రచన: డా. బి.ఆర్. అంబేద్కర్బి.ఆర్.అంబేద్కర్ ప్రచురించిన మూక్ నాయక్ అనే మరాఠీ పత్రిక శత జయంతి సందర్భంగా ఆ పత్రిక మొదటి సంచికలో కుల వివక్షపై బాణాలు ఎక్కుపెడుతూ రాసిన సంపాదకీయంలోని కొంత భాగం.

మూక్ నాయక్ (పీడితులనాయకుడు) అంబేద్కర్ స్థాపించిన మొట్టమొదటి పక్షపత్రిక. షాహూజీ మహరాజ్ ఆర్థిక మద్దతుతో 1920లో ప్రారంభించారు. అంబేద్కర్ ఈ పత్రికని ప్రారంభించడం ద్వారా స్వరాజ్ ఉద్యమాలపై,అంటరాని వారికి విద్యా సదుపాయాలపై,అంటరానితనంపైనా తన అభిప్రాయాలని వెల్లడించాలని అనుకున్నారు. మెయిన్ స్ట్రీమ్ హిందీ పత్రికలేవీ ఈ అంశాలకి అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఆయన గమనించారు.

మూక్ నాయక్ సుమారు మూడేళ్ల పాటు ప్రచురితమైంది. జనవరి 31,1920 న మొదటి సంపాదకీయం ముఖ్యాంశాలు.

ఎవరైనా మన దేశ సామాజిక జీవనాన్ని,పౌరుల స్థితిగతులని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్టైతే ఇక్కడ అనేకానేక అసమానతలు,వైరుధ్యాలు ప్రజల మధ్య ఏవిధంగా పాతుకుపోయాయో వారికి స్పష్టంగా అర్థమౌతుంది. ఈ అసమానతలు అన్నింట్లోకీ పౌరుల జీవన ప్రమాణాలపైనా ప్రభావం చూపేవీ ఉండడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం.

భారతీయుల్లో చాలా వైరుధ్యాలు ఉన్నప్పటికీ మతసంబంధిత వైరుధ్యాలు మాత్రం అన్నింటికంటే ప్రమాదకరమైనవి. ఈ వైరుధ్యాలు చాలాసార్లు రక్తపాతానికి దారితీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. హిందువులు,పార్శీలు,ముస్లింలు,యూదులు,క్రిస్టియన్ల మధ్య మతపరమైన విభేదాలు చాలానే ఉన్నప్పటికీ మళ్లీ హిందూ మతంలోనే వివిధ వర్గాల ప్రజల మధ్య ఉండే వైరుధ్యాలూ,విభేదాలూ ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి.

ఒక యూరోపియన్ ని నువ్వు ఎవరనే ప్రశ్న అడిగితే తాను బ్రిటిష్ వాడిననో,జర్మన్,ఇటాలియన్ లేక ఫ్రెంచి వాడననో సమాధానం చెబుతాడు. కానీ హిందువుల విషయంలో అలా కాదు. కేవలం నేను హిందువుని అని చెప్పడం సరిపోదు,తనకి ప్రత్యేక గుర్తింపు లభించాలంటే ఏ వ్యక్తైనా తన కులాన్నీ చెప్పి తీరాల్సిందే.

హిందూ సమాజంలో కులం ఓ నిచ్చెన మెట్ల వ్యవస్థ లాంటిది. హిందూ సమాజం ఒక భవంతి ఐతే అందులో ఒక్కో  అంతస్థు ఒక్కో కులానికి కేటాయించబడింది. ఐతే ఈ టవర్ లో ఒక ఫ్లోర్ నుంచి మరో ఫ్లోర్ కి ఎక్కడానికీ,దిగడానికీ ఎలాంటి మెట్లూ ఉండవు. ఏ అంతస్థులో పుట్టినవారు అక్కడే మరణించాలి. కింద ఫ్లోర్ లో పుట్టిన వ్యక్తి ఎంత ప్రతిభావంతుడైనా పైకి వెళ్లే అవకాశం అతనికి ఉండదు. అలాగే పై ఫ్లోర్ లో పుట్టిన ఎలాంటి ప్రతిభా లేని వ్యక్తిని కింది అంతస్థుకి పంపించడమూ జరగదు.

ఈ కులాల మధ్య సంబంధం విలువలపై ఆధారపడి ఉండదు. అగ్రకులంలో పుట్టిన వ్యక్తి ఎలాంటి వాడైననూ సమాజంలో అతని హోదా ఎప్పుడూ పైనే ఉంటుంది. ఇదేవిధంగా యోగ్యుడైన నిమ్న కులస్తుడూ తన నిమ్నత్వాన్ని అధిగమించి పైకి వెళ్లలేడు. అగ్ర,నిమ్న కులాల మధ్య జరిగే కులాంతర వివాహాలపై సమాజంలో ఉన్న నిషేధాజ్ఞల కారణంగా ఈ రెండు వర్గాలూ ఎల్లవేళలా విడదీయబడే ఉంటాయి. ఈ కులపరమైన సంబంధాల్లో అగ్ర,నిమ్నకులాల మధ్య ఎలాంటి సాన్నిహిత్యం పెరిగే అవకాశమే ఉండదు. ఐతే వీటిలో కొన్ని కులాల మధ్య పరిమిత స్థాయిలో సత్సంబంధాలే ఉన్నప్పటికీ “అపరిశుద్ధం” గా పిలవబడే కొన్ని కులాలకి మాత్రం అవి కూడా నిరాకరించబడతాయి. ఈ అంటరాని కులాలని సవర్ణ హిందువులు అసహ్యించుకుంటారు.

నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అందరికన్నా పైన ఉండేది తమని తాము భువిపై వెలసిన దేవుళ్లుగా భావించే  బ్రాహ్మణులు. మిగిలిన పురుషులూ,మహిళలంతా తమకి సేవలు చేయడానికే పుట్టారని వారు భావిస్తారు. కాబట్టి వారంతా తమ పట్ల భక్తిభావంతో మెలగాలని ఆశిస్తారు. ఎన్నో అప్రజాస్వామిక,దుర్మార్గ ఆలోచనలకి కేంద్రమైన హిందువుల మతగ్రంథాలని రచించడం ద్వారా తమకేదో ఉన్నతత్వం లభించిందనే భ్రమలో వారు బతుకుతుంటారు.

బ్రాహ్మణేతరులు మాత్రం వారికి ఏవిధమైన ఆస్తులు గానీ,విద్యా సదుపాయాలు గానీ లేకపోవడం వల్ల వెనుకబడిపోయారు. ఐతే వారికి వ్యవసాయ,పారిశ్రామిక రంగాల్లో ఉపాధి అవకాశాలైనా లభించే అవకాశం ఉండడం వల్ల వీరి పరిస్థితి కొంతవరకూ పర్వాలేదు. కానీ కులవివక్ష వల్ల అందరికంటే ఎక్కువగా నష్టపోయింది మాత్రం అంటరానివారూ,దళితులే అనేది మాత్రం సుస్పష్టం. ఆత్మగౌరవం లేక,అవకాశాలూ లోపించి,ఎదగడానికి ఏవిధమైన పరిస్థితులూ అనుకూలించక వారంతా పడుతున్న కష్టాలూ,బాధలని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. వారు బానిసత్వ సంకెళ్లని తెంచుకుని సాధికారత వైపు అడుగులేసే ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలవ్వడం చాలా మంచి పరిణామం.

దురదృష్టవశాత్తూ ఇప్పటికీ దళితుల సమస్యలపై అవగాహన కల్పించే మీడియా సంస్థలు ఒక్కటి కూడా లేవు. కొన్ని వార్తాపత్రికలూ,సంచికలూ నిమ్నకులాలు ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తినా ప్రత్యేకించి దళిత సమస్యలపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరించేవి మాత్రం లేవు. ప్రధానంగా ఈ లక్ష్యాలని నెరవేర్చేందుకే మూక్ నాయక్ అనబడే ఈ పక్షపత్రిక ప్రచురించబడుతోంది.

(ఢిల్లీ యూనివర్సిటీ హిందీ అధ్యాపకుడు ప్రొఫెసర్ షియోరాజ్ సింగ్ బేచైన్ మరాఠీ నుంచి హిందీలోకి,ఆంగ్ల అధ్యాపకుడు డాక్టర్ తపన్ బసు ఆంగ్లంలోకీ  అనువదించారు.)