సర్కారీ దవాఖానాల్లో మందుల కొరత
కొన్ని నెలలుగా సరఫరా నిలిపివేత
కొన్ని చోట్ల నొప్పుల గోలీలూ సున్నా
24 రకాల రోజువారీ మందులూ జీరో
10 రోజుల్లో అత్యవసర మందులు ఖాళీ
నిరుటి బడ్జెట్‌ కేటాయింపు 440 కోట్లు
ఈ ఏడాది రూ.142 కోట్లు మాత్రమే
అందులో విడుదల చేసింది 70 కోట్లే
వర్షాకాల వ్యాధులతో రోగుల తాకిడి
సరఫరా కాని యాంటీ బయాటిక్స్‌

 

ఈమె పేరు అమీనా బీ! డయేరియాతో రెండు రోజుల కిందట తాండూరు ప్రభుత్వాస్పత్రిలో చేరింది. గ్లూకోజ్‌లు ఎక్కిస్తున్నారు. కానీ, మందులు, ఇంజక్షన్లు లేవంటున్నారు. వాటిని బయటి నుంచే తెచ్చుకోవాలని చెబుతున్నారు. చేసేది లేక.. ఆస్పత్రిలో చేరినా బయటి నుంచే మందులు కొనుక్కోవాల్సిన పరిస్థితి.

 అసలే వర్షాకాలం! సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వైరల్‌ జ్వరం, డెంగీ, వాంతులు, విరేచనాలు తదితర రోగాలతో వేలాది మంది ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు! డాక్టర్లు పరీక్షించి గోలీలు రాస్తున్నారు. కానీ, అవి ప్రభుత్వాస్పత్రుల్లో ఉండడం లేదు. అనివార్యంగా బయటి నుంచి కొనుక్కోవాల్సి వస్తోంది. ఇవి మాత్రమే కాదు.. అత్యధికులకు అవసరమైన బీపీ, షుగర్‌ తదితర మందులూ లేవు. కనీసం తలనొప్పి గోలీ దొరుకుడు గగనమైపోయింది. ఇప్పుడు మాత్రమే కాదు.. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి. ఇందుకు కారణం.. సర్కారీ దవాఖానల్లో తీవ్రమైన మందుల కొరత! ఈ ఏడాది మందుల కొనుగోలు బడ్జెట్‌ చాలా తక్కువ. ఓటాన్‌ అకౌంట్‌ కావడంతో మందుల కొనుగోలుకు రూ.142 కోట్లు మాత్రమే కేటాయించారు. అందులో ఇప్పటిదాకా రూ.70 కోట్లే విడుదల చేశారు. దాంతో,
రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో తీవ్రమైన మందుల కొరత నెలకొంది.
ప్రస్తుతం ప్రధానమైనవి.. రోజూ ఎక్కువ మందికి ఇచ్చే మందుల్లో 24 రకాల వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో లేవని వైద్యులు చెబుతున్నారు. దాదాపు 60 రకాల అత్యవసర మందులు ఇంకో పది పదిహేను రోజులే వస్తాయంటున్నారు.కొన్ని ఎమర్జెన్సీ మందులను హెచ్‌వోడీ వద్ద ఉండే అత్యవసర నిధి నుంచి కొనుగోలు చేస్తున్నారు. నిజానికి పీహెచ్‌సీలకు 224 రకాలు, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులకు 382, జిల్లా ఆస్పత్రి, వైద్య విద్య కళాశాలలకు 700 రకాల మందులను అందుబాటులో ఉంచాలి. కానీ, ప్రాథమికంగా ఇవ్వాల్సిన మందులు కూడా సర్కారీ దవాఖానల్లో అందుబాటులో ఉండడం లేదు. కనీసం దగ్గు, జలుబు, జ్వరం, నొప్పులకు మాత్రలను కూడా రోగులకు ఇవ్వలేని పరిస్థితిలో ఆస్పత్రులున్నాయి. మందులు టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ నుంచే సరఫరా కావడం లేదని, నిధుల కొరతే అందుకు ప్రధాన కారణమని వైద్యులు అంటున్నారు.
ఉస్మానియా నుంచి పీహెచ్‌సీ వరకూ..
రోజూ వేల మంది రోగులు వచ్చే.. ఉస్మానియా ఆస్పత్రికి రెండు నెలలుగా సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి మందులు సరఫరా కాలేదని తెలుస్తోంది. దాదాపు 58 రకాల మందుల సరఫరా బంద్‌ అయినట్లు వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకూ అత్యవసర నిధి నుంచి మందులు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ నిధి కూడా నిండుకుంది. దాంతో, కాంట్రాక్టర్లు సరఫరా నిలిపివేశారు. దాదాపు అన్ని సర్కారీ దవాఖానల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. తాండూరు జిల్లా ఆస్పత్రిలో నొప్పుల గోలీలు కూడా దొరకడం లేదని రోగులు చెబుతున్నారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ ఆస్పత్రిలో కనీసం బీపీ, షుగర్‌ మాత్రలు కూడా లేవు. ఇక, జిల్లావ్యాప్తంగా ఏ సర్కారీ దవాఖానలోనూ టెలిమినట్రాన్‌ (బీపీ), గ్లిమిప్రైడ్‌ (మధుమేహం), ఐరన్‌ మాత్రలు లేవు.
వనపర్తి జిల్లాలో ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ టెలిమిసాట్రన్‌, డైక్లో 50 ఎంజీ మందుల సరఫరా లేదు. వరంగల్‌ జిల్లాలో పాము, కుక్కకాటు మందులు లేవు. రాష్ట్రంలోని కొన్ని ఆస్పత్రుల్లో పారాసిటమాల్‌, అక్లోఫినాక్‌, డైక్లోఫినాక్‌, సిఫ్రాఫ్లాక్సిన్‌ ఐ, ఇయర్‌ డ్రాప్స్‌, డాక్సిలిన్‌, జింక్‌ సల్ఫేట్‌ టాబ్లెట్లు, పారాసిటమాల్‌ సిరప్‌, విటమిన్‌ ఏ, ఐవీ ప్లూయిడ్స్‌, లివో సిట్రిజిన్‌, ఐరన్‌, సుక్రోజ్‌ ఇంజెక్షన్లు కూడా లేవు. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వైరల్‌ ఫీవర్‌తో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వీటికి ప్రధానంగా యాంటీ బయాటిక్స్‌నే వైద్యులు సిఫారసు చేస్తున్నారు. కానీ, సర్కారీ దవాఖానలకు కొద్ది రోజులుగా ఇవి సరఫరా కావడం లేదని తెలుస్తోంది. దాంతో వీటిని బయట కొనుక్కోవాల్సి వస్తోంది.

ఇప్పటి దాకా ఇచ్చింది రూ.70 కోట్లే
గత ఏడాది మందుల కొనుగోలుకు రూ.440 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. ఈ ఏడాది ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కావడంతో రూ.142 కోట్లే కేటాయించారు. అందులో టీఎ్‌సఎంఎ్‌సఐడీసీకి ఇప్పటివరకు రూ.70 కోట్లే విడుదలైనట్లు తెలుస్తోంది. గత ఏడాది కేటాయింపులతో పోలిస్తే ఇది 16శాతం మాత్రమే. మందుల కొరతకు ఇదే కారణమని వైద్యులు చెబుతున్నారు.

షుగర్‌ మందులు లేవంటున్నారు

నాకు షుగర్‌ వ్యాధి. కొద్ది రోజులపాటు ఖానాపూర్‌ సర్కారీ దవాఖానలోనే మందులు ఇచ్చారు. ఇప్పుడు అడిగితే పైనుంచి రావడం లేదని చెబుతున్నారు. దాంతో కొనుక్కొని వాడుతున్నాను.
గాండ్ల లక్ష్మి, తర్లపాడు, నిర్మల్‌ జిల్లా

నొప్పుల గోలీలు కూడా లేవు

ఆస్పత్రిలో నొప్పుల గోలీలు కూడా లేవంటున్నారు. బలం మందులు, అవసరమైన ఇంజక్షన్లు కూడా ఇవ్వడం లేదు.
నాగప్ప, తాండూరు

మందుల కొరత లేదు
ఎక్కడా మందుల కొరత లేదు. స్టోర్స్‌లో మందులు లేకపోతే జిల్లా ఆస్పత్రికి కేటాయించే 20 శాతం నిధుల నుంచి అత్యవసర మందులు కొనుగోలు చేసుకోవచ్చు.

– పర్యాద కృష్ణమూర్తి, టీఎస్ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌

 

(Courtacy Andhrajyothi)