కరోనా (కోవిడ్‌ –19) చుట్టూ మెడికల్‌ మాఫియా
ఉన్నతస్థాయి సమీక్షలు సరే.. క్షేత్రస్థాయిలో సౌకర్యాలేవి?

కరోనా (కోవిడ్‌ -19) ప్రమాద తీవ్రతను అంచనా వేయడంలో సర్కారు వైఫల్యాన్ని కాసులుగా మార్చుకునేందుకు కార్పొరేట్‌ ఆస్పత్రులు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. జనవరి చివరివారంలో చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్‌ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు నివారణ చర్యలు తీసుకోవాలనీ, అత్యవసర పరిస్థితి ఎదురైతే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్ని దేశాలకు హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న బెడ్లు ప్రస్తుతం ఉన్న రోగులకే సరిపోకపోవడంతో ఒక్కో బెడ్డుపై ఇద్దరేసి చొప్పున సర్దుబాటు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారి కోసం ఐసోలేటెడ్‌ వార్డులను ఏర్పాటు చేసి అందులో ఉంచాల్సి ఉంటుంది. గాంధీలో 40 బెడ్లతో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసి నోడల్‌ కేంద్రంగా రాష్ట్ర సర్కార్‌ ప్రకటించింది. ఫీవర్‌ ఆస్పత్రి, చెస్ట్‌ ఆస్పత్రితో పాటు తాజాగా మిలిటరీ, వికారాబాద్‌ చెస్ట్‌ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.కరోనా పాజిటివ్‌ రావడంతో బాధితుడు గత పది రోజులుగా సన్నిహితంగా గడిపిన వారందరిని ఒంటరిగా ఉంచి పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ఒక్కసారిగా కరోనా కలకలంతో పరీక్షల కోసం వచ్చే వారిని చేర్చుకునేందుకు ప్రభుత్వాస్పత్రిలో బెడ్లు సరిపోకపోవడంతో డాక్టర్లు వారిని ఇంటి దగ్గర ఒంటరిగా ఉండాలని సలహా ఇచ్చి పలువురిని వెనక్కి పంపిస్తున్నట్టు తెలుస్తున్నది.

మరోవైపు సీజనల్‌ వ్యాధులకు చికిత్సల పేరుతో దండుకోవడానికి రుచిమరిగిన కార్పొరేట్‌ ఆస్పత్రులు ఒక్కొక్కటిగా కరోనాకు చికిత్స కోసం రంగం సిద్దం చేసుకుంటున్నాయి. ఇప్పటికే డెంగ్యూ చికిత్స పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన కార్పొరేట్‌ వైద్యం ప్రజల్లో మరింత భయాందోళనలు పెంచేందుకు రెడీ అయింది.డెంగ్యూ వ్యాధి నిర్ధారణ సమయంలో ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తగ్గిపోయిందనీ, ప్రాణాపాయస్థితి ఉందని చెప్పి పేదలను భయభ్రాంతులకు గురి చేసి దండుకున్నారు. డబ్బు లేకపోయినా పేదలు అప్పులపాలై చికిత్సలు చేయిం చుకున్న సంగతి విదితమే. కరోనా అనుమానితులకు చికిత్స విషయంలోనూ ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్ల సంఖ్య తక్కువగా ఉండడం, రోజు రోజుకు ఆ వ్యాధి అనుమానితుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. సిబ్బంది,బెడ్లు తక్కువగా ఉండడం అనుమానితులు పెరుగుతుండడంతో నమూనాల సేకరణ కూడా ఆలస్యమవుతున్నది. ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చిన ప్రజ్వల (మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడుతున్న హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛం ద సంస్థ ) వ్యవస్థాపకురాలు సునీత క్రిష్ణన్‌ అనుమానిత లక్షణాలతో గాంధీ ఆస్పత్రికి వచ్చిన సంగతి తెలిసిందే.

నమూనాల సేకరణ ఆలస్యం కావడంతో ఆమె సీఎంఓ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. అక్కడి అధికారులకు ఫిర్యాదు చేస్తే తప్ప నమూనాలను సేకరించే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గతానుభవాల నుంచి సర్కార్‌ పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. అత్యవసర నిధి కింద రూ.100 కోట్లు కేటాయించినప్పటికీ, పేద రోగుల డిమాండ్‌కు సరిపడినన్ని బెడ్లను ఏర్పాటు చేయలేదనే చెప్పాలి. బోధనాస్పత్రుల్లో ఉన్న పడకలుప్రస్తుతం వస్తున్న రోగులకే పూర్తిగా సరిపోవడం లేదు. దీంతో ఒక్కో బెడ్డుపై ఇద్దరేసి చొప్పున సర్దుబాటు చేసే పరిస్థితి. మరికొంత మంది వేచిచూసే పరిస్థితి. దీనికి తోడు ప్రస్తుతం కరోనా అనుమా నితుల కోసం బెడ్లు కావాలి. మాస్కుల ప్రయివేటు పంపిణీ దారులు తాత్కాలికంగా కొరత ఉన్నట్టు భ్రమింపజేస్తూ వాటి ధరలను అమాంతం పెంచేశారు. వీటికి తోడు ప్రయివేటు ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు వాటిని మరింత పెంచి అమ్మ కాలు సాగిస్తున్నాయి. ఒక్కో మాస్కుపై పదింతలు వసూలు చేస్తున్నట్టు ప్రయివేటు ఆస్పత్రుల్లో సిబ్బంది చెబుతున్నారు.

సామాజిక బాధ్యతలేని ప్రయివేటు సంస్థలు….
స్వలాభమే తప్ప సామాజిక బాధ్యత లేని ప్రయివేటు, ఆస్పత్రులు సంస్థలు కరోనా విషయంలోనూ అదే ధోరణి పాటిస్తున్నాయి. ఇటీవల ఇటలీ వెళ్లి వచ్చిన ఐటీ కంపెనీకి చెందిన ఉద్యోగి ఒకరికి కరోనా అనుమానిత లక్షణాలు బయ టపడ్డాయి. పరీక్షలు చేయగా ప్రాథమికంగా వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ కాగా, మరింత స్పష్టత కోసం పుణె ల్యాబరేటరీకి నమూనాలను పంపించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి పని చేస్తున్న డీఎంఎస్‌ కంపెనీతో పాటు మైండ్‌ స్పేస్‌ లో ఉన్న 21 భవనాల నుంచి 10 వేల మందిని ఇంటి వద్ద నుంచి పని చేయాలని ఐటీ కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. ఇటలీ నుంచి వచ్చిన తర్వాత సదరు ఉద్యోగి సహౌద్యో గులతో గడిపారు.ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురిలో ఆ లక్షణాలుండగా, అలాంటి వారిని వెనక్కి పంపిస్తే వ్యాధి మరింత ప్రబలే ప్రమాదముందని ఫోరం ఆఫ్‌ ఐటీ ప్రొపె ˜షనల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కిరణ్‌ చంద్ర అభిప్రాయ పడ్డారు.ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ప్రయివేటు ఐటీ కంపెనీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయనీ, వీటిని నియంత్రించాల్సిన అవసరముందన్నారు.

Courtesy Nava Telangana