కుందన్ పాండే

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకి చెందిన వందనా ఖండాలే ఓ చెరకు కూలీ. సాధారణంగా జనవరి నెల సమయానికి చెరకు పంట కోత చివరి దశకి వస్తుంది కాబట్టి ఈ సమయంలో కూలీలెవరూ ఖాళీగా ఉండరు కానీ వందనా మాత్రం ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తోంది. తనని కదిలిస్తే “నేను విపరీతమైన కీళ్ల నొప్పులతో బాధపడుతున్నాను,ఎప్పుడూ నీరసంగానే ఉంటున్నాను. చిన్న విషయాలకే అసహనానికి గురవుతున్నాను. పొలాలూ,చేలలో పనులు చేసుకోవడం కష్టమౌతోంది” అని వాపోయారు.

30 ఏళ్ల వందన గత ఆరేళ్లలో కుటుంబ పోషణ కోసం తన వంతు బాధ్యతగా ఎలాంటి ఆదాయాన్ని సంపాదించలేకపోయింది. ఆమె భర్త మషూ ఖండాలే రోజు కూలీ,ఐదుగురు సభ్యులున్న వారి కుటుంబ పోషణ భారం మొత్తం ఆయనపైనే పడుతోంది.

ఆరేళ్ల క్రితం పొత్తి కడుపు కింది భాగంలో విపరీతమైన నొప్పి,రక్తస్రావం మొదలవ్వడంతో వ్యవసాయ క్షేత్రాల్లో పనులు చేసుకోవడం కష్టతరమైంది. రుతుక్రమం రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. తను పనికి హాజరుకాని రోజున కాంట్రాక్టర్ జీతం డబ్బుల్లో కోత విధించేవాడు. స్థానిక వైద్యులు కొన్ని మాత్రలు ఇచ్చినా అవి కేవలం కొంతకాలం మాత్రమే నొప్పిని తగ్గించగలిగాయి. నొప్పి తట్టుకోలేక చివరికి ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించింది. అక్కడ వైద్యుడు ఈ సమస్య అంతటికీ గర్భసంచే కారణమని అది తొలగించుకోవాలని సూచించాడు.

వందన కూడా ఈ సమస్యకు ఇదే పరిష్కారమని నిర్ణయానికి వచ్చి నాలుగు వేల రూపాయలు ఖర్చుపెట్టి గర్భసంచి తొలగించుకుంది. దేశంలో hysterectomy (గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్స) చేయించుకున్న వేలాది మంది మహిళల్లో వందన ఒకరు.

వీళ్లలో ఎవరికీ గర్భసంచి తొలగింపు అనే పద్ధతి డాక్టర్లు చాలా మేధోమధనం తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చేసే చికిత్స అనే విషయం తెలియదు. ఎందుకంటే hysterectomy(గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్స) బోలు ఎముకల వ్యాధి,బరువు పెరుగుదల, జీర్ణ సంబంధిత సమస్యలు, శక్తిని కోల్పోవడం లాంటి అనేక సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ శస్త్ర చికిత్సకి ప్రాచుర్యం పెరగడం ఆశ్చర్యపరిచే విషయం.

2018లో రిప్రొడక్టివ్ హెల్త్ వారి పరిశోధన వెల్లడించిన వివరాల ప్రకారం hysterectomy (గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్స) ని ఎంచుకునే మహిళల సంఖ్య కొన్ని రాష్ట్రాల్లో 1000 కి గాను 63 గా ఉంది. అన్నింటి కంటే దారుణమైన విషయం ఏంటంటే వీరిలో మూడవవంతు మహిళలు 40 ఏళ్ల లోపు వారే అంటే ఉత్పాదక వయస్సు కూడా దాటని వారు. ప్రపంచవ్యాప్తంగా hysterectomy (గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్స)లు 45 ఏళ్లు దాటిన మహిళలకే చేస్తారు.

రాజస్థాన్ కి చెందిన ప్రయాస అనే నాన్ ప్రాఫిట్ సంస్థ చెబుతున్న వివరాల ప్రకారం ఇండియాలో hysterectomy (గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్స) చేయించుకున్న మహిళల్లో 40 ఏళ్ల లోపు వారు అధికంగా ఆంధ్ర ప్రదేశ్ (42 శాతం),తెలంగాణా (47 శాతం) ఉన్నారు. డౌన్ టూ ఎర్త్ 40 ఏళ్ల లోపే ఈ శస్త్రచికిత్స చేయించుకున్న మహిళలతో మాట్లాడినప్పుడు శస్త్రచికిత్స తర్వాత వారి ఆరోగ్య సమస్యలు మరింత పెరిగాయని అన్నారు.

DTE బీడ్ జిల్లా కేంద్రానికి 55 కిలోమీటర్ల దూరంలోని దుకాడెగావోన్ గ్రామానికి వెళ్లగా అక్కడ సుమారు 200 ఇళ్లకి చెందిన 45 మంది మహిళలు గర్భసంచి లేకుండానే జీవిస్తున్నారనే విషయం బయటపడింది. వారిలో చాలామంది శస్త్రచికిత్స తర్వాత తమకి వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చి పనిలో నుంచి తీసివేయబడ్డామని చెప్పారు.

ఈ “స్త్రీ సంబంధిత సమస్యలకి శాశ్వత పరిష్కారం” ఎంత ప్రాచుర్యం పొందిందంటే సాక్షాత్తూ సర్పంచి భార్య కూడా ఈ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. బీడ్ జిల్లాలోని బంఝార్బాదీ,హజ్ పూర్,సోనిమొహా,కాసరి తో పాటూ సుమారు 10 గ్రామాలకి చెందిన 30% మహిళలు ఈ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. బీడ్ జిల్లా ఆస్పత్రిలో సివిల్ సర్జన్ గా పనిచేసే అశోక్ థోరాట్ గత మూడేళ్లలో 4,605 హిస్టరెక్టమీ(గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్స)లు జరిగాయని పేర్కొన్నారు.

DTE ఈ 50 మంది మహిళల ఆర్థిక,సామాజిక స్థితిగతులపై లోతుగా అధ్యయనం చేయగా మరో విషయం బయటపడింది. వీరెవరూ పాఠశాల విద్యని కూడా పూర్తి చేయలేదు. అసలు చదువుకోని మహిళలు 34 ఏళ్ల సగటు వయసులో శస్త్ర చికిత్స చేయించుకోగా 12 లేదా అంతకుమించి సంవత్సరాలు చదువుకున్న మహిళలు 38.4 ఏళ్ల సగటు వయసులో చేయించుకున్నారు. పేద,ధనిక కుటుంబాలకి చెందిన మహిళల మధ్య కూడా చాలా తేడాలు బయటపడ్డాయి. శస్త్రచికిత్స చేయించుకున్న పేద మహిళల సగటు వయస్సు,ధనిక మహిళల కంటే 2.4 సంవత్సరాలు తక్కువగా ఉంది.

ప్రయాస్ నివేదిక మెట్రిక్యులేషన్ వరకూ చదువుకున్న మహిళలు అసలు ప్రాథమిక విద్య కూడా పూర్తి చేయని మహిళలతో పోలిస్తే శస్త్ర చికిత్స చేయించుకునే సంభావ్యత 53 శాతం తక్కువ. ఒంటి నొప్పులు,రక్తస్రావం లాంటి ఆరోగ్య సమస్యలు మహిళల్ని ఈ శస్త్ర చికిత్సల వైపు ఉసిగొల్పుతున్నాయి. ధనిక కుటుంబాల మహిళలు కూడా ఇందుకు మినహాయింపు కాదు.

గర్భసంచిలో రుతుక్రమ రక్తం ఉత్పత్తి చేయబడుతుంది. గర్భంలో ఇంకా జన్మించని పిండాలకి ఆహారసరఫరా కూడా ఇక్కడే జరుగుతుంది. ఇది శరీరంలోని మిగతా అవయవాలు కూడా సరిగా పనిచేసే విధంగా వాటికి అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఐతే ఈ చర్యలన్నీ హిస్టరెక్టమీ(గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్స) జరగగానే నిలిచిపోతాయి. మహిళల్లో ఇక రుతుక్రమం జరగదు,వారు గర్భం దాల్చలేరు. ఈ శస్త్ర చికిత్సని సాధారణంగా సక్రమంగా లేని రక్తస్రావం,ఫైబ్రాయిడ్స్ కి చికిత్సగా నిర్వహిస్తారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యవసరమైతే తప్ప 35 ఏళ్ల లోపు మహిళలకి ఏ వైద్యుడూ హిస్టరెక్టమీ(గర్భ సంచి తొలగింపు శస్త్రచికిత్స) చేయరు.

DTE ఈ మహిళలతో జరిపిన సంభాషణలో చాలా సందర్భాల్లో వైద్యులే ఈ శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిందిగా సూచించినట్టు తెలిసింది. వైద్య నిబంధనలు అతిక్రమించి చదువు లేని మహిళల జీవితాలతో చెలగాటం ఆడారు. తమని వివిధ రకాలుగా వైద్యులు భయపెట్టారని ఈ మహిళలు చెప్పారు. గర్భం దాల్చి పిల్లల్ని కన్న తర్వాత సహజంగానే మహిళల గర్భాశయం పెద్దదిగా ఔతుంది. ఐతే గర్భాశయం ఇలా పెద్దగా ఉండడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని ఈ మహిళల్ని భయభ్రాంతులకు గురి చేసేవారు.

ప్రైవేట్,ప్రభుత్వ ఆసుపత్రులు అనే తేడా లేకుండా ప్రతీ చోటా నిర్థారణ పద్ధతులు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక్కోసారి వైద్యులు అవసరానికి మించి మందుల్ని వాడాల్సిందిగా సూచిస్తున్నారు. తెలంగాణాలోని జగిత్యాల జిల్లా తండ్రియల్ గ్రామానికి చెందిన 27 ఏళ్ల మెహరున్నీసాకి వైద్యుడు గర్భసంచితో పాటూ అండాశయం,ఫాలోపియన్ నాళాలు కూడా తొలగించారు. సరైన నిర్థారణ పద్ధతులు అవలంబించకుండా ఈ అవరోధాలను ఏ వైద్యుడూ తొలగించరు. అలా జరగడం చాలా అరుదు.

హిస్టరెక్టమీ చాలా కష్టమైన శస్త్ర చికిత్స. చాలా అనుభవం ఉన్న వైద్యులు,సరైన వైద్య పరికరాలు ఇందుకు అవసరం. వ్యవస్థ వైద్యులకి అండాశయాలు కూడా తొలగించే అనుమతినిస్తే అది మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా(PHFI) కి చెందిన సమీక్షా సింగ్ అన్నారు. మెహరున్నీసా విషయంలో ఇదే జరిగింది.

యూఎస్ లోని మాయో క్లినిక్ లో ఈమధ్యే పూర్తి చేయబడిన ఓ పరిశోధనలో అండాశయాలు ఉంచి కేవలం హిస్టరెక్టమీ(గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్స) చేసినా కూడా దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువని తేలింది. సైన్స్ రచయిత షానోన్ లాఫ్లిన్ తొమాసో పరిశోధనలో కూడా అండాశయాలు తొలగించుకోకుండా హిస్టరెక్టమీ చేయించుకునే మహిళలల్లో హై బిపి సమస్య 13 శాతం ఎక్కువైందని,స్థూలకాయం సమస్యేమో 18 శాతం అధికమయ్యే అవకాశాలున్నట్లు తేలింది.

అంతేకాక 35 ఏళ్ల లోపు హిస్టరెక్టమీ చేయించుకున్న వారికి హృదయ ధమని వ్యాధి వచ్చే అవకాశాలు 35 శాతం ఎక్కువని కూడా ఈ పరిశోధనలు తేల్చాయి.

శారీకంగానే కాక హిస్టరెక్టమీ మానసిక ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావం చూపిస్తుంది‌. ఈ శస్త్ర చికిత్స ద్వారా కలిగే రుతువిరతికీ, జ్ఞాపకశక్తి కోల్పోవడానికీ దగ్గర సంబంధం ఉంది. అమెరికన్ అకాడెమీ ఆఫ్ న్యూరాలజీలో పనిచేసే శాస్త్రవేత్తలు చిన్న వయసులో హిస్టరెక్టమీ చేయించుకున్న మహిళలకి త్వరగా వృద్ధాప్యం వస్తుందని తేల్చారు.

మెహరున్నీసా తాను కుటుంబానికి భారమయ్యానని భావిస్తోంది. చూపు కోల్పోవటం,కీళ్ల నొప్పులు,సెక్స్ కోరికలు తగ్గడం లాంటి ఎన్నో సమస్యలతో ఆమె సతమతమౌతోంది. అండాశయం తొలగింపు ఆమె శరీరానికి అత్యవసరమైన హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించింది. “మా ఉమ్మడి కుటుంబంలో,బంధువుల్లో ఈ శస్త్ర చికిత్స చేయించుకున్న ఆరుగురు మహిళల్ని చూసి నేనూ ఈ శస్త్ర చికిత్స కి ఒప్పుకున్నాను” అని ఆమె అన్నారు.

దేశం మొత్తంలోనే హిస్టరేక్టమీ రేటు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ (8.9%) మరియు తెలంగాణా (7.7%) గా ఉంది. 30 ఏళ్ల లోపే ఈ శస్త్రచికిత్స చేయించుకుంటున్న మహిళల శాతం 1.1 గా ఉందని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే తేల్చింది. ఈ సర్వేలో హిస్టరెక్టమీని ఈమధ్యే చేర్చారు.

2012 లో ప్రయాస్ కి చెందిన నరేంద్ర గుప్తా,హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్ నివేదిక మహిళల స్టెరిలైజేషన్(సంతానోత్పత్తి కలుగకుండా చేసే శస్త్రచికిత్స) కీ,హిస్టరెక్టమీలకీ మధ్య సంబంధాన్ని కనుగొనడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది.

ఈ పరిశోధనలో హిస్టరెక్టమీ చేయించుకున్న మహిళల్లో ట్యూబెక్టమీ (అండాశయం నుంచి గర్భాశయానికి పోవు నాళమును ఛేదించే కుటుంబ నియంత్రణ పద్ధతి) తర్వాత కడుపులో నొప్పి తీవ్రతరమై ప్రైవేటు వైద్యులని ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడగా,వారేమో హిస్టరెక్టమీ చేయించుకోవాల్సిందిగా సూచించారు. వీరు సుప్రీంకోర్టులో చేసిన విజ్ఞప్తి కారణంగానే కేంద్ర ప్రభుత్వానికి హిస్టరెక్టమీని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే లో మొదటిసారిగా జతచేసేలా ఆదేశాలివ్వడం జరిగింది.

ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలకీ,ఈ హిస్టరెక్టమీ శస్త్ర చికిత్సల మధ్యా ఓ సంబంధం ఉంది‌. 2007 లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో లబ్దిదారులకి 1.5 లక్షల వరకూ ఆరోగ్య సంరక్షణ రుసుము ఇవ్వబడింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్రీయ స్వస్థ్యా సురక్షా బీమా యోజన పథకం ఆంధ్రప్రదేశ్,బీహార్,రాజస్థాన్ తో పాటూ ఇంకొన్ని రాష్ట్రాల మహిళల్ని బలవంతంగా హిస్టరెక్టమీ చేయించుకునేందుకు ఉసిగొల్పి వివాదాస్పదమైంది.

2009-10 సంవత్సరంలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో పది లక్షలకి పైగా హిస్టరెక్టమీలు జరిగాయి. కానీ హిస్టరెక్టమీ విషయంలో ఆరోగ్యం బీమా పథకం కింద ప్రయోజనాలని పొందే విషయంలో ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయడంతో ఈ సంఖ్య చాలావరకూ పడిపోయింది. 2018 రీప్రొడక్టివ్ హెల్త్ విడుదల చేసిన పరిశోధనా పత్రంలో 2010-11 లో 6,189 హిస్టరెక్టమీ శస్త్ర చికిత్సలు జరగగా 2011-12 నాటికి ఆ సంఖ్య 4,943 కి పడిపోయింది.

ఇక్కడే ప్రైవేట్ బీమా కంపెనీలు రంగంలోకి దిగాయి. ఉదాహరణకి బీడ్ జిల్లాలోని 99 ప్రైవేట్ ఆసుపత్రులు 2016-17 నుంచి 2018-19 వరకూ 4,605 హిస్టరెక్టమీ శస్త్ర చికిత్సలు నిర్వహించాయని జిల్లా సివిల్ సర్జన్ ఆధ్వర్యంలోని కమిటీ తేల్చింది.

ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలకీ,హిస్టరెక్టమీ శస్త్ర చికిత్సలకీ ఓ సంబంధం ఉంది. తెలంగాణా,గుజరాత్,రాజస్థాన్,ఛత్తీస్ ఘడ్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆరోగ్య బీమా ప్రయోజనం ఆశించే చాలా మంది ముఖ్య కారణంగా హిస్టరెక్టమీలనే ప్రస్తావించినట్టు చాలా నివేదికల్లో మనకి కనిపిస్తుంది.

ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆఫ్ ఆబ్స్టట్రీషియన్ అండ్ గైనకాలజీ వద్ద నీలిమా సింగ్ పరిశోధనలో రహదారులకి దగ్గరగా ఉన్న,ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉన్న గ్రామాల మహిళలు ఎక్కువగా హిస్టరెక్టమీ చేయించుకుంటున్నారని తెలిపారు. “వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని మనం అనుకుంటున్నాం,కానీ కాదు. ఇదంతా వైద్యపరమైన అతి జోక్యానికి కారణమౌతోంది” అని ఆమె అన్నారు. నీలిమా సింగ్ తో సంభాషించిన మహిళలకి ఆరోగ్య బీమా లేదు,వారు కష్టపడి సంపాదించిన డబ్బులతో ఈ శస్త్ర చికిత్స చేయించుకున్నారు.

ఇండియాలో హిస్టరెక్టమీ శస్త్ర చికిత్సలకీ,సిజేరియన్ శస్త్ర చికిత్సలకీ మధ్య ఓ సారూప్యత ఉంది. 2017 మార్చిలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదికలో తెలంగాణాలో 2013-14 లో 33 శాతంగా ఉన్న సిజేరియన్ డెలివరీలు 2016-17 నాటికి 45 శాతానికి ఎగబాకాయని పేర్కొంది.

ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు (33 శాతం) తో పోలిస్తే ప్రైవేటు ఆసుపత్రుల్లో (67 శాతం) ఇవి ఎక్కువగా జరిగాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రమాణాల ప్రకారం ఇది 10-15 శాతంగా ఉండాలి. వైద్యరంగంలో అవినీతి అంతటా వ్యాపించినా ఈ గర్భాల అదృశ్యం మాత్రం బయటపడలేదు. ఇదంతా ఇప్పుడిప్పుడే వైద్యశాస్త్రంలో ఉన్న మూఢ విశ్వాసాలని సైన్స్ తప్పని నిరూపిస్తున్న ఈ కాలంలోనే జరగడం విశేషం.

వైద్యరంగంలో నీతి,నియమాలు అతిక్రమించబడినట్టైతే ఇందులో ఖచ్చితంగా జోక్యం అవసరం. అన్ని వయసుల మహిళల్లోనూ ఇలాంటి విషయాలపై అవగాహన పెంచాలి. పాఠశాల స్థాయిలోనే పిల్లలకి శుభ్రతని పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలియజేయాలి. ఇవి పాఠ్యాంశాల్లో కూడా చేర్చాలి.

గుప్తా మాట్లాడుతూ “శస్త్ర చికిత్సలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం పకడ్బందీగా లెక్కింపు చేపట్టాలని,హిస్టరెక్టమీ నిర్వహించడానికి ప్రత్యేకమైన నియమనిబంధనలు రూపొందించాలని” అన్నారు. నిబంధనలు అతిక్రమించినవారిపై చర్యలు తీసుకోవాలని కూడా అన్నారు.

ఇండియాలో పీపుల్త్ హెల్త్ మూమెంట్ నేషనల్ కో కన్వీనర్ అభయ్ శుక్లా మాట్లాడుతూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టాన్ని తీసుకొచ్చి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సా పద్ధతులు హేతుబద్ధంగా ఉండేలా మార్పులు తీసుకురావొచ్చని అభిప్రాయపడ్డారు. “ఈ నిబంధనలు పకడ్బందీగా అమలు పరచడం లేదు,అతిక్రమించిన వైద్యులపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు” అని సింగ్ అన్నారు.

బీడ్ జిల్లాలోని జాగర్ ప్రతిస్థాన్ అనే సామాజిక సంస్థ అధ్యక్షుడు మనీష్ తోకాలే మాట్లాడుతూ అధిక సంఖ్యలో హిస్టరెక్టమీ శస్త్ర చికిత్సలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వం పకడ్బందీగా లెక్కింపు జరపాలి అన్నారు.

“మహిళా సంఘాలు ఇలాంటి స్త్రీల పట్ల ద్వేషాన్ని వెల్లగక్కే చర్యలూ,శస్త్ర చికిత్సలపై పోరాడడానికి న్యాయవ్యవస్థ ని ఉపయోగించుకోవాలి” సుప్రీం కోర్టు న్యాయవాది రంజనా కుమారి అన్నారు. ప్రభుత్వం,వైద్య రంగం ఇప్పటికైనా మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది.