– సిజెఐ రంజన్‌ గొగోయ్‌
సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని కేంద్రానికి ఆదేశం
కాశ్మీర్‌ పర్యటనకు ఆజాద్‌కు అనుమతి

న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితు లను తెలుసుకునేందుకు అవసరమైతే తానే అక్కడకు వెళ్లి పరిశీలిస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోరు చెప్పారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ చిన్నారుల హక్కుల కార్యకర్త ఎనాక్షి గంగూలి దాఖలు చేసిన పిటిషన్‌ను గొగోరు నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. ఆగస్టు 5 తర్వాత కేంద్రం విధించిన ఆంక్షల వలన హైకోర్టును ఆశ్రయించేందుకు కూడా జమ్ముకాశ్మీర్‌లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కోర్టుకు తెలిపారు. దీంతోపాటు చిన్నారులు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన గొగోరు ‘న్యాయస్థానానికి కూడా ప్రజలు వెళ్లలేకపోతున్నారంటే అది చాలా తీవ్రమైన అంశం. అసలు ఆ పరిస్థితులు ఎందుకు ఉన్నాయి. దానికి ఎవరైనా అడ్డుపడుతున్నారా, ఈ అంశంపై నేను జమ్ముకాశ్మీర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుంటా. అవసరం అయితే అక్కడి పరిస్థితులు తెలుసుకునేందుకు నేనే అక్కడకు వెళ్తా. ఒకవేళ మీరు చెబుతున్న అంశాలు తప్పు అని తేలితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని’ పిటిషనర్లను హెచ్చరించారు.
సాధారణ పరిస్థితులు నెలకొల్పండి
అంతకుముందు మరో పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సాధ్యమైనంత త్వరలో జమ్ముకాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. దేశ భద్రత దృష్ట్యా ఇది చాలా ముఖ్యమని పేర్కొంది. విద్యాలయాలు పనిచేసేలా చూడాలని, ప్రజలందరికీ ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తాము విధించిన ఆంక్షల వలన ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదని కేంద్రం కోర్టుకు తెలిపింది. అనేక ప్రాంతాల్లో అంక్షలు సడలించామని, రాష్ట్రంలోని అన్నిచోట్లా మెడికల్‌ షాపులు, ప్రజాపంపిణీ వ్యవస్థ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని పేర్కొంది.
కాశ్మీర్‌ పర్యటనకు ఆజాద్‌కు అనుమతి
జమ్ముకాశ్మీర్‌లో పర్యటించేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. శ్రీనగర్‌, జమ్ము, బారాముల్లా, అనంతనాగ్‌ జిల్లాల్లో పర్యటించి, ఆయా ప్రాంతాల్లోని ప్రజలను కలుసుకొని వారి క్షేమ సమాచారాలు తెలుసుకోవచ్చని గొగోరు నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పర్యటన సందర్భంగా ఎటువంటి రాజకీయపరమైన ర్యాలీలు నిర్వహించరాదని షరతు విధించింది. గతంలో ఆజాద్‌ కాశ్మీర్‌లో పర్యటించేందుకు మూడుసార్లు ప్రయత్నించగా, ఆయన్ను ఎయిర్‌పోర్టుల్లోనే అడ్డుకొని వెనక్కు పంపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యటనకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆజాద్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Courtesy Prajashakth…