– కొత్త చట్టాలతో పాడి రైతులకు కష్టాలు
– దిగుమతులకు బాటలు…దిగుబడులకు కోతలు
– ప్రమాదంలో పాల సహకార సొసైటీలు
– రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తేనే ‘క్షీర విప్లవం’
‘పాలు పొంగి పొయ్యిపాలయ్యాయి. పాలు పొంగుతాయి చూడండి. పాలు పొంగాయి ఏం చేస్తున్నారు’ ఇలాంటి మాటలు ప్రతి ఇంటిలో వినిపిస్తాయి. పాలు పొయ్యిపాలైతేనే ఎంతో బాధపడే వినియోగదారులకు కొత్త వ్యవసాయ చట్టాలు పాల ఉత్పత్తినే కబళించనున్నాయి. విదేశీ పాల కంపెనీలు దేశీయ పాలపై పంజా విసరనున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాలు విదేశీ పాల దిగుమతులకు రాచబాట వేశాయి.

హైదరాబాద్‌ : దేశీయపాల దిగుబడులకు క్రమక్రమంగా కోతలు పెట్టనున్నాయి. తెలంగాణ రాష్ట్రంపై దాని ప్రభావం అధికంగా ఉండబోతున్నది. ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులు, పేదలు, భూమిలేని నిరుపేద పాల ఉత్పత్తిదారుల జీవితాలను ఆ చట్టాలు అతలాకుతలం చేయనున్నాయి. పాలసహకార సొసైటీలు నిర్వీర్యమై…అందులో సభ్యులుగా ఉన్న పేద రైతులు అత్యంత ప్రమాదంలో పడతారనే వ్యవసాయ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ‘శ్వేతవిప్లవం’ తీసుకొస్తేగానీ పాడి పరిశ్రమ మనుగడ సాగించే పరిస్థితి లేదు. గ్రామీణ రైతులకు రెండో ఆదాయ వనరుగా ఉంటున్న పాడిపరిశ్రమలను బలోపేతం చేయాల్సి ఉంటుంది. వినియోగదారుల అవసరంమేరకు పాల దిగుబడి పెంచడంతో వారికి ప్రోత్సహాకాలు అందించాల్సి ఉంది.

రక్షణ చట్టాలే శరణ్యం
కేంద్ర వ్యవసాయ చట్టాలను తిరస్కరించి, రాష్ట్ర రక్షణ చట్టాలు రూపొందించడం ద్వారానే పాడి పరిశ్రమను రక్షించుకోవడం సాధ్యమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల చట్టం 1964తో రైతులకు కొంతమేరకు మేలు జరిగింది. కొంతమేరకు రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరిగింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీస్‌ (మ్యాక్స్‌) 1995 పేరుతో కొత్త చట్టం తెచ్చారు. దీని ప్రకారం సొసైటీలు నిర్వీర్యమయ్యాయి. క్రమంగా ప్రయివేటు కంపెనీలు ప్రవేశించాయి. పాడి రైతుల బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంది. పాల సేకరణ, అమ్మకాలు, లాభాలు అన్ని కూడా యాజమాన్యాలే చూసుకుంటాయి. ఈ చట్టాన్ని బలోపేతం చేసేలా కేంద్రం వ్యవసాయ చట్టాలు తెచ్చింది. ఈ నేపథ్యంలో పాడి పరిశ్రమ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని రైతు సంఘాలు సూచిస్తున్నాయి. 2014-15 సంవత్సరంలో 29 లక్షల పశువులు ఉంటే, 42వేల టన్నుల పాల ఉత్పత్తి జరిగేది. 2019-20 సంవత్సరంలో 34 లక్షల పశువులతో 57.34 లక్షల టన్నుల పాల ఉత్పత్తి జరుగుతున్నది. పాల పరిశ్రమపై 26 లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. రూ 6600 కోట్ల ఆదాయం వస్తున్నది. పాల దిగుమతులతో పాలసొసైటీలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. హెరిటేజ్‌, దొడ్ల, మస్కతి, జెర్సీ, ఉపద్రష్ట, నంది, ఆల్‌సఫా, స్విగ్గీ వంటి ప్రయివేటు పాల పరిశ్రమలున్నాయి. ఈ నేపథ్యంలో పాడి పరిశ్రమకు రూ 1677 కోట్ల ఖర్చుతో 50 శాతం సబ్సిడీపై గేదెలు, గడ్డికోయడానికి మిషన్లు, దాణా, మినరల్స్‌, కాల్షియం, ఎదకు రావడానికి ఇంజెక్షన్లు ఇస్తామని సీఎం మామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేరలేదు.

మన ఆవుల మూతులకు రోగాలట…పిచ్చి పట్టినవట…
‘కుక్కను చంపాలంటే పచ్చికుక్క’ అని ముద్రవేసి చంపినట్టుగానే…దేశీ పాల ఉత్పత్తిని నాశనం చేయడానికి మన పాలపై విదేశీ కంపెనీలు దుష్ప్రచారం చేస్తున్నాయి. మన ఆవుల మూతులకు రోగాలట (మౌత్‌డిసీస్‌). పిచ్చి ఆవులు(మ్యాడ్‌కౌస్‌) వాటిని చంపేయాలంటూ ప్రచారం చేస్తున్నాయి. అటువంటి ఆవు పాలు తాగితే రోగాలు, నొప్పులు వస్తాయని గోబెల్స్‌ ప్రచారాన్ని ఎత్తుకున్నాయి. మరోవైపు మన రాష్ట్రంలో ఉన్న ప్రయివేటు పాల పరిశ్రమలు విజయ డెయిరీపై కుట్రలు చేస్తున్నాయి. విజయ డెయిరీకి ఉన్న విశ్వసనీయతను దెబ్బతీయడానికి అనేక కుయుక్తులు పన్నుతున్నాయి. పాలతోపాటు పసుపు, మిరప, చేపలు (ఏపీతోకలిపి), పౌల్ట్రీలలో నెంబర్‌ వన్‌గా ఉన్న మన దేశంలోకి దిగుమతులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. కోళ్ల పరిశ్రమకు బర్డ్‌ప్లూ అంటూ ప్రచారం చేస్తున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉందనే విమర్శలున్నాయి. దీంతోపాటు మన రాష్ట్రంలో ఉన్న 657 పాల సొసైటీలూ ప్రమాదంలో పడనున్నాయి. పాలుపోయడం, అమ్మడం, వచ్చిన లాభం కూడా రైతులకే సొసైటీలు పంచుతాయి. దీంతో అవినీతి కూడా ఉండదు.

పాల ఉత్పత్తితో ప్రయివేటు కంపెనీల పెత్తనం పెరిగిపోయి పాడి రైతు దోపిడీకి గురి అవుతారు. ఎండకాలంలో పాల ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ప్రయివేటు కంపెనీలు ఎగబడి పాలు సేకరిస్తాయి. వానకాలంలో ఉత్పత్తి ఎక్కువైతే కొనకుండా ముఖం చాటేస్తున్నాయి. దీంతో రైతు నష్టాలపాలవుతున్నారు.

ప్రపంచంలో నెంబర్‌ వన్‌…అయినా పాల దిగుమతి
ప్రపంచంలోనే మనదేశం పాల ఉత్పత్తిలో నెంబర్‌ వన్‌. ప్రపంచంలో పాల ఉత్పత్తి 84. 30 కోట్ల టన్నులు. మన దేశంలో 18.77 కోట్ల టన్నులు, అమెరికా 9.86 కోట్ల టన్నులు, పాకిస్తాన్‌ 4.57 కోట్ల టన్నులు, న్యూజిల్యాండ్‌ 2.13 కోట్ల టన్నులు. మన దేశం కంటే ఎన్నో రెట్ల పాలఉత్పత్తి తక్కువగా ఉన్న దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. నెస్లే, డెయిరీ ఫార్మర్‌, క్రాస్‌ఫుడ్స్‌ వంటి కంపెనీలకు పాలు దిగుమతి అవుతున్నాయి. పాల పౌడర్‌ రూపంలోనూ దిగుమతులు ఉన్నాయి. ఆ సాంకేతికతను వినియోగించడంలోనూ వైఫల్యం ఉన్నది. కొత్త చట్టాలతో దిగుమతులు ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాడి పరిశ్రమను ప్రోత్సహించకపోగా, నిర్వీర్యం చేసేందుకు ప్రయివేటు కంపెనీలతో చేతులుకలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమకు సౌకర్యాలు కల్పించడం ద్వారానే ఆ పరిశ్రమను బతికించుకోగలమని రైతు సంఘాలు అంటున్నాయి.

క్షీర విప్లవం దానంతట అదే రాదు
క్షీర విప్లవం దానంతట అదే రాదు. సొసైటీలను అభివృద్ది చేయాలి. పాల ఉత్పత్తిని పెంచాలి. పాడి ఆవులకు సబ్సిడీ ఇవ్వాలి, దాణా పంపిణీ చేయాలి. మొబైల్‌ వాహనాలతో పశువులకు ఆరోగ్య రక్షణ కల్పించాలి. మందులు, డాక్లర్లను అందుబాటులో ఉంచాలి. కృత్రిమ గర్భధారణ కోసం తగిన ఏర్పాట్లు చేయాలి. పాలడెయిరీలను కొనసాగించడానికి రుణ సౌకర్యం కల్పించాలి. రుణాలు తీర్చిన వారికి అదనపు ఉత్పత్తి కోసం సహకరించాలి. మధ్యాహ్నం భోజనంలో విద్యార్థులకు పాలు ఇవ్వాలి. పాలు, పాల ఉత్పత్తులను తయారు చేసేలా ఆధునిక పద్దతులను ప్రోత్సహించాలి. 10శాతం వెన్న ఉంటే రూ 80 చెల్లించాలి. ఇటు వంటివన్నీ చేయడమే శ్వేతవిప్లవానికి చేయూత!
– సారంపల్లి మల్లారెడ్డి, ఏఐకేఎస్‌ జాతీయ ఉపాధ్యక్షులు

Courtesy Nava Telangana