పని మీద బయటకొచ్చినవారు ఇంటికి
వెళ్లేలోపు 50 కెమెరాల్లో చిక్కే అవకాశం
రాష్ట్రంలోని ప్రతి అంగుళం పోలీస్‌ రాడార్‌లోకి
ఎక్కడ నేరం జరిగినా వెంటనే సమాచారం
6 నెలల్లో కమాండ్‌ ‘కంట్రోల్‌’

దేశవ్యాప్తంగా పోలీసులు ఉపయోగిస్తున్న కెమెరాల్లో 64 శాతానికి పైగా ఒక్క తెలంగాణలోనే ఉన్నాయి! డేటా ఆన్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్స్‌ గణాంకాల ప్రకారం 2019 జనవరి నాటి పరిస్థితి ఇది. ఆ తర్వాత కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటన్నింటినీ ఉపయోగించుకుని నేరాలను నియంత్రించేందుకు.. నేరగాళ్లను వేగంగా పట్టుకునేందుకు అత్యంత అధునాతన పరిజ్ఞానంతో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఆర్నెల్లలో అందుబాటులోకి రానుంది!

హైదరాబాద్‌ సిటీ : ఒక్క నిమిషం వ్యవధిలో లక్ష కెమెరాల ఫుటేజీని పరిశీలించే టెక్నాలజీ, పరికరాలతో.. కమాండ్‌ కంట్రోల్‌ సేవలు మరో ఆరునెలల్లో అందుబాటులోకి రానున్నాయి. శాంతిభద్రతల పర్యవేక్షణకు తెలంగాణ సర్కారు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ సెంటర్‌ పూర్తిస్థాయి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుంది. డేటా ఆన్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్స్‌ గణాంకాల ప్రకారం 2019 జనవరి నాటికి దేశవ్యాప్తంగా పోలీసులు ఉపయోగిస్తున్న సీసీ కెమెరాల్లో (4,27,529) అరవైనాలుగు శాతానికి పైగా (2,75,528) కెమెరాలు ఒక్క తెలంగాణలోనే ఉన్నాయి. ఆ తర్వాత కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఒక వ్యక్తి మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లేలోపు కనీసం 50 కెమెరాలకు చిక్కే అవకాశం ఉంది. ఆ కెమెరాలన్నింటినీ  ఈ సెంటర్‌కు అనుసంధానం చేయడంతో రాష్ట్రంలోని ప్రతి అంగుళం పోలీసు రాడార్‌లోకి వస్తుంది.

ఆ కెమెరాల ఫుటేజీని వేగంగా పరిశీలించే పరికరాలను, పరిజ్ఞానాన్ని కమాండ్‌కంట్రోల్‌ సెంటర్‌లో ఏర్పాటు చేయడం వల్ల నేరగాళ్లను వేగంగా పట్టుకునే వీలుంటుంది. అంతేకాదు.. ఏ మారుమూల ప్రాంతంలో ఏ నేరం జరిగినా వెంటనే ఈ సెంటర్‌కు సమాచారం అందేలా అన్ని జిల్లాల ఎస్పీ కార్యాలయాలు, కమిషనరేట్లలో మినీ కంట్రోల్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీ్‌సస్టేషన్లు, ట్రాఫిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డేటా, సిగ్నలింగ్‌ వ్యవస్థ, నేరగాళ్ల సమాచారం, డయల్‌ 100, 112, మహిళల భద్రత యాప్‌లు, హాక్‌-ఐ.. ఇలా సమస్తం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానమై ఉంటాయి. హైదరాబాద్‌ నగరంలో రూ. 500కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టిన ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ దేశానికే తలమానికంగా ఉంటుందని రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. గురువారం ఆయన ఐటీసీ కాకతీయ హోటల్‌లో మాట్లాడారు. నేరగాళ్ల ఉనికిని గుర్తించడంతోపాటు, నేరాల నియంత్రణకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఎంతగానో సహకరిస్తుందని మంత్రి వివరించారు.

Courtesy Andhrajyothi