తెల్లవారుజాము వరకూ చుక్కేసి.. చిందులు
హైదరాబాద్‌ : న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌
నియంత్రణ లేక.. నిర్వాహకుల ఇష్టారాజ్యం.

జూబ్లీహిల్స్‌లో ప్రముఖులు నివాసం ఉండే ప్రాంతం. అక్కడి ఓ పబ్‌లో సందడి రాత్రి 7 గంటలకే ప్రారంభమవుతుంది. హోరెత్తించే సంగీతం కిలోమీటర్‌ వరకూ వినిపిస్తుంది. అర్ధరాత్రి 12 గంటల వరకే అనుమతి ఉన్నా.. రోజూ ఉదయం 3-4 గంటల వరకూ కుర్రకారు హంగామా చేస్తూనే ఉంటారు. గతంలో ఒకసారి ఇదే పబ్‌ వద్ద బౌన్సర్లు, యువకులకు గొడవ జరిగింది. ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ మరో వర్గం ఘర్షణకు దిగింది.

హైటెక్‌సిటీలోని ఖరీదైన హోటల్‌. దానిలోని పబ్‌లో వారాంతపు వేళ ఐటీ ఉద్యోగుల కోసం థీమ్‌ పార్టీలు ఏర్పాటు చేస్తుంటారు. ప్రధాన రహదారికి దూరంగా ఉండటంతో పోలీసుల తనిఖీలు ఉండవు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి పరిశీలించేందుకు వెళ్లినా..ఉన్నతస్థాయి పైరవీలతో చర్యలు లేకుండా బయటపడుతుంటారు. ఇక్కడ నుంచే మాదకద్రవ్యాల రవాణా జరుగుతున్నట్టు సమాచారం.

గ్రేటర్‌ పరిధిలోని పలు పబ్‌లు అక్రమాలకు కేంద్రంగా మారుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్నాయి. మూడేళ్ల క్రితం పంజాగుట్ట మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్య మరణించింది. పట్టపగలు ఓ పబ్‌లో పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని మద్యం తాగిన యువకులు ఈ ప్రమాదానికి కారకులయ్యారు. వీరిలో ఇద్దరు మైనర్లు కావటం చర్చనీయాంశంగా మారింది. ఆ ఘటన తరువాత పోలీసు, అబ్కారీ, జీహెచ్‌ఎంసీ అధికారులు ఆగమేఘాలమీద చర్యలకు దిగారు. ఓ పబ్‌ను సీజ్‌ చేసి చేతులు దులుపుకొన్నారు. ఇటీవల మరోసారి జీహెచ్‌ఎంసీ అధికారులు అగ్నిమాపక నివారణ చర్యలు సరిగా లేవంటూ ఆరు పబ్‌లు, 12 బార్‌ అండ్‌ రెస్టారెంట్లపై చర్యలు తీసుకున్నారు. ఏదైనా ఘటన జరిగినపుడు మాత్రుమే అధికారులు హడావుడి చేస్తున్నారు.

గుట్టుగా మత్తు పదార్ధాల రవాణా
డిసెంబరు వచ్చిందంటే మాదకద్రవ్యాల స్మగ్లర్లకు పండుగ వాతావరణమే. నూతన సంవత్సర వేడుకలకు ముందుగానే మత్తు పదార్థాల రవాణాకు సిద్ధమవుతుంటారు. దీనికి అనువుగా పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌, రిసార్ట్‌లను ఎంపిక చేసుకుంటారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన యువకులను ఏజెంట్లుగా మలచుకుని మత్తు పదార్థాలను నిర్దేశించిన ప్రదేశానికి చేరవేస్తుంటారు. ఇటువంటి అక్రమాలు కళ్లెదుట కనిపిస్తున్నా ఖాకీలు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారనే విమర్శలున్నాయి. పబ్‌ల్లో జరిగే చీకటి కార్యకలాపాలను చూసీచూడనట్టు వదిలేసేందుకు కొన్ని ఠాణాలకు నెలవారీ మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటువంటి ఆరోపణలపైనే గతంలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నిర్వాహకులు నిబంధనలు గాలికొదిలేశారు. అధిక శాతం పబ్‌ల్లో సీసీ కెమెరాలున్నా.. వాటి పనితీరు సరిగ్గా లేదని సమాచారం. మైనర్లకు అనుమతి లేదని బయటకు చెబుతున్నా.. పగటిపూట పార్టీల్లో 16 ఏళ్లలోపు విద్యార్థులే ఎక్కువగా  చేరుతున్నట్టు తెలుస్తోంది.

చిక్కితే తప్పించుకోలేరు.!
పార్టీలో మునిగి తేలేందుకు ప్రత్యేక సందర్భం అక్కర్లేదంటారు కుర్రాళ్లు. ప్రేమికులు కలసినా, విడిపోయినా, పుట్టిన రోజు, బ్యాచిలర్‌ పార్టీలంటూ ఆనందాన్ని.. విషాదాన్ని ఆస్వాదించేందుకు పబ్‌లను ఎంచుకుంటారు. నవంబరు, డిసెంబరు నెలల్లో పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌, రిసార్ట్స్‌, ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లు, ఫామ్‌హౌస్‌లు మందు పార్టీలతో కళకళలాడుతుంటాయి. అధికారుల తనిఖీలు కొరవడటంతో కొన్ని పబ్‌లు అసాంఘిక కార్యకలాపాలకు తెరతీస్తున్నాయి. యువతీ, యువకులను ఆకర్షించేందుకు మాదకద్రవ్యాలు, గంజాయి రుచి చూపుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో వారాంతపు సమయాల్లో ‘నైజీరియన్‌ పార్టీ’ పేరిట ఏర్పాటు చేసే కార్యక్రమానికి రెట్టింపు రుసుం వసూలు చేస్తారు. ఓన్లీ ఫర్‌ ఫ్రెండ్స్‌ అంటూ యువతీ, యువకులను మరింత జోష్‌లో నింపేందుకు ‘ఎల్‌ఎస్‌డీ’ అనే మత్తు పదార్ధం విక్రయిస్తున్నట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం పబ్‌లో పార్టీ జరుపుకుని బయల్దేరిన యువకుడు అతి వేగంగా కారు నడుపుతూ ఓ విద్యార్థిని మరణానికి కారకుడయ్యాడు. పబ్‌లకు వచ్చే ఒంటరి మగాళ్లకు వలపు వల విసురుతూ అందినంత దోచుకునేందుకు కొందరు ‘కిలేడీ’లు సిద్ధమవుతున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌ వద్ద యువకుడిని ముగ్గులోకి దింపి తన ప్లాట్‌కు తీసుకెళ్లిందో మాయలేడి. కొంత సమయం తరువాత అతడితో ఏకాంతంగా ఉన్న ఫొటోలను బయటపెడతానంటూ రూ.5 లక్షలు గుంజినట్టు సమాచారం. ఇటువంటి వెలుగు చూడని ఎన్నో ఆగడాలకు పబ్‌లు నిలయంగా మారుతున్నాయనే ఆరోపణలున్నాయి.

Courtesy Eenadu…