ప్రభుత్వం ఇన్ని లక్షల కుటుంబాలకు ఇళ్ళ స్థలాలు ఇస్తామంటే ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఇళ్ళ స్థలాల పేరుతో చట్టాలన్నింటినీ తుంగలో తొక్కి తరతరాలుగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వారు సాగు చేసుకుంటున్న కొద్దిపాటి భూములను బలవంతంగా తీసుకోవటమే అభ్యంతరకరం. 2013 భూసేకరణ చట్టం ద్వారా పేదలను ఒప్పించి ముఖ్యమంత్రి చెప్పినట్లు వారికి ఎక్కువ నష్ట పరిహారం ఇచ్చి తీసుకుంటేనే అందరి కలలు నెరవేరుతాయి.

ఉగాది నాటికి 25 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని ఎవరూ కాదనలేరు. అభినందించాల్సిన అంశం. అయితే ఇళ్ళ స్థలాలు కోసం చేపట్టిన భూసేకరణ విధానం ఏకపక్షంగా, దౌర్జన్యంగా, ప్రభుత్వ నిబంధనలన్నీ ఉల్లంఘించి పేదలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను లాగేసుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై నిర్బంధం ప్రయోగిస్తున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి, మంత్రులు పేదల భూములు బలవంతంగా తీసుకోం. అవసరమైతే పేదలకు మెరుగైన పరిహారం ఇచ్చి ఒప్పించి, సంతోష పెట్టిన తరువాతనే భూములు తీసుకుంటామని చెపుతున్నారు. మరో పక్క జిల్లాల్లో దీనికి భిన్నంగా జరుగుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు ముందస్తు ప్రణాళిక లేకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్ళడం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే గతంలో ఇలాంటి అనుభవాలు అనేకం ఉన్నాయి. రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 80 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఈ రాష్ట్రాన్ని గుడిసె రహిత రాష్ట్రంగా మార్చుతామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆనాడు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పేదలకు ఉండడానికి స్థలమే లేకపోతే ఇళ్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నిస్తే… వారిని ఎగతాళి చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శ చేశారు. అంతే కాకుండా లక్షల ఇళ్ల నిర్మాణానికి అంత డబ్బు ఎక్కడి నుండి తెస్తారని ప్రశ్నించినా… మీకెందుకు? పేదల ఇళ్ల నిర్మాణం బిల్లులు రాక ఒక్క ఇల్లు ఆగిపోయినా, ఆ ఇళ్ళ వివరాలు ఇచ్చిన వారికి వెయ్యి రూపాయలు బహుమానం ఇస్తామని రాజశేఖర్‌ రెడ్డి ఛాలెంజ్‌ చేశారు. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించి ఆనాడు వారం రోజులలో ప్రజా సంఘాల కార్యకర్తలు వెయ్యి మంది సమాచారం సేకరించి ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. సమాధానం లేదు.

తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత వై.యస్‌.ఆర్‌ హయాంలో ఇచ్చిన ఇళ్లన్నీ అవినీతిమైనవని మంజూరైన ఇళ్లన్నింటికి బిల్లులు నిలిపివేశారు. ఈ కారణంగా వేలాది మంది ఇళ్ళ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఐదు సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పి కనీసం వెయ్యి ఇళ్లు కూడా నిర్మాణం చేయలేదు. పాలకులు చెపుతున్న మాటలకు ఆచరణకు ఎటువంటి పొంతన ఉండడం లేదు.

నేడు వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ళ స్థలాల సేకరణ కూడా సమస్యాత్మకంగా తయారైంది. ప్రభుత్వం చెప్తున్న మాటలకు, ఆచరణకు పొంతన లేదు. తరతరాలుగా పేదలు సాగు చేసుకుంటూ పట్టాల కోసం ఎదురు చూస్తున్న భూములు, అసైన్డ్‌ భూములను లక్ష్యంగా చేసుకొని లాగేసుకుంటున్నారు. ఉదాహరణకు ప||గో జిల్లా టి.నర్సాపురం మండలం, ముత్యాలమ్మపేటలో పేదలు వేసుకున్న మొక్కజొన్న పంట నాశనం చేసి భూమి తీసుకున్నారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు గ్రామంలో మూడు తరాలుగా దళిత, బలహీన వర్గాలకు చెందిన 22 కుటుంబాలు సాగు చేసుకుంటున్న 10 ఎకరాల కందిపంటను రాత్రికి రాత్రి ధ్వంసం చేశారు. అనంతపురం జిల్లా సోమందేపల్లిలో ఎస్సీ, బీసి కుటుంబాలకు నాలుగు దశాబ్దాలుగా అనుభవంలో ఉన్న 37 ఎకరాల భూమిని వందలాది మంది పోలీసులను మొహరించి, బుల్డోజర్లు పెట్టి స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లాలో ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో 10 మండలాల్లో 55 గ్రామాలలో సుమారు 6,500 ఎకరాలు బలవంతంగా లాక్కోవడానికి పూనుకున్నారు. పేదలు తిరస్కరించినా దౌర్జన్యంగా భూముల్లో జెసీబీలు పెట్టి పంటలను ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాపితంగా పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ‘మేము సావడానికైనా సిద్ధం మా భూములు వదలమ’ని పేదలు తిరగబడుతున్నారు. అయినా ప్రభుత్వం కనికరించడం లేదు. ఈ భూములన్నీ ప్రభుత్వానికి చెందినవే. మాకు అవసరమైనప్పుడు తీసుకునే అధికారం ఉంది. కాబట్టి మీకు దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరిస్తున్నారు.

ఎక్కడైనా పేదలు ఐక్యమై కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకుంటే కోర్టు తీర్పును కూడా గౌరవించడం లేదు. కింది స్థాయి అధికారులు మాకు కలెక్టర్‌ ద్వారా ఉత్తర్వులు వస్తే తప్ప మేము ఎవరి మాటా వినమని కరాఖండిగా చెప్తున్నారు. పోలీసులు వారి పరిధిని దాటి వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని ఉల్లంఘిస్తే పేదలకు రక్షణ ఎక్కడ?

ఈ దేశంలో భూసేకరణ కోసం వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్‌ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రద్దు చేసి 2013 భూసేకరణ, పునరావాస చట్టాన్ని మన పార్లమెంటు ఆమోదించింది. దీనిని కూడా కేంద్రంలో బి.జె.పి ప్రభుత్వం, పెట్టుబడిదారులు, కార్పొరేట్ల ఒత్తిడికి తలొగ్గి రద్దు చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేసింది. రైతులు, కూలీలు, ప్రజా సంఘాలు పోరాడి చట్టాన్ని రక్షించుకున్నారు.

ఈ చట్టం ప్రకారం పేదలు ప్రభుత్వ భూములలో మూడు సంవత్సరాల పాటు సాగులో ఉంటే జిరాయితీ భూములతో సమానంగా అన్ని హక్కులు వర్తిస్తాయి. ప్రభుత్వం ఈ భూములు తీసుకోదలిస్తే జిరాయితీ భూములతో సమానంగా పేదలు సాగు చేసుకుంటున్న భూములకు కూడా నష్ట పరిహారం ఇవ్వాలని 2013 భూసేకరణ చట్టం చెబుతుంది. ఆ చట్టాన్ని తుంగలో తొక్కి తరతరాలుగా పేదల సాగులో ఉన్న భూములనే లక్ష్యంగా చేసుకొని బలవంతంగా తీసుకుంటున్నారు. మరో పక్క ఈ రాష్ట్రంలో అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేసిన తరువాత ప్రభుత్వ కళ్లుగప్పి పలుకుబడి కలిగినవారు పట్టణాలు, మండలాల చుట్టూ ఉన్న విలువైన వందల ఎకరాల భూమిని ఆక్రమించుకొని దర్జాగా అనుభవిస్తున్నారు. ఒక్క విశాఖ నగరం చుట్టుపక్కల ప్రాంతం లోనే సుమారు లక్ష ఎకరాలు పెద్దలు ఆక్రమించుకున్నట్లు ప్రభుత్వం నియమించిన కమిటీయే చెప్పింది. అటువంటి వారి జోలికి పోకుండా బక్కచిక్కిన పేదల భూములే తీసుకోవడం చూస్తుంటే పేదల పట్ల వీరికున్న ప్రేమ ఏపాటిదో విదితమవుతుంది. గత ప్రభుత్వం భూబ్యాంక్‌ పేరుతో బలవంతపు భూసేకరణకు పూనుకొని అడ్డగోలుగా వ్యవహరించింది. భూసేరణ చట్టం అమలులో ఉండగా ల్యాండ్‌ పూలింగ్‌ను అమలు చేసింది. వామపక్ష పార్టీలతోపాటు అనేక మంది వ్యతిరేకించినా చంద్రబాబు ప్రభుత్వం పెడ చెవిన పెట్టింది. కాబట్టి 2019 ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. వై.యస్‌.ఆర్‌ ప్రభుత్వం అటువంటి తప్పులు చేయదనే ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించారు. కాని ఈ ప్రభుత్వం కూడా అదే దారిలో పయనిస్తున్నట్లు కనిపిస్తుంది.

ప్రభుత్వం ఇన్ని లక్షల కుటుంబాలకు ఇళ్ళ స్థలాలు ఇస్తామంటే ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఇళ్ళ స్థలాల పేరుతో చట్టాలన్నింటినీ తుంగలో తొక్కి తరతరాలుగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వారు సాగు చేసుకుంటున్న కొద్దిపాటి భూములను బలవంతంగా తీసుకోవటమే అభ్యంతరకరం. ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు పలుకుబడి కలిగిన వారి చేతుల్లో ఉన్నట్లు కోనేరు రంగారావు భూకమిటీతో పాటు అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. వీరంతా ముందు జాగ్రత్త చర్యగా చక్క బెట్టుకుంటున్నారు. భూములు రక్షించుకోవడానికి ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారు. కనీసం తహశీల్దారు ఆఫీస్‌ మెట్లు కూడా ఎక్కని దళితులు, గిరిజనుల అనేక మంది ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ద్వారా పేదలను ఒప్పించి ముఖ్యమంత్రి చెప్పినట్లు వారికి ఎక్కువ నష్ట పరిహారం ఇచ్చి తీసుకుంటేనే అందరి కలలు నెరవేరుతాయి.

వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘంప్రధాన కార్యదర్శి

Courtesy Prajashakti