ఈ. సంతోష్

గన్ను చేతిలో ఉంది కదా అని నిజానిజాలు తేలకుండానే కరుగట్టిన నేరస్తులుగా ముద్రవేసి చట్టాన్ని చేతిలోకి తీసుకొని, నలుగురు నిందితులను కావాలనే కాల్చిచంపి ఎన్ కౌంటర్ గా చిత్రించడం దగా. ఈ బూటకపు ఎన్ కౌంటర్ తో అమాయకులైన ప్రజలను మభ్యపెట్టి, దిశ హత్యలో నిర్లక్ష్యం వహించిన ప్రధమ ముద్దాయిలు పోలీసులే అని ప్రశ్నించిన నోర్లనుండే, జేజేలు కొట్టించుకుంటూ హీరోలుగా మారిపోయారు పోలీసులు.

ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పకుండా అడిగిన వారిమిదే బురదజల్లే విధంగా రేపిస్ట్ లకి సపోర్ట్ గా మాట్లాడుతున్నరనే నెపంమోపి పనికిమాలిన నిందలు వేసే అవకాశవాదులున్న సమాజంమిది. నేరం చేసినవారి పక్షాన మాట్లాడాలని ఎవరూ అనుకోరు. న్యాయవిచారణ జరపకుండా చేసిన ఈ హత్యలను ప్రశ్నిస్తున్నమే తప్ప నిందితులపక్షాన వాదించటం లేదనే విషయం గమనించాలి. న్యాయన్యాలను పరీక్షించకుండా, పోలీసులే చట్టాన్ని చేతులోకి తీసుకోని చంపేస్తుంటే ఇక న్యాయవాదులు, న్యాయస్థానాలు ఎందుకు?

అయేషాను అత్యాచారంచేసి, దారుణంగాహత్య చేసి పరారైన కేసులో అసలు నిందితులను వదిలేసి, దారినపోయే దానయ్యని పట్టుకొచ్చి, నిందితుడిగా చిత్రించి ‘’రాంబాబు’’ అనే నిరపరాదిపై చెయ్యని నేరాన్ని మోపి చిత్రహింసలు పెట్టిన ఈ పోలీస్ వ్యవస్థను నమ్మలేనిది. ఒక రాజకీయ నాయకుడికి అండగా నిలబడి వారి పక్షాన కొమ్ముగాసి పోలీస్ యంత్రాంగం మోసాన్ని పసిగట్టిన కోర్టు 10ఏళ్ళ తరవాత రాంబాబుని నిర్దోషి అని తేల్చింది. కానీ పోలీసులు ఇప్పటికీ ఆ రాజకీయ పలుకుబడి కలిగిన అసలు నేరస్తులను న్యాయస్థానం ముందు నిలబెట్టలేదు. ఏ అండదండలు లేని ఒక సామాన్యుడైన రాంబాబుని బలిపశువుని చేశారు. కోర్టు విచారణతో నిమిత్తం లేకుండా మరింత ఆవేశానికి పోయి అప్పుడే పోలీసులు రాంబాబుని ఎన్ కౌంటర్ చేసి ఉంటే  పోయిన ప్రాణాలను తిరిగి తెచ్చేవాళ్లా ?

‘’రాయ్‌పుర్‌: మావోయిస్టుల ఏరివేతలో భాగంగా 17 మందిని మట్టుబెట్టినట్లు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ఏడేళ్ల క్రితం చేసిన ప్రకటన బూటకమని తేలిపోయింది. 2012 జూన్‌ 28న బీజాపుర్‌ జిల్లాలోని సర్కేగుడ వద్ద కాల్పుల్లో చనిపోయిన వీరంతా సాధారణ గ్రామస్థులే అని జస్టిస్‌ విజయ్‌కుమార్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని ఏకసభ్య విచారణ కమిటీ తేల్చింది. ఏడేళ్లపాటు విచారించిన తర్వాత సుమారు 45 రోజుల క్రితం కమిటీ ఈ మేరకు నివేదిక సమర్పించినట్లు ఆదివారం వెల్లడయింది.

‘‘అవతలి వారే కాల్పులు జరిపారని చెప్పడం తప్పు. వారే కాల్పులు జరిపారని, వారంతా మావోయిస్టులేనని చెప్పే ఎలాంటి రుజువుల్ని భద్రత బలగాలు సమర్పించలేకపోయాయి. తుపాకులను, తూటాలను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పడం కూడా తప్పు’’ అని కమిటీ నివేదిక పేర్కొంది. ఘటనపై పోలీసు దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. గ్రామస్థుల పోరాటం ఎట్టకేలకు ఫలించిందని వారి తరఫు న్యాయవాది ఇషా ఖండేల్‌వాల్‌ చెప్పారు.

తాము జరిపిన ఎదురుకాల్పుల్లో 17 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు ప్రకటించడం 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి భాజపా ప్రభుత్వం దీనిపై ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. జస్టిస్‌ అగర్వాల్‌ పదవీ విరమణ పొందడానికి ముందు.. ఈ ఏడాది అక్టోబరు 17న నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. శనివారం రాత్రి పొద్దుపోయాక జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిని ఆమోదించి, సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. దీనిలోని కొన్ని భాగాలపై రాజకీయ దుమారం మొదలైంది.’’ – Ref  Eenadu

కులబలం ధనబలం రాజకీయ పలుకుబడి లేని  సిని నటి  ప్రత్యూష హత్య విషయంలోనూ ఇదే జరిగింది. మిర్యాలగూడలో దళిత ప్రేమికుడు ప్రణయ్ హత్య విషయంలో అన్నిరకాలుగా పలుకుబడి కలిగిన మారుతీరావుని చంపాలని ఎంతమంది ఎన్ని ప్రకటనలు ఇచ్చినా అలా చెయ్యకపోగా అందుకు భిన్నంగా అతన్ని బైలుపై బైటకు తెచ్చింది ఈ వ్యవస్థ. బయటికి వచ్చిన అతను కన్న కూతుర్ని నయానా భయనా లొంగదిసుకోవాలని చూసి మళ్లీ జైలు పాలుకావడం తెలిసిందే. అంతేకాదు వరంగల్లో నవమాసాల పసిగుడ్డు మరియూ మానస యాదవ్, ఆదిలాబాదులో టేకు లక్ష్మి, ఎస్సి, బిసి, బడుగువర్గాలకు చెందిన వాళ్లు కావడం వల్లేనే వాళ్ళపై జరిగిన అత్యచారాలని, హత్యలని అసలే పట్టించుకోకపోవాడాన్ని ఏమానుకోవాలి?

ఇలా దోషులను కాపాడుతున్న ఈ పోలీస్ వ్యవస్థ అసలు నేరస్తులను పట్టుకోవడం చేతకాకకాదు, రాజకీయం, డబ్బు, కులం ఇవేవి లేనివాళ్ళే ఎన్కౌంటర్లకి బలైతున్నారు తప్ప, బడాబాబులకు రక్షణా కవచాల్లాగా కాపలకాసే కాలహంతకుల కాటుకి బలికాకుండా భద్రం బిడ్డో మరో దిశ’.

తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. కాని, ఇలా నిర్ధాక్షిణ్యంగా చంపడం చట్టవిరుద్ధమనేదే నా విన్నపం.