•  గుంతలు పూడ్చకుండా ప్రాణాలతో చెలగాటం
  •  అధికారులపై డబీర్‌పురాలో బాధితుడి ఫిర్యాదు
హైదరాబాద్‌ సిటీ : తన కాలికి గాయం కావడానికి రోడ్డుపై ఉన్న గుంతలే కారణమని ఓ వ్యక్తి కేసు వేశాడు. గాయానికి జీహెచ్‌ఎంసీ అధికారులే బాధ్యత వహించాలని డబీర్‌పురా ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పంజాటన్‌ కాలనీకి చెందిన సయీద్‌ అజ్మత్‌హుస్సేన్‌ జాఫ్రి అక్టోబర్‌ 6న రాత్రి 7.30 గంటలకు తన బైక్‌పై నూర్‌ఖాన్‌ బజార్‌ నుంచి బాల్‌షెట్టి ఖేట్‌కు వెళ్తుండగా రోడ్డుపై ఉన్న గుంతలో బైక్‌ దిగబడింది. సయీద్‌ వాహనంపై నుంచి కిందపడ్డాడు. అతని కుడి కాలు చీలమండలంలోని ఎముక ఫ్రాక్చర్‌ అయింది. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తనకు ప్రమాదం జరిగిందని సయీద్‌ ఆరోపించాడు. రోడ్డుపై గుంతలను పూడ్చకుండా జీహెచ్‌ఎంసీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందన్నాడు. కేసు నమోదు చేసుకున్న డబీర్‌పురా పోలీసులు విచారణ ప్రారంభించారు. మహారాష్ట్రలోని ఠానేకు చెందిన నేహా షేక్‌ది వచ్చేనెలలోనే పెళ్లి. షాపింగ్‌ చేసి సోదరుడితో కలిసి బైక్‌ మీద తిరిగివస్తున్న ఆమెను రోడ్డు మీద ఓ రాకాసి గొయ్యి బలిగొంది. బైక్‌ వేగంగా గుంతలో పడడంతో వెనక కూర్చున్న ఆమె పట్టు కోల్పోయి కింద పడింది. ఆ వెనుకే వస్తున్న ఓ ట్రక్కు ఆమె పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
Courtesy Andhra Jyothy..