• నాలుగేళ్ల తర్వాత పరిస్థితి ఇదీ
  • బడ్జెట్‌పై భట్టి విక్రమార్క పీపీటీ

 ‘‘తెలంగాణ బడ్జెట్‌ 2024 నాటికి రూ.5 లక్షల కోట్లు దాటుతుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. బడ్జెట్‌ కాదు.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ అప్పు రూ.5 లక్షల కోట్లకు పెరిగే ప్రమాదం ఉంది’’ అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జీఎస్డీపీలో రుణాలు 21 శాతమని, ఇవి 2023-24 నాటికి 33 శాతానికి పెరగనున్నాయని చెప్పారు. తద్వారా మొత్తం అప్పు రూ.4,60,918 కోట్లకు చేరనుందన్నారు. రాబోయే నాలుగేళ్లలో కేవలం అప్పు అసలు, వడ్డీలు, గ్యారెంటీలకే రూ.1.28 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. రాష్ట్ర బడ్జెట్‌, భవిష్యత్తులో పెరగనున్న అప్పులపై సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో భట్టి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా తన అంచనాలను వివరించారు. ‘‘ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆరు నెలల్లోనే రూ.36 వేల కోట్లు కోత కోసి మరో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఎన్నడూ చూడలేదు. దాదాపు 20 శాతం బడ్జెట్‌ను తగ్గించడాన్ని చూసినప్పుడు ఏదో తేడా కొడుతోందని అనిపించింది. దాంతో, ఈ అంశంపై మా పార్టీ లోతుగా అధ్యయనం చేసింది. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ గణాంకాలను అధ్యయనం చేసి, రానున్న ఐదేళ్లలో ఆర్థిక ముఖచిత్రం ఎలా ఉండబోతోందో అంచనా వేశాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఇలాగే కొనసాగితే అవి 2023-24 నాటికి దాదాపు రూ.5 లక్షల కోట్లకు పెరుగుతాయి’’ అని వివరించారు. అది కూడా.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న జీతాలు పెంచకుండా, ఉన్న పథకాలనే అమలు చేస్తూ, కొత్త వాటిని ప్రవేశపెట్టకుండా.. అప్పులు చేస్తూ పోతే ఈ పరిస్థితి ఉంటుందని వివరించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలు చూస్తుంటే ఆందోళన కలుగుతోందన్నారు. శాసనసభ ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని భావించామని, కానీ, ప్రభుత్వం తమ గొంతును నొక్కేసిందని ఆరోపించారు. అందుకే, అన్ని వివరాలతో పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చానని తెలిపారు. అప్పులు తెచ్చి సంపద, ఆస్తులు సృష్టించకుండా అసలు, వడ్డీ చెల్లించేందుకే ప్రభుత్వం పరిమితమవుతోందని కాగ్‌ తప్పుబట్టిందని గుర్తు చేశారు. తాము అడిగిన వాటిని వదిలేసి సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో రాజకీయ అంశాలను మాట్లాడారని విమర్శించారు. అప్పుల గురించి గణాంకాలు వివరించాలంటే అడ్డగోలు విషయాలన్నీ మాట్లాడి తమ గొంతు నొక్కారని మండిపడ్డారు. తాను పీపీటీలో పేర్కొన్న విషయాలన్నీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ల నుంచి సేకరించినవేనని తెలిపారు. ప్రభుత్వం ఇలా అప్పులు చేసుకుంటూ పోతే.. జీతాలు లేక ఉద్యోగులు, పథకాలు అమలు కాక ప్రజలు, అభివృద్ధి జరగక రాష్ట్రం నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త ఉద్యోగాల కల్పన, జీతాలు పెంచే పరిస్థితులు లేకుండా పోతాయన్నారు. పాలకులు మారుతుంటారని, ప్రజలు శాశ్వతంగా ఉంటారని గుర్తు పెట్టుకుని పని చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటి వరకు చేసిన అప్పుల వల్ల భవిష్యత్తులో మరింత లోటు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. నదుల అనుసంధానం, కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా తాను త్వరలోనే పీపీటీలు ఇస్తానని స్పష్టం చేశారు. ‘‘కాళేశ్వరంతో రైతుల ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు. ఎకరానికి ఎంత పంట పండుతుందో తెలియదా? కేసీఆర్‌లా ఎకరానికి రూ.కోటి అందరూ సంపాదించలేరుగా?’’అని భట్టి ఎద్దేవా చేశారు.

  • ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ అప్పు, గ్యారెంటీలు కలిపి 3 లక్షల కోట్లు. రాబోయే నాలుగేళ్లలో ఇందులో రూ.37,064 కోట్లు తీర్చనుంది. అప్పుడు మిగిలే అప్పు రూ.2,62,936 కోట్లు. ఎఫ్‌ఆర్‌బీఎం కింద రానున్ననాలుగేళ్లలో ప్రభుత్వం తప్పనిసరిగా చేయనున్న రుణాలు రూ.1,70,182 కోట్లు. నాలుగేళ్లలో ప్రభుత్వం ఇవ్వనున్న గ్యారెంటీలు రూ.1,27,800 కోట్లు. ఇప్పటి వరకూ అప్పులు, భవిష్యత్తులో చేయబోయే అప్పులు, గ్యారెంటీలూ కలిపితే రూ.5లక్షల కోట్లు దాటుతాయి.
  • గత ఐదేళ్లుగా రెవెన్యూ రాబడులు ఏడాదికి సగటున 7 శాతం చొప్పున పెరుగుతున్నాయి. మేం 8ు చొప్పున అంచనా వేస్తే, రాబోయే నాలుగేళ్లలో రెవెన్యూ రాబడులు రూ.5,10,593 కోట్లు అవుతాయి. మొత్తం ఖర్చు రూ.5,67,192 కోట్లు ఉంటుంది. తద్వారా రెవెన్యూ లోటు రూ.56,599 కోట్లు ఉండనుంది. రాబోయే నాలుగేళ్లూ సగటున 7శాతం చొప్పునే రాబడులుంటే.. లోటు పెరిగిపోతుంది.
  • ఈ ఏడాది రెవెన్యూ ఆదాయం 1,04,000 కోట్లు. ఇందులో రూ.10 వేల కోట్లు భూముల అమ్మకం ద్వారా వచ్చేది. వీటిలో, జీతాలు, పథకాలకే 1,04,800 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. భూముల అమ్మకం ద్వారా రూ.10 వేల కోట్లు వస్తే సరేసరి. లేకపోతే, దాదాపు వెయ్యి కోట్ల లోటులోకి వెళ్లిపోతుంది.
  • ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.32,900కోట్లు. ఈ ఏడు ప్రభుత్వం చెల్లించాల్సిన అసలు, వడ్డీ కలిపి రూ.23,840కోట్లు. ఆర్బీఐ ఈ మొత్తాన్ని నేరుగా కట్‌ చేసుకుని మిగిలిన రూ.9,060 కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఇవ్వనుంది. ఈ మొత్తాన్నే రాష్ట్రం ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది.
  • కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు తక్కువగానే ఉంటున్నాయి. అయినా, ఏటా ప్రభుత్వం పెంచి చూపిస్తోంది. ఉదాహరణకు 2014-15లో అంచనా రూ.21,721 కోట్లు. ఆ ఏడాది వచ్చిన గ్రాంట్లు కేవలం రూ.7,118 కోట్లు మాత్రమే. ప్రతి ఏటా ఇదే పరిస్థితి. తాజా బడ్జెట్‌లో మాత్రమే దీనిని వాస్తవంగా చూపించింది.
  • బడ్జెట్‌ వాస్తవాలకు, రెవెన్యూ రాబడులకు హస్తిమశకాంతరం ఉంటోంది. ఈ తేడా ఏటా భారీగా పెరిగిపోతోంది. ఉదాహరణకు, 2014-15లో బడ్జెట్‌ (యాక్చువల్స్‌) రూ.62,306 కోట్లు. కానీ, రెవెన్యూ రాబడులు రూ.51,042 కోట్లే. 2019-20కి బడ్జెట్‌ (యాక్చువల్స్‌) రూ.1,46,000 కోట్లు. కానీ, రాబడులు కేవలం రూ.1,04,000 కోట్లు. అంటే, రెండింటి మధ్య వ్యత్యాసం రూ.42 వేల కోట్లు

Courtesy AndhraJyothy..