Image result for అక్రమాలకు దారులు వేశారు"ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా అక్రమంగా 365 గ్రిడ్‌ రోడ్లు, 265 భవనాల నిర్మాణం
వీటిలో అసాంఘిక, అనుచిత కార్యకలాపాలు
దిశ ఘటన తరువాత వెలుగు చూసిన చేదు నిజాలు

నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారు…హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) అనుమతులు లేకుండానే అడ్డగోలుగా రోడ్లు వేస్తున్నారు. ఆపై  వాటి వెంట భారీ భవనాలనూ కట్టేస్తున్నారు. అసాంఘిక శక్తులకు నిలయాలుగా మారుస్తున్నారు. ఈ విచ్చలవిడి పరిస్థితి రాజధానికి చుట్టూ బాహ్య వలయ రహదారి(ఓఆర్‌ఆర్‌) పరిధిలో వేళ్లూనుకుంది. దిశ హత్యాచార ఘటన తొండుపల్లి టోల్‌గేట్‌ సమీపంలో అక్రమంగా నిర్మించిన రోడ్డులోనే జరిగింది. ఈ నేపథ్యంలో గ్రోత్‌ కారిడార్‌ ఎండీ హరిచందన ఈ వ్యవహారంపై విచారణ చేయిస్తే అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

అనుమతులెవరిచ్చారో!
గచ్చిబౌలి నుంచి పటాన్‌చెరు వరకు ఓఆర్‌ఆర్‌కు ఎడాపెడా 365 అక్రమ గ్రిడ్‌ రోడ్లను అధికారులు గుర్తించారు. వీటి వెంబడి పూర్తిస్థాయి అనుమతులు లేకుండానే కొందరు స్థిరాస్తి వ్యాపారులు, ఇతరులు హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌ను తోసిరాజని 265 భవనాలను నిర్మించినట్లు తేలింది. వీటిలో గోదాములు, స్టాక్‌ పాయింట్లతో పాటు భారీ భవంతులూ ఉన్నాయి. శంషాబాద్‌, కండ్లకోయ, కొల్లూరు, పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లో కొన్ని భవనాలను వ్యభిచార కేంద్రాలుగా మార్చినట్లు తేలింది. రాత్రిపూట మరికొన్ని భవంతుల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా గుర్తించారు. అక్రమ గ్రిడ్‌ రోడ్ల వల్ల సర్వీస్‌ రోడ్డులో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నట్లూ నిర్ధారించారు. భవనాల యజమానులకు గ్రోత్‌కారిడార్‌ అధికారులు నోటీసులు ఇవ్వడంతోపాటు రోడ్లను తొలగించే పనిని ప్రారంభించారు. కొన్నిచోట్ల తొలగించిన రోడ్లను కొందరు పూడ్చివేస్తున్నట్లు తెలిసింది.
కఠిన చర్యలు తప్పవు
-హరిచందన, గ్రోత్‌కారిడార్‌ ఎండీ
ఇప్పటికే గుర్తించిన 365 గ్రిడ్‌ రోడ్లను తొలగించే పనిని ప్రారంభించాం. 265కు పైగా అక్రమ భవన యజమానులపైనా చర్యలకు వీలుగా ఇప్పటికే నోటీసులు అందజేశాం. ఈ అక్రమ భవనాలు, రోడ్ల వల్ల అనేక అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి అస్కారం ఏర్పడింది. దిశలాంటి మరో ఘటన ఇక్కడ జరగకుండా చర్యలన్నీ తీసుకుంటున్నాం.

(Courtesy Eenadu)