ఉద్యోగిని హత్య
ఎనిమిదో తరగతి నుంచి ప్రేమ పేరిట
వెంటపడి వేధించిన యువకుడు
మరో వారంలో పెళ్లనగా ఘోరం

గజ్వేల్‌ : ప్రేమ త్యాగాన్ని కోరుతుందంటారు. కానీ.. ఓ యువకుడి ప్రేమోన్మాదం తాను ప్రేమించిన యువతి ప్రాణాలనే బలిగోరింది! ఎనిమిదో తరగతి నుంచే ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని వేధించి, వెంటపడి.. చివరికి ఆమెకు మరో వారంలో పెళ్లనగా గొంతుకోసి ప్రాణాలు తీశాడా ఉన్మాది. మంగళవారం జరిగిన ఈ దారుణహత్యతో గజ్వేల్‌ పట్టణం ఉలిక్కిపడింది. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన న్యాలకంటి లక్ష్మీరాజం, మణెమ్మ దంపతుల కుమార్తె దివ్య (25). వారు వేములవాడలో ఒక దుకాణాన్ని నడిపే సమయంలో దివ్య అక్కడ ఎనిమిదో తరగతి చదివింది. వేములవాడకే చెందిన వెంకటేశ్‌ గౌడ్‌ ఆమెతోపాటు ఎనిమిదోతరగతి చదివాడు. అప్పట్నుంచే ప్రేమ అంటూ ఆమె వెంటపడ్డాడు. అతడి బాధ పడలేక వారు ఎల్లారెడ్డిపేటకు వెళ్లారు. వెంకటేశ్‌ గౌడ్‌ అక్కడికి కూడా వెళ్లి దివ్య వెంటపడడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతణ్ని పోలీ్‌సస్టేషన్‌కు పిలిపించి మందలించిన పోలీసులు.. మరోసారి ఆమె వెంటపడనంటూ అతడితో కాగితం రాయించుకుని వదిలేశారు. కొన్నాళ్ల పాటు ఊరుకున్న వెంకటేశ్‌.. మళ్లీ దివ్య వెంట పడడం ఆరంభించాడు. అతడి నుంచి ఎన్ని ఇబ్బందులున్నా ఆమె మాత్రం బాగా చదువుకుంది. 4 నెలల క్రితమే ఏపీజీవీ బ్యాంకు గజ్వేల్‌ శాఖలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కూడా గజ్వేల్‌కు వచ్చి ఉంటున్నారు. ఇటీవలే ఆమెకు వరంగల్‌కు చెందిన ఏపీజీవీబీ ఉద్యోగితో పెళ్లి కుదిరింది. 26న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లిపనుల నిమిత్తం దివ్య తల్లిదండ్రులు రెండు రోజుల క్రితమే ఎల్లారెడ్డిపేట వెళ్లారు. మంగళవారం సాయంత్రం బ్యాంకులో విధులు ముగించుకుని వచ్చిన దివ్య.. మేడపై ఆరేసిన దుస్తులు తీసుకుని కిందికి దిగుతుండగా వెంకటేశ్‌ కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి.. శరీరంపై 15 పోట్లు పొడిచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. విషయం తెలిసి ఎల్లారెడ్డిపేట నుంచి వచ్చిన దివ్య తల్లిదండ్రులు.. వెంకటేశ్‌గౌడ్‌ గురించి వివరించారు. పెళ్లి నిశ్చయమైనప్పటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. వెంకటేశ్‌కు సంబంధించిన ఆధారాలు ఘటనాస్థలిలో దొరికాయని పోలీసులుతెలిపారు.

Courtesy Andhrajyothi