దిగుమతులు అధికంగా రావడంతో దేశంలో నిరుద్యోగం కూడా తీవ్రంగా పెరుగుతున్నది. చివరికి గ్రామీణ నిరుద్యోగం 20 శాతం నుంచి 30 శాతానికి చేరకున్నది. వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తులు పెంచుకోవడం ద్వారా ఆస్తులు పెంచుకోవాలన్న లక్ష్యం వైపు ప్రభుత్వాలు విధానాలు అమలు చేయడం లేదు. చివరికి దేశీయ గుత్త పెట్టుబడిదారులు కూడా విదేశీ బహుళజాతి కంపెనీలతో జతకట్టి వారి ద్వారానే లాభాలు గడించే ప్రయత్నం చేస్తున్నారుతప్ప దేశీయంగా తమ ఉత్పత్తులను పెంచుకోవడానికి ఎలాంటి పరిశోధనలు జరగడం లేదు.

సరళీకృత ఆర్థిక విధానాల అమలు ఫలితంగా భారత వ్యవసాయోత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీకి నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఆయా దేశాల వాతావరణాలను బట్టి పెట్టుబడి ఎగుడు దిగుళ్లుగా ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఉత్పత్తి అయిన దేశాలలోని వ్యవసాయోత్పత్తులను అధిక పెట్టుబడితో ఉండే దేశాలలోకి డంప్‌ చేయడం ద్వారా ఆ దేశాలలోని వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయరు. ఫలితంగా ఆ దేశాలలో వ్యవసాయ రంగం సంక్షోభం లోకి నెట్టబడుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీకి తట్టుకోలేని దేశాలు దివాళా తీసిన ఘటనలు అనేకం. 1995 జనవరిలో ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) తన విధానాల అమలును 2005 నుండి ప్రారంభించింది.

అమలు మొదలు కావడంతో అభివృద్ధి చెందుతున్న దేశాల లోని వ్యవసాయోత్పత్తులు అంతర్జాతీయ పోటీని తట్టుకోలేక పోతున్నాయి. అంతే కాకుండా ధనిక దేశాలు తమ ఎగుమతిదారులకు పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి వాణిజ్య పోటీని పెంచుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎగుమతి సబ్సిడీలు ఇవ్వరాదని ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. 2015 డిసెంబర్‌ 19న నైరోబీలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ, మంత్రివర్గ సమావేశంలో పత్తిపై ఎగుమతి సబ్సిడీలు ఇవ్వకూడదని నిర్ణయం చేశారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అమెరికాలో ఆ ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. క్రమంగా ఎగుమతి సబ్సిడీలను అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు వర్తింపజేయడానికి డబ్ల్యుటిఒ లో ప్రయత్నం జరుగుతున్నది. దీనివల్ల మన దేశం నుంచి ఎగుమతి అయ్యే వ్యవసాయోత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది.

భారతదేశం నుంచి కాఫీ, టీ, పొగాకు, బాదాం, కెర్నెల్‌ సుగంధ ద్రవ్యాలు, ముడి పత్తి, బియ్యం, చేపలు, మాంసం ఎగుమతుల ద్వారా 2017-18లో 1.96 లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు కాగా 18-19లో 2.31 లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు జరిగాయి. కానీ అదే సందర్భంలో దిగుమతులు 17-18లో ముడి ధాన్యాలు, బాదంపప్పు, ముతక ఊలు, ముతక పత్తి, జూటు, వంటనూనెలు, ఎరువులు రూ.2.64 లక్షల కోట్లు, 2018-19లో 2.43 లక్షల కోట్లు వచ్చాయి. కనీస వ్యవసాయ ఉత్పత్తులలో దేశం స్వయం సమృద్ధిని సాధించిన స్థితిలో కూడా దిగుమతులు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

మొదటిసారి పామాయిల్‌ దిగుమతి రావడంతో దేశంలోని నూనెగింజల పంటలు వేరుశనగ, నువ్వులు, ఆముదాలు, పొద్దుతిరుగుడు పువ్వు పంటలకు మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో వాటి విస్తీర్ణం తగ్గింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో 60 లక్షల ఎకరాలకు పైగా వేసిన వేరుశనగ 35 లక్షల ఎకరాలకు తగ్గింది. మిగతా నూనె గింజల పంటల విస్తీర్ణం కూడా తగ్గింది. దాంతో ప్రస్తుతం 1.50 కోట్ల టన్నుల వంట నూనెలను రూ.74 వేల కోట్లు వెచ్చించి దిగుమతులు చేసుకుంటున్నాము. వీటితో పాటు పంచదార, పత్తి, మాంసం, పప్పు ధాన్యాలు కూడా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై ఏటా భారత ప్రభుత్వం రూ.2.55 లక్షల కోట్లు వెచ్చిస్తున్నది. అదే సందర్భంలో దేశంలో 9 లక్షల ఎకరాల సాగుభూమి బీళ్లుగా మారింది. బీళ్లుగా మారిన భూమిలో నూనెగింజలు, పప్పుధాన్యాలు, పత్తి ఉత్పత్తి చేశారు. గిట్టుబాటు ధర తగ్గడంతో భూములను బీళ్లుగా పెడుతున్నారు. తెలంగాణలో 1.63 కోట్ల ఎకరాల సాగుభూమి ఉండగా 53 లక్షల ఎకరాలు, ఆంధ్ర ప్రదేశ్‌లో 2 కోట్ల ఎకరాల సాగు భూమిలో 40 లక్షల ఎకరాలను బీళ్లుగా మార్చారు. ఆ విధంగా అనివార్యంగా దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో 3.65 కోట్ల టన్నులు ఉత్పత్తి జరిగిన పంచదార నేడు 2.55 కోట్ల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. అతి చిన్న దేశాలైన మయన్మార్‌, ఆఫ్రికా దేశాల నుంచి 50 లక్షల టన్నులు పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నాము. మలేషియా, సింగపూర్‌ నుంచి వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నాము. పాకిస్తాన్‌, అమెరికా నుంచి పత్తి దిగుమతులు వస్తున్నాయి. కోళ్ల ఉత్పత్తిలో ప్రధాన దేశంగా ఉన్న భారత దేశానికి కోడి కాళ్లు కెఎఫ్‌సి, మెక్సికన్‌, ఫ్రైడ్‌ చికెన్‌ పేరుతో దిగుమతులు వస్తున్నాయి. ఈ దిగుమతులు రావడంతో దేశీయ ఉత్పత్తులు తగ్గి పోతున్నాయి. వారు లాభాలను తరలించుకుపోతున్నారు.

దిగుమతులు అధికంగా రావడంతో దేశంలో నిరుద్యోగం కూడా తీవ్రంగా పెరుగుతున్నది. చివరికి గ్రామీణ నిరుద్యోగం 20 శాతం నుంచి 30 శాతానికి చేరకున్నది. వ్యవసాయ రంగంలో వస్తున్న యాంత్రీకరణ మార్పులను, పంటల మార్పులను ప్రపంచంలో మారుతున్నంత వేగంగా మన దేశంలో మార్చుకోవడం లేదు. ఇంకా పాత ఫ్యూడల్‌ ఉత్పత్తి పద్ధతులే కొనసాగుతున్నాయి. దేశంలో చెరుకు, పామాయిల్‌, మొక్కజొన్న సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెంచడం ద్వారా బ్రెజిల్‌ లాగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ అవసరాలనూ తీర్చుకోవచ్చు. ప్రస్తుతం 80 శాతం జరుగుతున్న దిగుమతులను 40 శాతానికి తగ్గించుకోవచ్చు. విత్తనాలు, ఆల్కహాలు, బయో డీజిల్‌ లాంటి ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

దేశంలో ఉన్న మొత్తం 43 కోట్ల ఎకరాల సాగు విస్తీర్ణాన్ని ఉపయోగించుకోగలిగిన పుడు మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు పెంచడానికి ఆస్కారం ఉంటుంది. దానికి తగిన విధంగా ప్రభుత్వం రాయితీల కల్పనతో పాటు కనీసం ఇతర దేశాల్లో అనుసరిస్తున్న విధానాలపైనా పాటించాలి. కానీ ఇక్కడి పాలక వర్గాలు నేటి పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ విధానాన్ని రూపొందించు కోవడం లేదు. దీనివల్ల దేశం, రాష్ట్రాలు అనివార్యంగా అప్పుల పాలవు తున్నాయి. ప్రస్తుతం మన దేశీయ బడ్జెట్‌ రూ. 27 లక్షల కోట్లు కాగా రుణం రూ. 34 లక్షల కోట్లకు చేరకున్నది. ప్రతీ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది. అయినా ఇంకా అప్పుల వేటలోనే కొనసాగుతున్నారు.

వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తులు పెంచుకోవడం ద్వారా ఆస్తులు పెంచుకోవాలన్న లక్ష్యం వైపు ప్రభుత్వాలు విధానాలు అమలు చేయడం లేదు. చివరికి దేశీయ గుత్త పెట్టుబడి దారులు కూడా విదేశీ బహుళజాతి కంపెనీలతో జతకట్టి వారి ద్వారానే లాభాలు గడించే ప్రయత్నం చేస్తున్నారుతప్ప దేశీయంగా తమ ఉత్పత్తులను పెంచుకోవ డానికి ఎలాంటి పరిశోధనలు జరగడం లేదు. వ్యవసాయ రంగం నుంచి, పారిశ్రామిక రంగం నుంచి అనేక మంది ఇతర రంగాలకు వలసలు వెళుతున్నారు. దేశంలో ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏ దేశంలోనూ ఈ పరిస్థితి లేదు. ఇదంతా దిగుమతుల ప్రభావమే.

మనకున్న మౌలిక వనరులను, మానవ శ్రమను, పెట్టుబడులను, సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా ప్రపంచంలో ధనిక దేశంగా అభివృద్ధి చెందవచ్చు. ప్రస్తుతం ఉన్న 1.5 ట్రిలియన్‌ డాలర్ల జిడిపిని 5 ట్రిలియన్‌ డాలర్లకు తీసుకెళతానని ప్రధాని మోడీ ప్రకటించడం హాస్యాస్పదమే తప్ప అమలు కాని లక్ష్యంగా ఉంది. 2020-22 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మూడు సంవత్సరాల క్రితం ప్రకటించినా, గతంలో ఉన్న ఆదాయం తగ్గుతున్నదే తప్ప పెరగడం లేదు. అందువల్ల వ్వవసాయ పారిశ్రామిక ఉత్పత్తుల పెంపుదలకు, మౌలిక వనరుల వినియోగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమమైన పథకాలు రూపొందించాలి.

సారంపల్లి మల్లారెడ్డి
( వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులుసెల్‌ : 9490098666 )