– సి. రామ్‌మనోహర్‌ రెడ్డి

భారతజాతి నిర్మాణంలో నాయకత్వం వహించిన మధ్య తరగతి, ఈ రోజు భిన్నత్వానికి స్థానమే లేని జాతీయతను కౌగిలించుకున్నది. ‘భారతీయతా భావన’ సాధించాలనే గొప్ప వాగ్ధానం చాలా కాలం నుండి చేయబడుతున్నా దాన్ని సాధించడంలో మనం చాలా వెనకబడి వున్నాం. స్వాతంత్య్రం సాధించుకున్నప్పుడు మన స్వప్నం ఏమిటంటే భాష, మతం, ఆచార వ్యవహారాలు భిన్నత్వం కలిగిన మన దేశంలో ప్రజలు, రాజ్యాంగ పరంగా ఉన్న హక్కులకు హామీ ఉండటంతో వాటిని అనుభవిస్తారని, ప్రజాతంత్ర పద్ధతులలో ఒక న్యాయమైన సమాజాన్ని నిర్మిస్తారని భావించాం. రాజ్యాంగం లోనే భిన్నత్వం అనే పదాన్ని పొందు పర్చి గౌరవించడం ఇందుకు నిదర్శనం. గడిచిన చరిత్రను గమనిస్తే మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఎన్ని వైఫల్యాలు ఉన్నాయో అన్ని విజయాలు కూడా ఉన్నాయి. గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే భారతీయతా భావనే ప్రమాదంలో పడి కుప్పకూలిపోయే పరిస్థితి నెలకొన్నది. అతి త్వరలో ‘నూతన భారత్‌’ను మనం చూడబోతున్నాం. అందులో భిన్నత్వం, సౌభ్రాతృత్వం, స్వయం ప్రతిపత్తి అనే పదాలకు స్థానమే ఉండదు. జమ్ము కాశ్మీర్‌లో రాజ్యాంగబద్దంగా చేసిన ఏర్పాట్లను హేయమైన పద్ధతిలో ఎందుకు సమూలంగా మార్చి వేశారో చూస్తే అది ‘భారతీయతా భావన’నే ఉల్లంఘిస్తున్న విషయం స్పష్టంగా అర్థం అవుతున్నది.

ఆందోళనకరమైన అడుగులు
రాజ్యాంగం అనే ‘పవిత్ర గ్రంథం’లో మార్పులకు అవలంభించిన పద్ధతి ఎంత ముఖ్యమో సవరణ భావం కూడా అంతే ప్రధానం. నరేంద్ర మోడీ ప్రభుత్వం జమ్ము కాశ్మీర్‌లో అమలులో వున్న ఆర్టికల్‌ 370ని ఉపసంహరించిన పద్ధతి రాజ్యాంగం మౌలిక స్వభావాన్నే దుర్వినియోగం చేసినట్లుగా ఉన్నదని అనేక మంది న్యాయవాదులు, రాజ్యాంగ నిపుణులు ఇప్పటికే ఎత్తి చూపారు. విజయం రుచి మరిగిన ప్రభుత్వం ఇక ముందు తన బుర్రకు తోచిన విధంగా తన లక్ష్యానికి అనుగుణంగా రాజ్యాంగంలో సవరణలు చేయడానికి మరింత దూకుడుతో పూనుకుంటుంది. ఇక మిగిలిన ఒకే ఒక అడ్డంకి న్యాయస్థానాలు. తను అవలంభించే పద్ధతుల ద్వారా వాటిలో కూడా ఆమోదం పొందగలనని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండవచ్చు.
జమ్ము కాశ్మీర్‌కు వున్న రాష్ట్ర హోదా ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఆ రాష్ట్ర ప్రజలు ఉదయం లేవగానే ‘మీరు ఈ రోజు నుండి ఒక రాష్ట్రం వారు కాదు’ అని చెప్పడం ఎంత అవమాన కరమో ఆలోచించండి. ఇక ఇప్పటి నుండి మీరు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారి పోయారని, ఇక మిమ్మల్ని ఢిల్లీ నుండి కేంద్ర ప్రభుత్వమే పాలిస్తుందని చెప్పడం ఎంత బాధాకరం? నిజంగా ముక్కలు, ముక్కలుగా చేయడం అంటే ఇదే.
1950 నుండి రాష్ట్రాలను విభజించడం, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం సర్వ సాధారణమే. అయితే విభజన ప్రక్రియలో ఏదో మేరకు సంప్రదింపులు ఉండేవి. ప్రస్తుతం జమ్ము కాశ్మీర్‌గా ఉన్న ఒక రాష్ట్రం ఎకాఎకిన అదృశ్యం అయిపోవడం లాంటి ఘటన ఇంతవరకు జరగలేదు. సమాఖ్య విధానం గల దేశంలో కేంద్ర ప్రభుత్వం 80 లక్షల మందిని మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా తెగ్గొట్టి వారు తమ అభిప్రాయాలను చెప్పకుండా నోరు నొక్కి శాసనపరమైన మార్పులను క్రూరమైన పద్ధతులలో తీసుకురావడం ఏంటి? ఇందిరా గాంధీ కాలం తరువాత నిస్సందేహంగా గత ఐదు సంవత్సరాలలోనే మొత్తం అధికారాలను కేంద్ర ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకుని చలామణి కావడం చూశాం. దీన్ని బట్టి రాబోయే రోజులలో ఎంత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అర్థం అవుతున్నది. జమ్ము కాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని డి.ఎం.కె తప్ప అన్ని ప్రాంతీయ పార్టీలు బలపర్చడం చూస్తే అవి భయపడి బలపరిచాయా లేక దూరదృష్టి లోపించి చేస్తున్నాయా అనేది గమనించాల్సిన విషయం.

ప్రత్యేక హక్కుల వెనక ఉన్న స్ఫూర్తి
వైవిధ్యం గల మన దేశంలో రాజ్యాంగం కొన్ని ప్రత్యేక హక్కులను కల్పించడం వెనక చట్టబద్ధమైన కారణాలు ఉన్నాయి. అవి దళితులకైనా, ఆదివాసీ లకైనా. అదేవిధంగా మణిపూర్‌, మిజోరాం, నాగాలాండ్‌, సిక్కిం వారికి ఆర్టికల్‌ 370 ఉండేది. దేశంలో అందరికీ ఒకే రకమైన చట్టాలు ఉంటేనే సమాజం ఐక్యంగా ఉండగలదు అనేది తప్పనిసరి కాదు. కొన్ని మార్పులు చేసుకోవచ్చు. వైవిధ్యం గల దేశంలో దీనికి భిన్నంగా ఉంటేనే మంచిది. నిర్దిష్టంగా కొన్ని తెగలకు, సమూహాలకు, ప్రాంతాలకు ప్రత్యేక చట్టాలు ఉంటేనే వైవిధ్యం గల దేశంలో తాము కూడా ఒక భాగం అనే భావన కలుగుతుంది. జమ్మూ కాశ్మీర్‌ను దేశంలో విలీనం చేసే సందర్భంలో నెలకొని వున్న సున్నితమైన పరిస్థితులలో వారికి కొన్ని ప్రత్యేక చట్టాలు అమలు చేస్తామనే హామీ ఇవ్వబడింది.
370 ఆర్టికల్‌ ద్వారా ఇచ్చిన స్వయం ప్రతిపత్తి వివాదాస్పదం కావడానికి రెండు కారణాలు ఉన్నాయి. భారత్‌, పాకిస్తాన్‌గా చీలిపోయిన తరువాత ఏర్పడ్డ రాష్ట్రంలో ఈ సౌకర్యాన్ని పొందడం కంటగింపుగా మారడం ఒక కారణం. భారతదేశంలో మెజారిటీ ముస్లీంలు ఉన్న ఏకైక రాష్ట్రంలో ఈ ప్రత్యేక చట్టం అమలు జరగడం రెండవ కారణం. ఈ రెండు ప్రత్యేక లక్షణాలను దృష్టిలో ఉంచుకొని ఆర్టికల్‌ 370ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు, జన సంఘం, భారతీయ జనతా పార్టీకి అన్నీ ఏకరూపంగా ఉండాలనేది మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది. అందుకే ఆర్టికల్‌ 370 రద్దు చేయాలనే డిమాండ్‌ వారికి మౌలికమైనది.
ఆర్టికల్‌ 370 ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉన్నది కాని దానికి ఎవ్వరూ ఏనాడూ కట్టుబడి లేరు. ఢిల్లీలో కాని, శ్రీనగర్‌లో కాని ఈ విషయం లో పాలక వర్గాలకు చెందిన వారెవ్వరూ పవిత్రులు కారు. 1950 నుండి ఒకరు పద్ధతి ప్రకారం స్వయం ప్రతిపత్తిని అనేక రాజ్యాంగ సవరణలతో డొల్లగా మారిస్తే మరొకరు ఈ అంశాన్ని అడ్డం పెట్టుకుని బేరసారాలాడి లబ్ధి పొందారు. ఆర్టికల్‌ 370 డొల్లగా మారినప్పటికీ ఒక ప్రతీకాత్మక చిహ్నంగా జమ్ము కాశ్మీర్‌కు ఒక ప్రత్యేక స్థానం కల్పించింది.
మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యల మంచి చెడులను పక్కన పెడితే ‘కాశ్మీర్‌ అంశం’ ఇంక ఎంతో కాలం కొనసాగడం సరైనది కాదనే వాదన విన్పిస్తున్నది. 2014 నుండి ప్రభుత్వం ఉక్కు పాదంతో అణచి వేస్తున్న కారణంగా పరిస్థితి సంవత్సరం సంవత్సరానికి దారుణంగా దిగజారి పోయింది. హింసాత్మక ఘటనలు పెరిగాయి. రక్షక దళాలు, సైనికుల మరణాలు పెరిగాయి. సాధారణ పౌరుల హత్యలు కూడా పెరిగాయి. జమ్ము కాశ్మీర్‌లో నిషేధాజ్ఞలను అంతిమంగా తొలగించిన తర్వాత…తమ భూభాగం ఆక్రమణకు గురైందని గ్రహించి అసహనంలో ఉన్న ప్రజలతో వ్యవహారం నడపాల్సి వున్నదన్న విషయాన్ని కేంద్రం గ్రహిస్తుంది. ఈ నేపథ్యంలో నెలల తరబడి హింసాత్మక ఘటనలు ఒక్కసారిగా పెరిగిపోయే అవకాశం ఉన్నది. దీనికి తోడు సరిహద్దు గుండా వచ్చే ఉగ్రవాదం పెరుగుతుందో లేదో గమనించాల్సి వుంది.

భిన్నత్వాన్ని కొట్టి పారేయడం
ఈ నిర్ణయాన్ని మధ్య తరగతి మరియు ఉన్నత వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఇదేమీ ఆశ్చర్యం కాదు. చాలా కాలం హింస కొనసాగడంతో వాళ్లలో మొదట విసుగు పెరిగింది. తరువాత వ్యతిరేకత ఏర్పడింది. కాశ్మీరీల పట్ల కఠినంగా వ్యవహరించి వారి స్థానం ఏంటో అర్థం చేయించాలనే భావనకు వారి మద్దతు ఏర్పడింది. కాశ్మీర్‌, దేశంలో కలవలేదని మాట్లాడుతుంటాం. నిజం చెప్పాలంటే కాశ్మీర్‌ను తనలో అంతర్భాగం అని మిగతా భారతదేశం ఎప్పుడూ భావించలేదు. కల్లోల కాశ్మీరం కంటే ముందు కాశ్మీర్‌ ప్రకృతి అందాలకు నిలయం. అక్కడికి సినీ తారలు వచ్చేవారు. సినిమాలు తీసేవారు. దానితో బాటు ఇది ఒక పర్యాటక ప్రదేశం. మనం ఏ రోజూ కాశ్మీరీలను మన తోటి పౌరులుగా గుర్తించలేదు. వారు కూడా మన లాగే కలలు కంటారని అనుకోలేదు. మనం వారిని కేవలం పాకిస్తాన్‌ ఆపేక్షిస్తున్న ప్రాంతంలో నివసిస్తున్న వారిగా మాత్రమే చూస్తున్నాం. మన దేశంతో వారికి ఉన్న అనుబంధాన్ని అనుమానా స్పదంగా చూస్తున్నాం. ఆ రాష్ట్రాన్ని సాయుధ ఘర్షణకు, ఉగ్రవాదానికి నిలయంగా మాత్రమే చూస్తున్నాం.
ఏ మధ్య తరగతి అయితే స్వాతంత్య్ర పోరాటానికి బీజాలు వేసిందో, ఆధునిక రాజ్యాంగాన్ని రూపొందించడానికి భావాలను సమకూర్చిందో, భారతీయతా భావన చుట్టూ జాతి నిర్మాణాన్ని ఏర్పాటు చేసిందో అదే మధ్య తరగతి ఈ రోజు దూకుడుతో ఉన్న జాతీయవాదాన్ని కౌగిలించుకున్నది. దానికి భిన్నత్వంతో పని లేదు. భిన్నత్వం అనే భావాన్ని కొట్టి పారేస్తున్నది. మనం ఒక్క క్షణం కూడా కాశ్మీర్‌ ప్రజల మనోభావాలు ఎలా ఉన్నయని ఆలోచించడానికి కూడా సిద్ధంగా లేము. గత 15 రోజులుగా వారు అనుభవిస్తున్న నిషేధాజ్ఞల గురించి మనం రవ్వంత కూడా ఆలోచించలేదు. మనం కాశ్మీర్‌లో భూమి కొనుక్కుందామని బహిరంగంగా మాట్లాడుకుంటు న్నాం. అందమైన కాశ్మీరీ యువతులను ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చనే వాదనను న్యాయవాదులు సైతం ఖండించకుండా మాట్లాడేస్తున్నారు. ఇన్ని చేస్తూనే మనం కాశ్మీరీ జన బాహుళ్యంలో పరివర్తన తీసుకురావాలని మాట్లాడుతున్నాం. రాజ్యాంగం రూపొందించిన కాలం నుండి మనం ఎంత దూరం ప్రయాణం చేశామో ఆలోచించండి.
గణతంత్ర భారతదేశ చరిత్రలో ‘భారతీయతా భావన’ పునాదులను కుదిపి వేసిన మూడు రోజులు ఉన్నాయి. మొదటిది 1975 జూన్‌ 25న దేశంలో అత్యవసర పరిస్థితి అమలు జరిపిన రోజు. ఆ రోజు మన ప్రాథమిక హక్కులు రద్దు చేయబడ్డాయి. ప్రజలు తమ ఓటు హక్కుతో ఆ స్థితిని అధిగమించారు. రెండవది 1992 డిసెంబరు 2న బాబ్రీ మసీదు కూల్చి వేసిన రోజు. అందుకుగాను మనం శిక్ష వేయకుండా, కుంటుకుంటూ సాగిపోయాం. ఇప్పుడు 2019 ఆగస్టు 5న రాజ్యాంగ స్ఫూర్తిని పక్కకు నెట్టి మన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా దేశం లోని ఒక ప్రాంత ప్రజల హక్కులను రద్దు చేశాం. ‘భారతీయతా భావన’పై జరిగిన దాడి నుండి ఆ ప్రాంతం కోలుకోవడం చాలా కష్టం.

 (వ్యాసకర్త ‘ది ఇండియా ఫోరం’ ఎడిటర్‌, హిందూ సౌజన్యంతో)

(Courtacy Prajashakti)