హైదరాబాద్​: కోర్టు కేసుల్లో ఉన్న భూమిని పట్టా చేయాలని ఓ వ్యక్తి రెవెన్యూ ఆఫీసుకు పోయిండు. ఆఫీసర్లు అతడిపై కబ్జా కేసు పెట్టిన్రు. తర్వాత డీల్​ మాట్లాడిన్రు.. పట్టా చేస్తమన్నరు. కేసులు కొట్టేపిస్తమన్నరు. అందుకు రూ.34.5 లక్షలు లంచం అడిగిన్రు. రూ.16.5 లక్షలు తీసుకుంటూ షేక్​పేట ఆర్​ఐ నాగార్జునరెడ్డి, బంజారాహిల్స్​ ఎస్సై రవీందర్​ ఏసీబీ అధికారులకు రెడ్​హ్యాండెడ్​గా దొరికిపోయారు. డీల్​లో కీలకమైన తహసీల్దార్​ సుజాత ఇంట్లో రూ.30 లక్షలు, అరకిలో బంగారు నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ అరెస్ట్​ చేశారు. ఈ కేసు వివరాలను ఏసీబీ డీజీ పూర్ణచందర్​రావు శనివారం వెల్లడించారు.

40 కోట్ల భూమి..
మీరాలం మండికి చెందిన సయ్యద్​ అబ్దుల్​ ఖలీద్​ అనే వ్యక్తి తండ్రి బంజారాహిల్స్​ రోడ్​ నంబర్​14లో 4,865 చదరపు గజాల భూమిని 1969లో కొన్నాడు. ఇప్పటి మార్కెట్​ రేట్​ ప్రకారం ఆ భూమి విలువ దాదాపు రూ.40 కోట్లు. 1998లో అది ప్రభుత్వ స్థలమంటూ సివిల్​ కోర్టు తీర్పుచెప్పింది. హైకోర్టులోనూ దానిపై కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ భూమిని సర్వే చేసి ఆన్​లైన్​లో అప్​డేట్​ చేయాలని అబ్దుల్​ ఖలీద్​ షేక్​పేట్​ రెవెన్యూ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నాడు. కోర్టుల్లో కేసులున్నాయని చెప్పి తహసీల్దార్​ సుజాత సర్వేకి నిరాకరించింది. స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ బంజారాహిల్స్​ పోలీస్​స్టేషన్​లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిపై రెండు కేసులు నమోదు చేశారు.

34.5 లక్షలిస్తే…
పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైన తర్వాత ఖలీద్​తో ఎమ్మార్వో మాట్లాడింది. రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ కందల నాగార్జున రెడ్డిని కలవాలని సూచించింది. నాగార్జున రెడ్డి డీల్​ సెట్​ చేశాడు. ఆ స్థలాన్ని పట్టా చేయడానికి రూ.30 లక్షలు డిమాండ్​ చేశాడు. పెట్టిన కేసులు ఎత్తేయడానికి మరో రూ.4.5 లక్షలు లంచంగా ఎస్సైకి ఇవ్వాలన్నాడు. మొత్తంగా రూ.34.5 లక్షలకు నాగార్జున రెడ్డి డీల్​ కుదిర్చాడు. దీంతో ఖలీద్​ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. రూ.15 లక్షలు తీసుకుంటున్న నాగార్జున రెడ్డిని, రూ.లక్షన్నర తీసుకుంటున్న ఎస్సై రవీందర్​ను ఏసీబీ అధికారులు శనివారం మధ్యాహ్నం రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ఎమ్మార్వో సుజాత ఇంట్లో రూ.30 లక్షలు
కేసులో కీలక సూత్రధారి అయిన తహసీల్దార్​ సీహెచ్​ సుజాత ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్​ గాంధీనగర్​లోని ఆమె ఇంట్లో రూ.30 లక్షలతో పాటు అరకిలోకు పైగా బంగారు నగలు, ల్యాండ్​ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. షేక్​పేట మండల పరిస ర ప్రాంతాల్లోని భూవివాదాల్లో ఆర్​ఐ నాగార్జున రెడ్డితో కలిసి ఆమె అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. శనివారం పొద్దుపోయే వరకు సోదాలు చేసిన అధికారులు.. ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం అక్రమ ఆస్తుల విలువ కోట్లలో ఉండే చాన్స్ ఉందన్నారు.

Courtesy V6Velugu