• పాక్‌ సరిహద్దు దాటిన ప్రశాంత్‌.. మాదాపూర్‌లో అదృశ్యం
  • వెళ్లాల్సింది స్విట్జర్లాండ్‌కు.. సరిహద్దులో తప్పటడుగులు
  • పాకిస్థాన్‌లో బందీగా ప్రత్యక్షం
  • మా వాడిని వెనక్కి రప్పించండి తండ్రి బాబూరావు వేడుకోలు

హైదరాబాద్‌ సిటీ, కేపీహెచ్‌బీకాలనీ, రాజాం రూరల్‌, కొమ్మాది/మధురవాడ : ప్రేయసి కోసం స్విట్జర్లాండ్‌కు పయనమైన ప్రేమికుడు.. తన ప్రేమను దక్కించుకోకపోగా పాకిస్థాన్‌ పోలీసుల చేతిలో బందీగా చిక్కాడు. రెండేళ్లుగా బిడ్డడు ఎక్కడున్నాడో తెలియక తల్లిదండ్రుల ఆందోళన.. క్లూ దొర్కపోవడంతో మిస్సింగ్‌ కేసు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలక పోలీసుల హైరానా. చివరకు పాకిస్థాన్‌ మీడియా ఓ వీడియోను విడుదల చేయడం.. గూఢచర్యం అభియోగంతో అరెస్టయ్యాడంటూ కథనాలు ప్రసారం చేయడంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు వి.ప్రశాంత్‌ కేసు మిస్టరీ కొంత వరకు వీడినట్లయింది. రాజస్థాన్‌ ఎడారి ప్రాంతమైన కొలిస్థాన్‌ నుంచి పాకిస్థాన్‌లోకి అక్రమంగా ప్రవేశించి.. అక్కడి పోలీసులకు చిక్కిన ప్రశాంత్‌ గురించి తల్లిదండ్రులను ఆరా తీయగా ఆసక్తి విషయాలు వెలుగులోకి వచ్చాయి.

2017లో మిస్సింగ్‌ కేసు..
ప్రశాంత్‌ తండ్రి బాబూరావుది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కంచరాం గ్రామం. అతడికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు శ్రీకాంత్‌, చిన్నవాడు ప్రశాంత్‌. ఉద్యోగరీత్యా(ప్రైవేటు) బాబూరావు విశాఖపట్నంలోని వుడా మిథిలాపురికాలనీ.. గంగారెసిడెన్సీ అపార్టుమెంట్‌లో ఉండేవారు. పిల్లలిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు కావడంతో.. ఐదేళ్ల క్రితం కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్‌ కాలనీకి మారారు. అంతకుముందు (2011-12లో)ప్రశాంత్‌ బెంగళూరులోని హువేయి టెక్నాలజీ్‌సలో కాంట్రాక్టు పద్ధతిపై ఉద్యోగంలో చేరాడు. ఆ కంపెనీ తరఫున చైనా, దక్షిణాఫ్రికా వెళ్లి వచ్చాడు. అప్పట్లోనే స్వప్నికాపాండే అనే తోటి ఉద్యోగితో ప్రేమలో పడ్డాడు. ప్రేమ విఫలమవ్వడంతో.. మానసికంగా కృంగిపోయాడు. దీంతో తల్లిదండ్రులు అతడిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి.. మానసిక చికిత్స చేయించారు. కోలుకున్న ప్రశాంత్‌ 2016లో మాదాపూర్‌లోని షోర్‌ ఇన్ఫోటెక్‌లో చేరారు. 2017 ఏప్రిల్‌ 11న ఉద్యోగానికి వెళ్లి, ఇంటికి తిరిగి రాలేదు. దీంతో.. ప్రశాంత్‌ తండ్రి బాబూరావు అదే నెల 29న మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. క్లూ దొరక్కపోవడం.. గతంలోనూ ప్రశాంత్‌ ఇం ట్లోంచి పారిపోయాడని తల్లిదండ్రులు చెప్పడంతో కేసును మూసివేశారు.

కాగా, తాను ప్రేమించిన స్వప్నికాపాండే స్విట్జర్లాండ్‌లో ఉన్నట్లు తెలుసుకున్న ప్రశాంత్‌ ఆ దేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంట్లోవాళ్లకు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. స్వప్నికాపాండే స్వస్థలం మధ్యప్రదేశ్‌. ఆమెను వెతికే క్రమంలోనే అతడికి దరీలాల్‌ పరిచ యం అయ్యి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రశాంత్‌ ఆమెను వెతికేందుకు దరీలాల్‌ సహాయం తీసుకుని ఉంటాడని.. ఆ క్రమంలో రాజస్థాన్‌ థార్‌ ఎడారిలో తప్పిపోయి.. పాకిస్థాన్‌ సరిహద్దులు దాటి ఉంటారని భావిస్తున్నారు. అయితే.. ప్రశాంత్‌ స్విట్జర్లాండ్‌కు కాకుండా రాజస్థాన్‌ ఎందుకు వెళ్లాడనే కోణంపై పోలీసులు దృష్టిసారించారు. ఇదిలావుంటే, ప్రశాంత్‌ తండ్రిని పోలీసులు పలు కోణాల్లో విచారించారు.

Courtesy AndhraJyothy..