• బోర్డు పెట్టిన కరీంనగర్‌ విద్యుత్తు అధికారి..
  • పద్ధతి ప్రకారమే పని..
  • పై అధికారులు చెప్పినా నో

ఆదర్శంగా ఉండాలని.. ఆదర్శాలు పాటించాలని.. అందరికీ ఉంటుంది! కానీ, ఆచరణలో పెట్టేవారే అరుదు!! అలాంటి అరుదైనవారి కోవలోకి వస్తారీయన. తాను నమ్మిన ఆదర్శాన్ని 14 ఏళ్లుగా ‘అక్షరాలా’ ఆచరిస్తున్నారు అశోక్‌.

గణేశ్‌నగర్‌, (కరీంనగర్‌): పోడేటి అశోక్‌. విద్యుత్తు శాఖ అధికారి. కరీంనగర్‌ ఎన్‌పీడీసీఎల్‌ సర్కిల్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కార్యాలయంలో ఈయన కుర్చీ వెనకాల.. ఎర్రటి బోర్డు మీద తెల్లటి అక్షరాల్లో ‘నేను లంచం తీసుకోను’ అని తెలుగులో.. ‘అయామ్‌ అన్‌కరప్టెడ్‌’ అని ఆంగ్లంలో రాసి ఉంటుంది! భాషలు వేరైనా విషయం ఒక్కటే. ఆమ్యామ్యా అన్నమాటే ఆయనకు పడదు. ఏ పనైనా పద్ధతి ప్రకారమే చేస్తారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులో పస ఉంటే లంచం ఇవ్వాల్సిన పని లేకుండానే ఆయన దగ్గర పని పూర్తయిపోతుంది. అక్రమ మార్గంలో పై అధికారుల నుంచి ఒత్తిడి తెప్పించి పని చేయించుకుందామనుకున్నా ఒప్పుకోరు.

పై అధికారుల నుంచి లిఖిత పూర్వక ఉత్తర్వులు వస్తేనే చేస్తారు. సోమవారం ఈ విషయమై ‘ఆంధ్రజ్యోతి’ ఆయనతో మాట్లాడగా.. 2005లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా పనిచేసుకుంటున్నానని తెలిపారు. అసలు ఈ బోర్డు పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందని అడగ్గా.. ‘‘నా వద్దకు వచ్చే వారు పని అయిన తర్వాత డబ్బులిచ్చే ప్రయత్నం చేయ డం.. నేను వద్దు అని చెప్పడం ఇబ్బందికరంగా మారింది. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో బోర్డు ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ విషయంపై అధికారులతో చర్చించి, నెల క్రితం బోర్డు ఏర్పాటు చేశా. అప్పట్నుంచీ ఇబ్బందులు తగ్గాయి’’ అని వివరించారు. నిజాయితీగా పనిచేయడమే తన లక్ష్యమన్నారు. అశోక్‌ నిజాయతీ, ఆయన కుర్చీ వెనుక ఉన్న బోర్డు ఇప్పుడు సోషల్‌ మీడియాలో సంచలనం!!

Courtesy AndhraJyothy…