– హెచ్‌సీయూ, మను, ఓయూలో విద్యార్థుల ప్రదర్శన
– పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌
– జామియా విద్యార్థులపై కాల్పులకు ఖండన

హైదరాబాద్‌/ఓయూ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసన సెగ పెల్లుబికింది. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ), మౌలానా ఆజాద్‌ జాతీయఉర్దూ విశ్వవిద్యాలయం (మను), ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా తెచ్చిన పౌరసత్వం సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా జరిపిన కాల్పులను తీవ్రంగా ఖండించారు. జామియా వర్సిటీ విద్యార్థులకు అండగా నిలబడ్డారు.

హెచ్‌సీయూలో విద్యార్థి సంఘం అధ్యక్షులు అభిషేక్‌నందన్‌, ప్రధాన కార్యదర్శి గోపిస్వామి, ఉపాధ్యక్షులు శ్రీచరణ్‌ నేతృత్వంలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. పౌరసత్వం సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్దఎత్తున ఫ్లకార్డులు ప్రదర్శించారు. హెచ్‌సీయూ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ప్రదర్శన చేపట్టారు. మానవహారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇక ఆదివారం రాత్రి హెచ్‌సీయూలో స్కూడెంట్‌ ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఆదివారం నుంచే మనులో నిరసనలు
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (ఎంఏఎన్‌యూయూ)లోనూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే నిరసనలు జరిగాయి. అర్ధరాత్రి విశ్వవిద్యాలయం ప్రవేశద్వారం వద్ద విద్యార్థులు బైఠాయించి డప్పులు వాయిస్తూ ఆందోళన చేపట్టారు. విద్యార్థులు కాలేజీ నుంచి బయటకు రాకుండా మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన ఘటనకు నిరసనగా యూనివర్సిటీ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు.

ఆర్ట్స్‌ కాలేజీ వద్ద ఏఐఎస్‌ఎఫ్‌ ఆందోళన
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ -2019 బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం, కాల్పులు జరపడాన్ని ఓయూ విద్యార్థులు ఖండించారు.

సోమవారం ఏఐఎస్‌ఎఫ్‌ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్‌ కాలేజ్‌ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జాయింట్‌ సెక్రెటరీ హరీష్‌ ఆజాద్‌ మాట్లాడుతూ కేంద్రం మతం ఆధారంగా భారత పౌరసత్వం నిర్ణయిస్తోందని, ఆ వైఖరిని మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. మైనార్టీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లుల వల్ల దేశానికి సేవలందిస్తున్న ఆర్మీ, ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులు సైతం తమ పౌరసత్వం నిరూపించుకోవాల్సి వస్తుందని, అది దేశానికే సిగ్గుచేటని అన్నారు. భారత రాజ్యాంగం మరింత ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కమల దళం పాలనలో ప్రజాస్వామ్యం భిన్నత్వంలో ఏకత్వం నుంచి మూర్ఖత్వం వైపు పయనిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాబ్‌, ఎన్నార్సీ బిల్లులను దేశ ప్రజలంతా ఏకమై వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లెనిన్‌, ప్రసాద్‌, శ్వేత, భార్గవి, గణేష్‌, నవీన్‌, జాన్‌ తదితరులు పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు దాడి చేయడాన్ని పీడీఎస్‌యూ ఖండిస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షులు మామిడి కాయల పరశురాం అన్నారు. సోమవారం విద్యానగర్‌లోని చండ్ర పుల్లారెడ్డి భవన్‌లో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

Courtesy Nava telangana