ప్రైవేటు వసతిగృహాల్లో భద్రత మృగ్యం! అపరిచిత వ్యక్తుల నమోదు ఉండదు
భద్రతా ప్రమాణాలు బేఖాతరు
రిజిస్టర్‌ కాని హాస్టళ్లు బోలెడు

ఊరు, పేరు తెలియదు.. లేడీస్‌ హాస్టళ్ల దగ్గర కాపు కాస్తారు.. భద్రత లేకపోవడంతో దర్జాగా లోపలికి వెళ్లి వేధింపులు షురూ చేస్తారు. ఎప్పుడొస్తారో తెలియదు.. చకచకా నచ్చిన, విలువైన వస్తువులను సర్దేస్తారు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోతారు. మద్యం తాగి లేడీస్‌ హాస్టళ్ల వద్ద భయానక వాతావరణం కలిగిస్తారు. ఇవేవీ ఆయా హాస్టళ్ల వద్ద జరుగుతున్నట్టు గుర్తించే సాక్ష్యాలు లభించవు. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలుండవు. ఉన్నా పని చేయవు. భద్రతా సిబ్బంది ఉండరు. ఉన్నా వచ్చేవారిపై నిఘా ఉండదు. రిజిస్టర్‌ నిర్వహించరు. హాస్టల్‌లోకి ప్రవేశించే వారి పేర్లు నమోదు చేసుకోరు. నిబంధనలను గాలికి వదిలేయడంతో మహిళల, యువతుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

నిబంధనలు ఇవే..: హాస్టల్‌లో ఉండే వ్యక్తి గుర్తింపుకార్డులు, సీసీ కెమెరాలు, కొత్త వ్యక్తుల వివరాల రిజిస్టర్‌, సెక్యూరిటీ సిబ్బంది, ప్రహరీ నిర్మాణం, ఫిర్యాదుల బాక్సు, సిబ్బందికి గుర్తింపు కార్డులు.. ఇవన్నీ పాటించాలని, ఠాణాల్లో నమోదు చేయాలని పోలీసులు ఆదేశిస్తున్నా కొన్ని హాస్టళ్ల నిర్వాహకులు మాత్రమే పాటిస్తున్నారు.

పోలీసులు హెచ్చరిస్తున్నా..
ప్రైవేటు హాస్టళ్లు.. భద్రత నిబంధనలను ఖాతరు చేయడం లేదు. రాత్రి 11.30 గంటలు ప్రేమపక్షులు హాస్టళ్ల ముందు కబుర్లు చెప్పుకొంటూ కనిపిస్తాయి. వచ్చిన వ్యక్తులెవరని హాస్టల్‌ పర్యవేక్షకులు అడగరు. దీంతో విచ్చలవిడితనం పెరిగిపోయింది. వరుస దొంగతనాలు, ఇతర నేరాలు జరుగుతున్నప్పటికీ ఏమాత్రం దృష్టిపెట్టడం లేదు. సీసీ కెమెరాలు, రిజిస్టర్ల ఏర్పాటు, హాస్టళ్ల పేర్లు పోలీస్‌స్టేషన్లలో నమోదు చేయాల్సిన అంశాలను  నిర్వాహకులు విస్మరిస్తున్నారు. భద్రత తప్పక పాటించాలని పోలీస్‌ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా కొన్నింటి నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు

పర్యవేక్షణ లేమి.. 
భద్రతలో నిక్కచ్చిగా లేకపోవడం, స్వీయ భద్రతపై సరైన అవగాహన లేకపోవడం, నిఘా నిర్లక్ష్యం.. వెరసి వెటర్నరీ వైద్యురాలు హత్య ఘటనకు కారణాలుగా తెలుస్తున్నాయి. ఉద్యోగినులు, విద్యార్థినులు ఎక్కువగా ఉండే ఎస్‌ఆర్‌నగర్‌, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లోని హాస్టళ్ల భద్రతలోని డొల్లతనం తాజా ఘటనతో భయాందోళన కలిగిస్తోంది. హాస్టళ్లకు దరిదాపుల్లోనే మద్యం దుకాణాలుండటం.. ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో కూడా తెలియకుండా, ఎలాంటి రక్షణ చర్యలు పాటించని హాస్టళ్ల యజమానుల నిర్వాకం, పర్యవేక్షణ లేమి.. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నిఘా లేమితో మరో శంషాబాద్‌ తరహా ఘటన పునరావృతమవుతుందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.

పారిశుద్ధ్యమూ ఉండదు..
హాస్టళ్లపై జీహెచ్‌ఎంసీ అధికారుల తనిఖీలు నిర్వహించగా నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుండా నిర్వహిస్తుండటం, శుభ్రత లేని ఆహారం, పారిశుద్ధ్య లోపం, సిల్ట్‌ ఛాంబర్ల నిర్మాణం లేకపోవడం వంటి అంశాలు వెలుగుచూశాయి. వ్యర్థాలను నాలాల్లో వేయడంతో మురుగునీరు రోడ్లపై పారడం, ట్రేడ్‌ లైసెన్స్‌ లేకపోవడంపై అధికారులు తాఖీదులు జారీ చేసి, వంటగదులను సీజ్‌ చేశారు.

(Courtesy Eenadu)