నిందితురాలు, ఓ ఐఏఎస్‌ భార్య మధ్య తరచుగా ఫోన్‌ సంభాషణలు
ప్రభుత్వ శాఖల్లో వేగుల ఏర్పాటు
ఏసీబీకి చిక్కిన ఆధారాలు
ఫోరెన్సిక్‌ నివేదిక అందాక చర్యలు?

బీమా వైద్య సేవల (ఐఎంఎస్‌) విభాగం కుంభకోణంలో ఓ కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. కీలక నిందితురాలు, ఓ ఐఏఎస్‌ అధికారి సతీమణి మధ్య పలుమార్లు ఫోన్‌ సంభాషణలు నడిచినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. ఈ నిందితురాలి నుంచి వజ్రాభరణాల రూపంలో ఐఏఎస్‌ భార్య లబ్ధి పొంది ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

హైదరాబాద్‌: బీమా వైద్యసేవల (ఐఎంఎస్‌) విభాగం కుంభకోణంలో మరో పేరు వెలుగులోకి వచ్చింది. కుంభకోణం దర్యాప్తు క్రమంలో నిందితురాలిని ఐఏఎస్‌ అధికారి కాపాడే ప్రయత్నం చేసిన దాఖలాలుండటం, తాజాగా ఫోన్‌ సంభాషణలు వెలుగు చూడటంతో ఐఏఎస్‌ పాత్రపై దర్యాప్తు అధికారుల అనుమానాలు బలపడుతున్నాయి.

ప్రస్తుతం నిందితురాలి ఫోన్‌ను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాల (ఎఫ్‌ఎస్‌ఎల్‌)కు పంపించారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా దర్యాప్తులో ముందుకెళ్లే అవకాశాలున్నాయి. వీరిద్దరి మధ్య లావాదేవీలు జరిగినట్లు తేలితే ఐఏఎస్‌ సతీమణికి నోటీస్‌ ఇచ్చి విచారించే అవకాశం ఉంది.

ఈ కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తు ఆరంభించిన తొలి నాళ్లలో కీలక నిందితురాలిని సదరు ఐఏఎస్‌ అధికారి వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకునేట్లు చేస్తామని దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. మిగిలిన నిందితుల విషయంలో దర్యాప్తు చేసుకోవచ్చని చెప్పారు. ఏసీబీ ఆయన సూచనను పక్కనపెట్టి దర్యాప్తు లోతుల్లోకి వెళ్లడంతో కీలక నిందితురాలి అక్రమాలు భారీ ఎత్తున బహిర్గతమయ్యాయి.

ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం
నిఘా విభాగం దర్యాప్తు నేపథ్యంలో కీలక నిందితురాలు ముందే అప్రమత్తమైనట్లు ఏసీబీకి తాజాగా ఆధారాలు లభించాయి. పలు ప్రభుత్వ శాఖల్లో ఆమె వేగుల్ని నియమించుకున్నట్లు గుర్తించారు. కుంభకోణంపై ఉన్నతస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశముంది? ఎలాంటి నివేదికలు రూపొందిస్తున్నారనే విషయాల్ని ఆమె ఎప్పటికప్పుడు తెలుసుకుంది. ప్రస్తుతం ఆయా శాఖల్లోని వేగులపై ఏసీబీ దృష్టి సారించింది. వారి నిర్వాకంపై దర్యాప్తు చివర్లో ఆయా శాఖలకు నివేదికలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

వేగులపై ఆధారాలివీ..
కార్మిక శాఖ కార్యదర్శి పేషీ ఉద్యోగి ఒకరు గత జూన్‌ చివర్లో నిందితురాలికి నోట్‌ ఫైల్‌ సమాచారం అందించారు.
ఇదే కుంభకోణంలో అరెస్టయిన ఓ ఫార్మా సంస్థ నిర్వాహకుడు గత జూన్‌ 18న నిఘా విభాగం నివేదిక ప్రతిని నిందితురాలికి పంపించారు. ఆ విభాగం దర్యాప్తు వివరాల్ని ఎప్పటికప్పుడు అందించారు. సచివాలయంలోని సాధారణ పరిపాలన విభాగం ఉద్యోగి ఒకరు ఈ సమాచారాన్ని ఆయనకు ఇచ్చేవారు.
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలోని సీనియర్‌ అసిస్టెంట్‌ ఒకరు నిఘా విభాగం దర్యాప్తు నుంచి ఎలా తప్పించుకోవాలనే విషయంలో తరచూ సలహాలు ఇచ్చేవారు. సచివాలయంలోని తన సహచరుల నుంచి ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని సేకరించి నిందితురాలికి సూచనలు చేసేవారు.

Courtesy Eenadu…