హైదరాబాద్ లో ఒకేరోజు 50 కొవిడ్‌ అంత్యక్రియలు
ఈఎ్‌సఐ శ్మశాన వాటికలోనే 38 మందికి
మరో 3 శ్మశానవాటికల్లో ఎనిమిది మందికి
కబరస్థాన్‌లలో నలుగురు ముస్లింలకు
23న ఆంధ్రజ్యోతి క్షేత్ర పరిశీలనలో వెల్లడి
సర్కారు విడుదల చేసిన బులెటిన్‌లో మృతుల సంఖ్య ఏరోజూ పది దాటలేదు
ఎక్కువ శవాలు ఈఎ్‌సఐ శ్మశాన వాటికకే
గంటకు మూడు నాలుగు అంబులెన్సుల రాక
లెక్క చెప్పేందుకు జంకుతున్న సిబ్బంది
అనుమానాలు తీరిస్తేనే ప్రజలకు ఊరట

అవి కరోనా మృతదేహాలే..
అంబులెన్సుల్లో వస్తున్న మృతదేహాలను కొవిడ్‌ నిబంధనల ప్రకారం ప్యాకింగ్‌ చేయడం, సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి ఉండటం, కుటుంబ సభ్యులు విడిగా వేరే వాహనాల్లో రావడం… ఇవన్నీ కరోనా మృతదేహాలనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. మృతదేహాల్ని దించుతున్న సమయంలో కుటుంబ సభ్యుల్ని దగ్గరకు రానివ్వటం లేదు. దూరం నుంచే ముఖం చూపిస్తున్నారు.

మా ఉద్యోగాలు పోతాయ్‌!
ఎక్కడ నుంచి మృతదేహాలను తీసుకొస్తున్నారని మూడు అంబులెన్సుల సిబ్బందిని అడగ్గా.. తాము ఎలాంటి సమాచారం ఇవ్వలేమని చెప్పారు. ‘‘మా సారుకు తెలిస్తే మా ఉద్యోగాలు పోతాయి. మమ్మల్ని వదిలేయండి’’ అని విజ్ఞప్తి చేశారు. ‘‘ఓ ఏజెన్సీ ద్వారా సమాచారం వస్తుంది. మా బాధ్యత మృతదేహాల్ని తీసుకెళ్లి శ్మశాన వాటికల్లో అప్పజెప్పటమే. అంతకు మించిన వివరాల్ని అడగొద్దు’’ అని అంబులెన్స్‌ యజమానులు కోరారు.

పగలూ.. రాత్రి..
శ్మశాన వాటిక లోపలకు వెళ్లే ప్రతి అంబులెన్సును, వచ్చిన సమయాన్ని ఆంధ్రజ్యోతి బృందం రికార్డు చేసింది. మధ్యాహ్నం రెండు గంటల లోపు పది కరోనా మృతదేహాలు వచ్చాయి. సాయంత్రం 2-5 మధ్య మరో పది, రాత్రి 9.30 గంటల్లోపు మరో 18 మృతదేహాలు వచ్చాయి. సాయంత్రం 6-7 గంటల మఽధ్యే ఎక్కువ మృతదేహాలు వచ్చాయి. చివరి మృతదేహం రాత్రి 9.14 గంటల సమయంలో వచ్చింది.

కట్టెల లోడ్‌ చెప్పే నిజం
మృతదేహాల దహన సంస్కారాలకు పెద్ద ఎత్తున కట్టెల్ని వినియోగించాల్సిన అవసరం ఉంది. ఒక అంచనా ప్రకారం ఒక్కో దహనానికి కనీసం 400 కేజీల కట్టెలు అవసరం. ఈఎ్‌సఐ శ్మశాన వాటికకు రోజూ 20 టన్నుల కట్టెల లారీ లోడు వస్తోంది. పది రోజుల్లో ఒకటి రెండు రోజులు మాత్రమే లారీ రావడం లేదు. ఈ లెక్కన రోజుకు 30 నుంచి 40 మృతదేహాలకు దహన సంస్కారాలు జరుగుతున్నట్లు అంచనా.

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా మరణాలు ఎన్ని అనేది బ్రహ్మ పదార్థంగా మారింది. రోజూ వందల్లో కేసులు బయటపడుతుంటే ప్రభుత్వ బులెటిన్లో మరణాలు మాత్రం రోజుకు పదిలోపే కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం స్థానికంగా చెప్పే లెక్కలకు రాష్ట్ర స్థాయిలో ఆరోగ్య శాఖ చెప్పే లెక్కలకు పొంతన ఉండటం లేదు. దీనికి తోడు కరోనాతో రాష్ట్రంలో రోజూ పెద్ద సంఖ్యలో జనం చనిపోతున్నారని, ప్రభుత్వం లెక్కలను బయట పెట్టడం లేదని సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దానికి మద్దతుగా జనం పెడుతున్న వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ప్రతిపక్షాలూ అదే వాదన వినిపి స్తున్నాయి. మరణాలు దాచేస్తే దాగుతాయా? మేమెందుకు దాస్తామంటూ ప్రభుత్వం దీటుగా తిప్పికొట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. కొవిడ్‌ మరణాలపై గోప్యత, దాని చుట్టూ చెలరేగిన రాజకీయ దుమారం రాష్ట్ర ప్రజల్లో భయాన్ని మరింత పెంచుతోంది.

ఈ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకొని, వాస్తవాలను వెలుగులోకి తేవాలని చిత్తశుద్ధితో ఒక ప్రయత్నం చేసింది. జిల్లాలను పక్కన బెట్టి ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే కరోనా వైరస్‌ మరణాలు ఎన్ని ఉండవచ్చో తెలుసుకొనేందుకు స్వతంత్రంగా అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా, హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న ఈఎ్‌సఐ శ్మశాన వాటికతో పాటు కరోనా వైరస్‌ మృతుల అంతిమ సంస్కారానికి అనుమతించే ఇతర శ్మశాన వాటికల వద్ద ఆంధ్రజ్యోతి బృందం జూలై 23న గురువారం నాడు రోజంతా పరిశీలన చేసింది. అదే సమయంలో జీహెచ్‌ఎంసీలో పలువురు అధికారులను ఆరా తీసింది. అన్నింటినీ క్రోడీకరించగా, గురువారం రోజు నగరంలో యాభై కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయని తేలింది. ఆ రోజు ఒక్క ఈఎ్‌సఐ శ్మశాన వాటికలోనే 38 శవాలకు కరోనా నిబంధనల ప్రకారం అంత్యక్రియలు చేశారు. మహాప్రస్థానం సహా మరో ఐదు శ్మశాన వాటికల్లో 12 శవాలకు అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వం మాత్రం జిల్లాలు కూడా కలుపుకొని మొత్తం 9 మందే మరణించారని లెక్క చెబుతోంది. బుధ, గురు, శుక్రవారాల్లో ప్రభుత్వం వెలువరించిన కొవిడ్‌ బులెటిన్‌లలో రాష్ట్రవ్యాప్త మరణాలు 9, 9, 8 చొప్పున కనిపిస్తున్నాయి. అంటే, బులెటిన్లతో పోలిస్తే దాదాపు ఐదు రెట్ల మరణాలు(50) ఒక్క రాజధాని నగరంలోని శ్మశాన వాటికల్లో నమోదయ్యాయి. జిల్లాల్లో మరణాలను కూడా లెక్కలోకి తీసుకుంటే సంఖ్య ఇంకా పెరుగుతుంది.

గురువారం మండిన చితులకు, ప్రభుత్వం చెప్పిన మరణాలకు మధ్య అంత తేడా ఎందుకు ఉంది? కరోనా లక్షణాలతో మృతి చెందిన వారి మరణాలను సమగ్రంగా లెక్కించడం లేదా? లేక రోగి మరణం తర్వాత ఫలితాలు పాజిటివ్‌ వచ్చినా మృతుల రోజువారీ జాబితాను అప్‌డేట్‌ చేయడం లేదా? ఆసుపత్రులు కొవిడ్‌ శవాలను కరోనా లెక్కల్లో చేర్చకుండా వేరే కారణాలు చూపించి, కొవిడ్‌ జాగ్రత్తలతో బంధువులకు అప్పగించేస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అవి కొవిడ్‌ మృతదేహాలే!
హైదరాబాద్‌ మహానగరంలో కరోనా వైర్‌సతో మృతి చెందిన వారిని ప్రధానంగా ఈఎ్‌సఐ శ్మశానవాటికకు తీసుకొస్తున్నారు. ప్రభుత్వ, పైవ్రేటు, కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో మరణించిన వారి సమాచారాన్ని జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖలకు ఇస్తున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఆసుపత్రి సిబ్బంది మృతదేహాలను ప్యాక్‌ చేస్తారు. పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది సాయంతో శ్మశాన వాటికకు తరలిస్తున్నారు. ఇంట్లోనే చికిత్స పొందుతున్న పాజిటివ్‌లు అనుకోని రీతిలో మరణిస్తే (ఎప్పుడైనా) స్థానికంగా ఉన్న మున్సిపల్‌, పోలీసు సిబ్బందికి సమాచారం అందిస్తున్నారు. వారి ద్వారా అంబులెన్స్‌లు ఏర్పాటుచేసి, శ్మశాన వాటికకు తరలిస్తున్నారు. గురువారం ఈఎ్‌సఐ శ్మశాన వాటికకు వచ్చిన 38 మృతదేహాలు అంబులెన్స్‌లలోనే తీసుకొచ్చారు. పోలీసులూ వెంట ఉన్నారు.

వాటి తరలింపులో కొవిడ్‌ జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. అంబులెన్సుల్లో అత్యధికం వివిధ ఆసుపత్రుల నుంచే వచ్చినవేనని తెలుస్తోంది. గురువారం ఈఎ్‌సఐ శ్మశాన వాటిక(38)తో పాటు బన్సీలాల్‌ పేట విద్యుత్‌ శ్మశానవాటిక(2), బన్సీలాల్‌ హిందూ శ్మశాన వాటిక(3), మల్లాపూర్‌ ఫకీర్‌ మల్లా కబరస్థాన్‌(3), మహాప్రస్థానం(2) శ్మశాన వాటికలకు కొవిడ్‌ మృతదేహాలు వచ్చినట్లు తెలిసింది. ఇద్దరు ముస్లిములను వారి కుటుంబ సభ్యులు తమ ప్రైవేటు శ్మశాన వాటికలకు తీసుకెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఇవికాక, నగరంలోని మరో తొమ్మిది శ్మశాన వాటికల్లో కొవిడ్‌ మృతదేహాలను అనుమతిస్తున్నప్పటికీ గురువారం వాటిలో ఎక్కడా అలాంటి మృతదేహాలు రాలేదని సమాచారం.

కరోనా అనుమానితులా?
ఎర్రగడ్డ శ్మశాన వాటికకు అంబులెన్స్‌లో తరలిస్తున్న మృతదేహాలన్నీ కరోనా మృతులవేనని చెబుతున్నారు. కరోనా అనుమానంతో ఆస్పత్రిలో చేరి, పరీక్ష ఫలితాలు రాకముందే రోగి మరణిస్తే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకే అప్పగిస్తున్నారు. కరోనా ధ్రువీకరణ అయితే కుటుంబ సభ్యులకు అప్పగించరు. అంబులెన్సుల్లో వస్తున్న మృతదేహాలను కొవిడ్‌ నిబంధనల ప్రకారం ప్యాకింగ్‌ చేయడం, వెంట వస్తున్న సిబ్బంది పీపీఈ కిట్లు ఽధరించిఉండటం, కుటుంబ సభ్యులు విడిగా వేరే వాహనాల్లో రావడం… ఇవన్నీ కరోనా మృతదేహాలనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. మృతదేహాల్ని అంబులెన్సులో నుంచి దించుతున్న సమయంలో కుటుంబ సభ్యుల్ని దగ్గరకు రానివ్వటం లేదు. దూరం నుంచే బాడీ ముఖం చూపిస్తున్నారు. అక్కడి రిజిస్టర్‌లో మృతుడి వివరాల్ని నమోదు చేస్తున్నారు.

ఎక్కడ నుంచి మృతదేహాలను తీసుకొస్తున్నారని మూడు అంబులెన్సుల సిబ్బందిని అడగ్గా.. తాము ఎలాంటి సమాచారం ఇవ్వలేమని చెప్పారు. ‘‘మా సారుకు తెలిస్తే మా ఉద్యోగాలు పోతాయి. మేం మాట్లాడలేం. మమ్మల్ని వదిలేయండి. చిన్నోళ్లం.. ఏమీ అడగొద్దు’’ అని విజ్ఞప్తి చేశారు. అంబులెన్సుల యజమానులతో మాట్లాడినప్పుడు మాత్రం, ‘‘ప్రభుత్వ, పైవ్రేటు ఆసుపత్రుల్లో చనిపోయిన వారికి సంబంధించి ఓ ఏజెన్సీ ద్వారా సమాచారం వస్తుంది. మా బాధ్యత మృతదేహాల్ని తీసుకెళ్లి శ్మశాన వాటికల్లో అప్పజెప్పటమే‘‘ అని చెప్పారు. అంతకు మించిన వివరాల్ని అడగొద్దన్నారు. శ్మశాన వాటిక రిజిస్టర్‌లో మరణానికి కారణాలను పేర్కొంటారు. వాటిని తెలుసుకోవడానికి ఆంధ్రజ్యోతి విలేకరులు చాలా ప్రయత్నించారు. కానీ, శ్మశాన వాటికల సిబ్బంది ఆ రిజిస్టర్లను చూపించేందుకు నిరాకరించారు.

విరామం లేకుండా అంబులెన్స్‌లు
ఆంధ్రజ్యోతి పరిశీలన గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలైంది. ఈఎ్‌సఐ శ్మశానవాటిక ప్రాంతంలో వర్షం పడుతోంది. పది గంటలకు తెరిపినిచ్చింది. 11.30 గంటల నుంచి అంబులెన్సులు రాక మొదలైంది. గంటకు మూడు-నాలుగు చొప్పున రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు వస్తూనే ఉన్నాయి. కరోనా అనుమానిత మృతదేహాల అంతిమ సంస్కారాలకు శ్మశాన వాటికలో విడిగా ఏర్పాటు చేశారు. కరోనా మృతదేహాలు ఎక్కువగా ఉండటంతో ఒకేసారి దగ్గర దగ్గరగా ఎక్కువ మందికి దహన సంస్కారాలు చేయటం కనిపించింది. శశ్మాన వాటిక లోపలకు వెళ్లే ప్రతి అంబులెన్సును, వచ్చిన సమయాన్ని ఆంధ్రజ్యోతి బృందం రికార్డు చేసింది. మధ్యాహ్నం 2 గంటల లోపు పది కరోనా మృతదేహాలు వచ్చాయి. సాయంత్రం 2-5 మధ్య మరో పది, రాత్రి 9 గంటల్లోపు మరో 18 మృతదేహాలు వచ్చాయి. సాయంత్రం 6-7 గంటల మఽధ్యే ఎక్కువ మృతదేహాలు వచ్చాయి. చివరి మృతదేహం రాత్రి 9.14 గంటల సమయంలో వచ్చింది.

నిజానికి హిందువులు సాయంత్రం ఆరులోపు అంత్యక్రియలు చేయలేకపోతే మర్నాటికి వాయిదా వేస్తారు. మారిన పరిస్థితుల్లో రాత్రి పూట కూడా కొనసాగిస్తున్నారు. కరోనా వచ్చిన తొలిరోజుల్లో కరోనా మృతదేహాలకు ఈఎ్‌సఐ శ్మశాన వాటికలో మాత్రమే అంత్యక్రియలు చేసేవారు. ఇప్పుడు అన్నిచోట్లా అనుమతిస్తున్నారు. స్థానికుల అభ్యంతరాల భయంతో ఇతర శ్మశాన వాటికల నిర్వాహకులు ముందుకు రావడం లేదు.

2-3 రోజుల ముందు చనిపోయిన వారా?
హైదరాబాద్‌లో గురువారం కొవిడ్‌ జాగ్రత్తలతో అంత్యక్రియలు చేసిన యాభై మృతదేహాలు అంతకు రెండు రోజుల ముందు నాటివనే వాదన వినిపించే అవకాశం ఉంది. నిజానికి అంతకు పది రోజుల ముందు బులెటిన్‌ గణాంకాలు తీసినా ఒక్కరోజు(11 మంది) మించి ఏనాడూ కొవిడ్‌ మృతులు పది దాటలేదు. మరి ఒకే రోజు ఇన్ని రెట్లు కొవిడ్‌ అంత్యక్రియలు ఎలా నమోదయినట్లు? పోనీ కొవిడ్‌ పరీక్ష చేసి, ఫలితం రాని అనుమానితులమృతదేహాలనే కొవిడ్‌ జాగ్రత్తలతో అంత్యక్రియలు చేశారనుకుందాం. 23తర్వాత రోజు శుక్రవారం కూడా మరణాలు పదిలోపే పదిలోపే ఉన్నాయి. అంటే మరణించిన తర్వాత పాజిటివ్‌ తేలిన వారి వివరాలను అధికారికంగా చేర్చుతూ పాత బులెటిన్లను అప్‌డేట్‌ చేయడం లేదా? అనే అనుమానమూ తలెత్తుతుంది. వీటన్నింటికీ ప్రభుత్వం సహేతుకంగా, వాస్తవిక దృక్పథంతో వివరణలు ఇస్తే ప్రజల్లో నెలకొన్న అనేక అనుమానాలు పటాపంచలవుతాయి. సోషల్‌ మీడియాల్లో వైరల్‌ వీడియోలు ఆగుతాయి.

కరోనా అంత్యక్రియలు అనుమతించిన శ్మశాన వాటికలు
ఈఎస్‌ఐ శ్మశాన వాటిక
బన్సీలాల్‌ పేట విద్యుత్‌ శ్మశానవాటిక
బన్సీలాల్‌ హిందూ శ్మశాన వాటిక
మల్లాపూర్‌ ఫకీర్‌ మల్లా కబరస్థాన్‌
కవాడిగూడ సింగాడికుంట దళిత శ్మశాన వాటిక
దోమలగూడ హిందూ శ్మశాన వాటిక
మాదాపూర్‌ శ్మశాన వాటిక
బేగంపేట ధనియాల గుట్ట శ్మశాన వాటిక
మైలార్‌దేవ్‌ పల్లి హిందూ శ్మశాన వాటిక
రాజేంద్రనగర్‌ శ్మశాన వాటిక
హసన్‌ నగర్‌ శ్మశాన వాటిక
రహ్మత్‌నగర్‌ హాబిబా ఫాతిమానగర్‌ కబరస్థాన్‌
ఉప్పల్‌ హిందూ శ్మశానవాటిక
అంబర్‌పేట విద్యుత్‌ శ్మశాన వాటిక
మూసారంబాగ్‌ హిందూ శ్మశాన వాటిక
సలాల బర్కాస్‌ కబరస్థాన్‌
దేవునికుంట శ్మశాన వాటిక
అలమ్‌గిర్‌ మజీద్‌ కబరస్థాన్‌
నారాయణగూడ శ్మశాన వాటిక
అల్లగూడ బావి శ్మశానవాటిక
గోపనిపల్లి తండా శ్మశాన వాటిక
హఫీజ్‌పేట ప్రేమ్‌నగర్‌ కబరస్థాన్‌
బీహెచ్‌ఈఎల్‌ ఆర్సీపురం శ్మశాన వాటిక
మూసాపేట శ్మశాన వాటిక
కేపీహెచ్‌బీ 3వ ఫేజ్‌ శ్మశాన వాటిక

నోట్‌: వీటిలో కొన్ని శ్మశాన వాటికల్లో ఇంకా కొవిడ్‌ అంత్యక్రియలు ప్రారంభం కాలేదు.

ఈఎస్‌ఐ శ్మశాన వాటికలో నెలవారీ అంతిమ సంస్కారాలు
జనవరి 173
ఫిబ్రవరి 129
మార్చి 135
ఏప్రిల్‌ 136

Courtesy AndhraJyothy