– మహారాష్ట్రలో ఆగని ఆత్మహత్యలు
– కుర్చీ కొట్లాటల్లో పార్టీలు అన్నదాతల మరణాలు
ముంబయి : మహారాష్ట్ర.. పేరు వినగానే గుర్తొచ్చేది అన్నదాతల ఆత్మహత్యలు. గతేడాది వరకూ వర్షాలు లేక… పంట నష్టాలను ఎదుర్కొన్నగా.. నేడు అకాలవర్షాలు అన్నదాతను నిలువునా ముం చేస్తున్నాయి. మరాఠ్వాడ, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతంలో నాలుగు రోజుల్లో పదిమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అకాల వర్షాలతో 54 లక్షల హెక్టార్లకుపైగా పంటలు దెబ్బతిన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక అంచన. కరువు ప్రభావిత ప్రాంతం ఔరంగాబాద్‌లో 22 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిన్నది. వాస్తవానికి నష్టం.. అంచనాలకంటే చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు రైతన్న ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. రాజకీయ నేతలు మాత్రం కుర్చీల కొట్లాటల్లో కూరుకుపోయారన్న ఆగ్రహం అన్నదాతల్లో వ్యక్తమవుతున్నది.
ఆదుకోవాలి…
మరాఠ్వాడకు చెందిన ముగ్గురు రైతులు – రమేష్‌ షెల్కే (55), రౌసాహెబ్‌ బిరాదార్‌ పాటిల్‌ (30), మరోతి భోసలే (45) ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. జల్గోన్‌ ప్రాంతంలో రేంసింగ్‌ బరేలా (60), ఆనంద పాటిల్‌ (40) తనువుచాలించారు. అహ్మద్‌నగర్‌ జిల్లాలో యువ రైతు భారత్‌ గడ్డే (24) ఆత్మహత్య చేసుకున్నాడు. ‘పరిస్థితి ఆందోళనకరంగా వున్నది. రైతులు ఉరికంబాలకెక్కి ప్రాణాలు తీసుకుం టున్నారు. వీరితో పలువురు రైతులు ప్రాణత్యాగాలు చేస్తున్నా ఫడ్నవీస్‌ సర్కార్‌ ముంబయి నుంచి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నది. భారీ వర్షాలతో పంటలన్నీ నాశనమయ్యాయి. ఈ పరిస్థితి ని అన్నదాతకు ప్రభుత్వం అండగా నిలవాలి. వారిని అన్నివిధాలా ఆదుకోవాలి. కానీ సర్కారు ఇవేం పట్టించుకోవటం లేదని రైతుసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కరువు ప్రభావిత మరాట్వాడా, విదర్భలోని అనేక ప్రాంతాల్లో ఖరీఫ్‌ విత్తనాలు ఆలస్యం అయ్యాయి. అకాల వర్షాల కారణంగా రబీ పంట సాగులో కూడా అనిశ్చితి నెలకొన్నది’ అని వ్యవసాయ నిపుణుడు నిషికాంత్‌ భలేరావు అన్నారు. నష్టపోయిన ప్రాంతాల్లో నేెతలంతా కెమెరాలతో సందర్శించటం, మీడియాకు ఫోజులివ్వటంతో సరిపెడుతున్నారు. అలా కాకుండా రైతులకు భరోసా ఇవ్వాలనీ, వారిని తక్షణమే ఆదుకోవాలన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో రైతు ఆత్మహత్యల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భలేరావు ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదేండ్లలో (2014-18) 14,034 మంది రైతులు (అంటే రోజుకు ఎనిమిది మంది) మహారాష్ట్రలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అన్నదాతల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర అగ్ర స్థానంలో వున్న విషయం తెలిసిందే. ఇప్పటికైనా తమ గోస పట్టించుకోవాలని రైతులు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తున్నారు.

Courtesy Navatelangana..

Tags- four days, Ten farmers, suicides, in Maharashtra, BJP, Shivsena, in, political war