తెలంగాణలోని కొమురంభీం జిల్లా కొత్త సార్సాల గ్రామంలో ఆదివారం ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సి. అనితపై జరిగిన దాడి అత్యంత దుర్మార్గమైనది. 

జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షుడైన కోనేరు కృష్ణ తన అనుచరులతో కలసి అటవీఅధికారులపై దాడిచేయడానికి అతడు స్థానిక ఎమ్మెల్యే సోదరుడు కావడం కూడా ఓ కారణం. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడువేల హెక్టార్ల అటవీప్రాంతం పోతున్నందున, ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం అటవీకరణకు కేటాయించిన ప్రాంతాల్లో ఈ గ్రామ శివార్లలోని భూమి కూడా ఒకటి. ప్లాంటేషన్‌కు ఉపక్రమించిన అటవీ అధికారులకు అవి తమ సాగు భూములంటూ అక్కడి ఆదివాసీ రైతులు అడ్డుపడ్డారు. ఈ పోడుభూములను అటవీశాఖ గతంలో స్వాధీనం చేసుకున్నందున, కార్యక్రమానికి స్థానికులనుంచి ఆటంకాలు ఎదురవుతాయని అధికారులు ముందే ఊహించి, సీఐ, ఎస్‌ఐ సహా యాభైమంది పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటుచేసుకున్నారు. రైతులకు నచ్చచెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్న తరుణంలో కోనేరు కృష్ణ అనుచరులను వెంటేసుకొచ్చి వారిపై భౌతికదాడులకు ఉపక్రమించాడు. అటవీ అధికారులకు భద్రత కల్పించాల్సిన పోలీసులు ఎమ్మెల్యే సోదరుడి రంగ ప్రవేశంతో బాధ్యతను విస్మరించి వారి ఖర్మానికి వారినొదిలేశారు. అధికారులు ఆత్మరక్షణార్థం పరుగులు తీయాల్సి వచ్చింది. కర్రదెబ్బలకు వాళ్ళ వీపు, కాళ్ళు వాచిపోయాయి. చెప్పుకోలేని చోట తీవ్ర గాయాలయ్యాయని మహిళా డిప్యూటీ ఆర్వోలు ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు కన్నీరుమున్నీరయ్యారు. అనిత కుడిచేయి విరిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

ప్రభుత్వానికి తీవ్ర అప్రదిష్ట తెచ్చిన ఈ ఘటనలో కొందరు పోలీసు అధికారులు సస్పెండ్‌ కావడం ఎమ్మెల్యే సోదరుడు జోడు పదవులకు రాజీనామా చేయడం వంటివి ఉపశమన చర్యలే. ఎమ్మెల్యే సైతం తమను తీవ్రంగా దూషిస్తూ వెంటనే వెళ్ళకపోతే తరిమికొట్టిస్తానని హెచ్చరించారని అటవీ అధికారులు చెబుతున్నారు. తాము సర్వోన్నతులమనీ వ్యవస్థలకు అతీతమనీ రాజకీయ నాయకులు భావిస్తుంటారు. తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా వారిని ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడేట్టూ ప్రజల పక్షాన పోరాడుతున్నామన్న అడ్డగోలు వాదనలతో సమర్థించుకొనేట్టూ చేస్తున్నది. అటవీ అధికారుల కార్యక్రమంపై ఎమ్మెల్యేకు నిజంగానే అభ్యంతరం ఉండివుంటే అధికారపక్షానికి చెందినవారే కనుక పరిష్కారం ఆయనకు కష్టమేమీ కాదు. ఈ భూమిని ప్రభుత్వం ప్లాంటేషన్‌కు కేటాయించిన విషయం ఇప్పటివరకూ ఆయనకు తెలియదనే అనుకున్నా తాత్కాలికంగా ఈ కార్యక్రమాన్ని వాయిదావేయించి తరువాత ప్రభుత్వం దృష్టికి తెచ్చి శాశ్వతంగా పరిష్కరించవచ్చు. కానీ ప్రభుత్వాదేశానుసారం వ్యవహరిస్తున్న అధికారులపై తామే ప్రజలను రెచ్చగొట్టి దాడులకు కారకులు కావడం విషాదం.

సార్సాల ఘటన ఒక విస్తృతమైన సమస్యకు ప్రతీక. ఆదివాసులు తరతరాలుగా సాగుచేసుకుంటున్న పోడుభూములకు ప్రభుత్వాలు ఒకపక్కన పట్టాలు ఇవ్వడం లేదు. కంచెలు కడుతూ అడుగుపెడితే ఊరుకోనంటూ అటవీశాఖ మరొకవైపు వాటిని స్వాధీనం చేసుకుంటున్నది. ఒకవేళ రెవెన్యూశాఖ పట్టాలిచ్చినా అది తమదంటూ అటవీశాఖ ఆదివాసులను వెళ్ళగొడుతున్న ఘటనలూ అనేకం. రెండు ప్రభుత్వ శాఖల మధ్యా దశాబ్దాలుగా సాగుతున్న వివాదాలు వేలాదిమంది నిరుపేద రైతులను నలిపేస్తున్నాయి. ఇక పోడుభూములపై ఆదివాసీలకు హక్కుల్లేవంటూ అటవీహక్కుల చట్టాల ముసుగులో గ్రామాలకు గ్రామాలనే ఖాళీచేయించి హరితహారాలుగా మార్చేయడం యథేచ్ఛగా సాగిపోతున్నది. ఇటీవల ఇదే జిల్లాలోని కోలాంగొంది గ్రామంపై అటవీ అధికారులు దాడులు చేసి ఈ గ్రామం టైగర్‌ రిజర్వ్‌లోకి వస్తుందన్న వాదనతో అక్కడ నలభైయేళ్ళుగా నివాసం ఉంటున్న ఆదివాసులను తరిమివేశారు. వీరందరినీ పోలీసులు మరోచోట నిర్బంధించడం అన్నం నీరు ముట్టకుండా ఆదివాసులంతా దీక్షలు చేయడం తెలిసినవే. ఆదివాసీ గ్రామాలపై అటవీ అధికారులు దాడులు చేయడం అడవుల రక్షణ పేరిట వారిని తరిమికొట్టడం ఇప్పుడు ఉధృతంగా సాగిపోతున్నది. ప్రాజెక్టులకు, పరిశ్రమలకు, గనుల తవ్వకాలకు లక్షలహెక్టార్ల భూమిని ధారపోస్తున్న పాలకులు అటవీకరణ పేరిట ఆదివాసులకు అన్నం లేకుండా చేస్తున్నారు. వేలాదిమంది ఆదివాసీల పాలిట ఈ అటవీకరణ శాపంగా మారుతున్న తరుణంలో ‘ప్రత్యామ్నాయ అటవీకరణ నిధి’ కింద త్వరలోనే రాష్ట్రాలకు యాభైవేలకోట్ల రూపాయలు అందబోతున్నాయన్న వార్త మరింత భయపెడుతున్నది.

(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో..)