ఆమె సొంత కారులో మృతదేహం
 నిందితుడిని  అరెస్టు చేసిన పోలీసులు

వాషింగ్టన్‌: అమెరికాలో స్థిరపడిన హైదరాబాద్‌కు చెందిన 19 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురయ్యారు. నిందితుడు అంతకుముందు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన షికాగోలో ఈ నెల 22న జరిగి ఉంటుందని అక్కడి పోలీసులు వెల్లడించారు. షికాగోలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఇలినాయిస్‌లో రూత్‌జార్జి ఆనర్స్‌ చదువుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఆమె కుటుంబం దాదాపు మూడు దశాబ్దాల క్రితం అమెరికాకు వెళ్లి స్థిరపడింది. రూత్‌జార్జి శుక్రవారం నుంచి కనిపించడం లేదని..ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీడియో ఫుటేజీలు సేకరించారు. రూత్‌జార్జి మృతదేహాన్ని యూనివర్సిటీ ప్రాంగణంలోని గ్యారేజీ సమీపంలో ఆమె సొంత వాహనంలో కనుగొన్నారు. డొనాల్డ్‌ తుర్మాన్‌ అనే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని గుర్తించారు. గ్యారేజీలోకి శుక్రవారం తెల్లవారుజామున 1.35 గంటలకు ఆమె వెళ్లడం వీడియో పుటేజీల్లో  కనిపించింది. డోనాల్డ్‌ తుర్మన్‌ ఆమెను అనుసరించాడు. నిందితుడు 2.10 గంటలకు అక్కడి వీధిలో నడుస్తూ మరోసారి వీడియోల్లో కనిపించాడు. ఎఫ్‌బీఐ సహాయంతో నిందితుడిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. నేరచరిత్ర గల తుర్మన్‌ ప్రస్తుతం పెరోల్‌పై జైలు నుంచి బయటకి వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు. రూత్‌జార్జి హత్యోదంతం యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

నిందితుడిని కఠినంగా శిక్షించాలి
కార్ఖానా, న్యూస్‌టుడే: ‘రూత్‌జార్జి హత్య దారుణం. బాధాకరం. నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఆమె తల్లిదండ్రులు నగరంలోని మాసబ్‌ట్యాంక్‌లో నివసించేవారు. ముగ్గురు సంతానంలో ఆమె చివరి బిడ్డ’ అని హైదరాబాద్‌ నగరంలోని ఆమె బంధువు రాజేంద్ర పాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Courtesy Eenadu..