• 9వ అంతస్తు  పై నుంచి దూకి బలవన్మరణం.. ఏపీలో కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌  విభాగాధికారిగా విధులు
  • ఉద్యోగపరమైన ఒత్తిళ్లే కారణమని సమాచారం
  • మనస్తాపంతో మూడు నెలలుగా సెలవులో..
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

హైదరాబాద్‌ సిటీ/కొత్తపేట/అమరావతి: ఏపీకి చెందిన సీనియర్‌ ఐఎ్‌ఫఎస్‌ అధికారి డాక్టర్‌ వాడ్రేవు భాస్కర రమణమూర్తి (59) బుధవారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. నాగోల్‌ బండ్లగూడలోని రాజీవ్‌ స్వగృహ అపార్టుమెంట్‌ 2వ అంతస్తులో ఉంటున్న ఆయన.. 9వ అంతస్తు నుండి దూకి ప్రాణాలు తీసుకున్నారు. సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

1987 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌) కేడర్‌ అధికారి. కానీ, ప్రస్తుతం ఏపీ అటవీ శాఖలో కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంటే రెండు స్థాయులు తక్కువగా ఉండే పోస్టు. పీసీసీఎఫ్‌ స్థాయి అధికారి ఇలా బలవంతంగా ఉసురు తీసుకోవడం రెండు రాష్ట్రాల్లో కలకలం రేపింది.

కాకినాడకు చెందిన భాస్కర రమణమూర్తి విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే జరిగింది. బనారస్‌ వర్సిటీలో పీహెచ్‌డీ చేసినట్లు సమాచారం. ఆయనకు భార్య జ్యోతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏపీలో పనిచేస్తున్న ఆయన.. వారానికి ఒకసారి హైదరాబాద్‌కు వచ్చేవారు. అయితే, లాక్‌డౌన్‌ సమయంలో 3 నెలలపాటు ఏపీలోనే ఉండి విధులు నిర్వహించారు.

అనంతరం నెల రోజులు సెలవుపెట్టి హైదరాబాద్‌కు వచ్చారు. జూలై నుంచి సెలవును పొడిగించుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. గత వారంగా.. ‘‘నేడో రేపో డ్యూటీకి వెళ్లాలి నువ్వు రెడీగా ఉండాలి. పిలిచిన వెంటనే రావాలి’’ అని డ్రైవర్‌ మహేశ్‌కు చెప్పారు. ‘‘నేడో రేపో ఏపీకి వెళ్దామన్న ఆయన ఇంతలోనే అఘాయిత్యానికి పాల్పడ్డారు’’ అని డ్రైవర్‌ మహేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

అసలేం జరిగింది?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమణమూర్తి బుధవారం రాత్రి 9.30 గంటలకు భోజనం ముగించుకొని నిద్రపోయారు. 10.30 గంటలకు చలిగా ఉందని భార్యతో చెప్పి పడగ్గది నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపు ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడినట్లు సమాచారం. అర్ధరాత్రి దాటిన తర్వాత ఫ్లాట్‌ తలుపులు కూడా వేయకుండానే ఆయన 9వ అంతస్తు పైకి వెళ్లి అక్కణ్నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో రాత్రిపూట విధుల్లో ఉన్న వాచ్‌మెన్‌ అప్పారావు.. అపార్ట్‌మెంట్‌ చుట్టూ తిరిగి చూడగా భాస్కర రమణమూర్తి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు తెల్లవారుజామున 2 గంటలకు అక్కడికి చేరుకుని, వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

నిజాయతీపరుడుగా పేరు..
రమణమూర్తి ఆత్మహత్య వార్త తెలిసిన వెంటనే ఆయన మిత్రులు, సహోద్యోగులు, బ్యాచ్‌మేట్స్‌, పై అధికారులు ఆయన ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. రమణమూర్తి నిజాయతీపరుడైన అధికారి అని.. అందుకే ఇప్పటికీ రాజీవ్‌ స్వగృహలో ఉంటున్నారని వారు పేర్కొన్నారు. ఆయనకు వృత్తిపరమైన ఒత్తిళ్లు ఉన్నట్లు తమ దృష్టికి రాలేదని, అటువంటి అనుమానాలేవీ లేవని కుటుంబసభ్యులు తెలిపారు.

కాగా.. ఆయన మరణానికి ఉద్యోగంలో మానసిక ఒత్తిళ్లే కారణమనే చర్చ జరుగుతోంది. మరో ఏడాది సర్వీసే ఉన్న రమణమూర్తి కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో పాటు, ఉద్యోగ ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన ఇచ్చిన నివేదికలతో కొందరు అధికారులకు ఇబ్బంది కలగడం వల్ల ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు ఎదురైనట్లు వినికిడి. గత ప్రభుత్వంలో రైతుబజార్ల సీఈవోగా ఏడాదిన్నరపాటు పనిచేసిన ఆయన.. ఆ తర్వాత తిరిగి మాతృశాఖకే వచ్చినా, అప్రాధాన్య పోస్టులకే పరిమితమయ్యారు. సీనియారిటీకి తగ్గ పోస్టులు దక్కక చాలాకాలంగా లూప్‌లైన్‌ విభాగాలకే పరిమితమయ్యారు.

ప్రస్తుతం పీసీసీఎ్‌ఫగా ఉన్న అధికారి కన్నా రమణమూర్తి సీనియర్‌ అయినప్పటికీ.. ఆయన్ను కిందిస్థాయి పోస్టుకు పరిమితం చేశారు. అందుకు కూడా ఆయన సిద్ధమైనప్పటికీ.. క్రమంగా ఆయన వద్ద ఉన్న సిబ్బందిని తొలగించారు. దీన్ని ఆయన తీవ్ర అవమానంగా భావించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనేఆయన మూడు నెలలపాటు సెలవులో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

కీలకమైన సమావేశాలకు పిలవకుండా ఉండడం, ముఖ్యమైన ఫైళ్లపై ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు రాయడం వంటి పరిణామాలు ఆయన్ను మానసిక వేదనకు గురిచేశాయని సమాచారం. సెప్టెంబరు 30తో సెలవు ముగియడంతో గురువారం తిరిగి బాధ్యతలు చేపట్టాల్సిన ఆయన.. విధుల్లో చేరడం ఇష్టం లేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లుభావిస్తున్నారు.

చిన్న కూతురు పెళ్లి ప్రయత్నాలు..
చిన్న కుమార్తెకు పెళ్లి చేయాలని రమణమూర్తి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారం క్రితం ఓ పెళ్లి సంబంధం రాగా, చర్చలు జరుగుతున్నాయి. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోవడంతో కుటుంబీకులంతా హతాశులయ్యారు.

Courtesy Andhrajyothi