• కార్పొరేట్‌ సంస్థల చేతికి మన ఆస్పత్రులు
 • మెజారిటీ వాటాల కొనుగోలు
 • భారీ పెట్టుబడులు.. రాబడులు
 • సీజీహెచ్‌ఎ్‌స, ఈసీహెచ్‌ఎ్‌స
 • సేవలు నిలిపివేస్తాం
 • ఇప్పటికే 1600 కోట్ల బకాయి
 • ఆయుష్మాన్‌తో పరిస్థితి ఘోరం
 • ప్రైవేటు ఆస్పత్రుల హెచ్చరిక
 • మెజారిటీ వాటాల కొనుగోలు
 • భారీ పెట్టుబడులు.. రాబడులు
 • సీజీహెచ్‌ఎ్‌స, ఈసీహెచ్‌ఎ్‌స
 • సేవలు నిలిపివేస్తాం
 • ఇప్పటికే 1600 కోట్ల బకాయి
 • ఆయుష్మాన్‌తో పరిస్థితి ఘోరం
 • ప్రైవేటు ఆస్పత్రుల హెచ్చరిక

హైదరాబాద్‌, బిజినెస్‌ డెస్క్‌: హైదరాబాద్‌.. ఆరోగ్య రాజధాని! వైద్య చికిత్సల కోసం విదేశీయులు మన ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు! ఇది మన ఆస్పత్రులు, డాక్టర్ల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది! విదేశీ కంపెనీలు ఇక్కడి ఆస్పత్రులను గుప్పిట పడుతున్నాయి! ఇది రాష్ట్రంలో వైద్య సేవలు భారంగా మారడానికి కారణమవుతోంది! మెజారిటీ కార్పొరేట్‌ ఆస్పత్రుల హెల్త్‌ బిజినెస్‌ విదేశీ కంపెనీల చెప్పుచేతల్లో చిక్కుకుంది. హైదరాబాద్‌లో పేరుమోసిన టాప్‌ టెన్‌ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అధిక వాటాను విదేశీ కంపెనీలే చేజిక్కుంచుకున్నాయి. ఇక్కడ పెట్టుబడి పెడితే, రెండేళ్లలోనే రాబడి మొదలవుతుందన్న కచ్చితమైన అంచనాయే ఇందుకు కారణం. దాంతో, అడిగిందే తడవుగా అడిగినంత పెట్టుబడి పెట్టి.. ఆపై వాటి పీకలపై కూర్చుకుంటున్నాయి. ఫలితంగా, ఆ భారం రోగులపై పడుతోంది. రోజురోజుకూ వైద్యం భారమవుతోంది.

వాటాల సుడిగుండం
కాంటినెంటల్‌, కేర్‌, ప్రైమ్‌, గ్లోబల్‌.. ఈ ఆస్పత్రుల పేర్లు వినగానే, వాటి వ్యవస్థాపకులు గుర్తొచ్చి అవన్నీ మనవే అనిపిస్తుంది! కానీ.. ఆ ఆస్పత్రులేవీ ఇప్పుడు పూర్తిగా భారతీయులవి కావు. వీటన్నింటిలో విదేశీ కంపెనీల పెట్టుబడులున్నాయి. ఏయే ఆస్పత్రుల్లో ఏయే విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి? వాటి పరిస్థితి ఏంటో పరిశీలిస్తే..

కాంటినెంటల్‌: మలేసియాకు చెందిన ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ బెర్హద్‌ సంస్థ 2015లో దాదాపు రూ.281 కోట్లకు కాంటినెంటల్‌ ఆస్పత్రుల్లో 51 శాతం వాటా కొనుగోలు చేసింది. ఆ తర్వాత దాన్ని 62 శాతానికి పెంచుకుంది. కొత్త యాజమాన్యం అనుసరించిన విధానాలతో ఆస్పత్రి వ్యవస్థాపకుడు గురునాథ్‌రెడ్డికి.. ఐహెచ్‌హెచ్‌కు మధ్య వివాదాలు తలెత్తాయి. ఆ కంపెనీ నుంచి వాటా వెనక్కి తీసుకుని దాన్ని ఇతర పెట్టుబడి దారుల చేతిలో పెట్టడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.

గ్లోబల్‌: గ్లోబల్‌ ఆస్పత్రిలోనూ ఐహెచ్‌హెచ్‌ దాదాపు రూ.1,300 కోట్లకు 74 శాతం వాటాను సొంతం చేసుకుంది. గ్లోబల్‌ ఆస్పత్రుల వ్యవస్థాపకుడు డాక్టర్‌ కె.రవీంద్రనాథ్‌. ఇక్కడ కూడా ఇరు పక్షాల మధ్య ఆశాజనక వాతావరణం లేదంటున్నారు.

కేర్‌: దుబాయ్‌కి చెందిన అబ్రాజ్‌ గ్రోత్‌ మార్కెట్స్‌ హెల్త్‌కేర్‌ ఫండ్‌ 2016లో కేర్‌ ఆస్పత్రిలో 72 శాతం వాటాను రూ.2,000 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా, అబ్రాజ్‌ నిర్వహణ బాధ్యతను ఇటీవల అమెరికాకు చెందిన కంపెనీ తీసుకుని దాని పేరును ఎవర్‌ కేర్‌ హెల్త్‌గా మార్చింది. కేర్‌ వ్యవస్థాపకుడు బి.సోమరాజు ఇటీవల ఆస్పత్రిని వీడిన విషయం తెలిసిందే. చికిత్సలపై ఆయన ఇస్తున్న రాయితీలు యాజమాన్యానికి ఇష్టం ఉండడం లేదని, ఆయన బయటకు వెళ్లడానికే మొగ్గు చూపిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

మాక్స్‌క్యూర్‌: డాక్టర్‌ అనిల్‌ కృష్ణ 2011లో స్థాపించిన మ్యాక్స్‌ క్యూర్‌ ఆస్పత్రుల నిర్వహణ ఇటీవలే స్వీడన్‌కు చెందిన మెడి కవర్‌ చేతుల్లోకి వెళ్లింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల్లోని మ్యాక్స్‌ క్యూర్‌ ఆస్పత్రులను ఈ బ్రాండ్‌తోనే నిర్వహిస్తున్నారు.

న్యూ లైఫ్‌: న్యూ లైఫ్‌ ఆస్పత్రిని యూఏఈకి చెందిన తుంబే గ్రూప్‌ 2017లో కొనుగోలు చేసింది.

ప్రైమ్‌: ప్రైమ్‌ ఆస్పత్రుల్లో మెజారిటీ వాటాను 2014లో గల్ఫ్‌లో సేవలందిస్తున్న ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ సొంతం చేసుకుంది.

గత్యంతరం లేకనే..
ఇతర సంస్థలతో పోలిస్తే ఆస్పత్రుల నిర్వహణ చాలా సంక్ష్లిష్టంగా మారిందని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి సీఈవో వ్యాఖ్యానించారు. అందుకే, విదేశీ పెట్టుబడులు తప్పడం లేదని తెలిపారు. ‘‘రుణాలపై వడ్డీలు చెల్లించాలి. నిర్వహణ, వేతనాలు, టెక్నాలజీ, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టాలి. ఒకప్పుడు ఒక పడకపై వ్యయం రూ.15 లక్షలు ఉంటే.. ఇప్పుడు రూ.70 లక్షల నుంచి రూ.కోటి అవుతోంది. టెక్నాలజీని తీసుకురాకపోతే రోగులను ఆకర్షించలేం. వీటన్నింటికీ నిధులు సమకూర్చడం ఒక్కరి వల్ల సాధ్యం కాదు. దీంతో, వాటా కోసం ప్రైవేట్‌ ఈక్విటీ కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. పెట్టుబడులు పెట్టిన వారు ప్రతిఫలాన్ని ఆశిస్తారు. దాంతో, వైద్యం భారమవుతోంది. వైద్య సేవలు ప్రియమవుతున్నాయి’’ అని వివరించారు.

వైద్యుడిగా సక్సెస్‌.. వ్యాపారిగా ఫెయిల్‌
విదేశీ కంపెనీల రాకతో వైద్యం పూర్తిస్థాయి వ్యాపారంగా మారింది. దాంతో, వైద్యులుగా రాణించిన వారు నిర్వహణలో విఫలమవుతున్నారు. కొన్ని సందర్భాల్లో పెట్టుబడిదారులకు, వ్యవస్థాపకులకు మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. ‘‘నేను డాక్టర్‌గా విజయం సాధించాను. వ్యాపారవేత్తగా విఫలమయ్యాను. దిగిన తర్వాత వ్యాపారం లోతు తెలిసింది’’ అని ఓ ప్రముఖ ఆస్పత్రి వ్యవస్థాపకుడు వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. నిజానికి, ఆస్పత్రిపై పెట్టే పెట్టుబడి ప్రతిఫలం ఇవ్వాలంటే దీర్ఘకాలం వేచి ఉండాలి. దాంతో, నిర్వహణకు మూలధనాన్ని సమకూర్చుకోలేక.. రుణాలపై వడ్డీలు చెల్లించలేక ఆస్పత్రులను స్థాపించిన వైద్యులు ఒత్తిడికి గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే నిధులు బాగా ఉండే విదేశీ ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్‌లు, ఆరోగ్య సంరక్షణ కంపెనీలు వాటిలో పెట్టుబడులు పెడుతున్నాయి. మెజారిటీ వాటాను సొంతం చేసుకుంటున్నాయి. అందుకే, అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లోని కొన్ని ప్రధాన ఆస్పత్రులన్నీ ఇప్పుడు విదేశీ ఇన్వెస్టర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి.