...అందుకోసమే రూపాయికి పుస్తకం!

‘ఏడు తరాల’ను భావితరాలకు అందించినా… రక్తాశ్రువులు, స్పార్టకస్‌లను సామాన్యులకు చేరువ చేసినా..ఎంతోమంది ప్రముఖులకు అక్షర పట్టాభిషేకం చేసినా… ఆమెదో ప్రత్యేక పంథా… తాజాగా ఒక్క రూపాయికే అనితరసాధ్యమైన సాహిత్యాన్ని అందిస్తూ
ఆశ్చర్యపరిచారామె. నలభై ఏళ్లుగా తెలుగు భాషకు, సమాజానికి ఆమె చేసిన సేవ ఎప్పటికీ నిలిచిపోతుంది… హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ సంపాదకురాలు గీతా రామస్వామి వివిధ విషయాలపై వసుంధరతో పంచుకున్న మనోభావాలివి..

కేవలం చదివే అలవాటు మాత్రమే కాదు… మనిషిలో వికాసం పెంచే కృషి కూడా తెలుగులోనే జరగాలి. ఉదాహరణకు ఐన్‌స్టీన్‌ సూత్రాలు తెలుగులో తేలిగ్గా చెప్పాలి. విభిన్న రంగాల్లో ఉద్భవిస్తున్న అభివృద్ధి మాతృభాషలో ప్రజలకు అందేలా చేయాలి.
మా మూలాలు తమిళనాడులో ఉన్నా కేరళలో ఎక్కువ కాలం ఉన్నాం. మానాన్న కేంద్ర సర్వీసుల్లో పని చేయడం వల్ల మహారాష్ట్రలోనూ నివసించాం. నేను కళాశాలలో చేరే సమయానికి హైదరాబాద్‌ వచ్చాం. నాలో నిశ్చితమైన అభిప్రాయాలు, భావజాలం ఏర్పడడానికి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాభ్యాసం కారణమైంది. వామపక్ష ఉద్యమంలో చేరడానికి కూడా అదే కారణం. అక్కడి నుంచి బయటకు వచ్చాక తెలుగు సాహిత్యాన్ని, భావజాలాన్ని సామాన్యులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో సి.కె.నారాయణరెడ్డి, మరికొందరు ప్రముఖులతో కలిసి హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ ఏర్పాటు చేశాం. నలభై ఏళ్లుగా అలా జీవితం పుస్తకాలతో ముడిపడిపోయింది.

...అందుకోసమే రూపాయికి పుస్తకం!

* హెచ్‌బీటీ ప్రారంభమయిన మొదట్లో నేనూ, నారాయణరెడ్డిగారు… ప్రతి ఊరూ తిరిగేవాళ్లం. ఒక బల్ల మీద పుస్తకాలు పెట్టుకుని రోజంతా నిలబడి పుస్తకాలు అమ్మేదాన్ని. కొంతమందయితే నాకు వెనుకాముందూ ఎవరూ లేక ఇలా అమ్ముతున్నా అనుకునేవారు. అయ్యో పాపం అంటూ నిట్టూర్పులు విడిచేవారు. అప్పటికి నాకు పెళ్లయ్యింది. మావారు సిరిల్‌రెడ్డి లా ప్రాక్టీసు చేస్తున్నారు. మొత్తం మీద ఇలా ప్రతి ఊరూ తిరిగి నాకు మంచి తెలుగు వచ్చేసింది.
భవిష్యత్తులో తెలుగు పుస్తకాలను చదివింపజేయడం అనే సవాలు ఎదుర్కోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం. కేవలం చదివే అలవాటు మాత్రమే కాదు… మనిషిలో వికాసం పెంచే కృషి కూడా తెలుగులోనే జరగాలి. ఉదాహరణకు ఐన్‌స్టీన్‌ సూత్రాలు తెలుగులో తేలిగ్గా చెప్పాలి. షార్‌లో జరిగే పరిశోధనల గురించి తెలుగులో వివరించగలగాలి. విభిన్న రంగాల్లో ఉద్భవిస్తున్న అభివృద్ధి మాతృభాషలో ప్రజలకు అందాలి. అలా జరగాలంటే సమకాలీన విషయాలపై విస్తృతమైన సాహిత్యం ప్రజలకు అందుబాటులోకి రావాలి. దీనికోసం అందరి నుంచి అభిప్రాయాలు, ప్రముఖుల నుంచి సలహాలు తీసుకుంటున్నాం. త్వరలో కొన్ని జిల్లా కేంద్రాలు, హైదరాబాద్‌లో సమావేశాలు
నిర్వహించనున్నాం.

* కొన్ని పుస్తకాలు అమూల్యమైనవి. వాటికి వెలకట్టలేం. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ లాభాల కోసం పెట్టింది కాదు. కాబట్టి మంచి పుస్తకాలను ప్రజలకు అతి తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తున్నాం. ప్రతి ఇంట్లో రోజువారీ జీవితంలో ఉపయోగపడే అనేక విషయాలను అందిస్తున్నాం. మీ పిల్లలు టీవీ చూస్తారా?, అల్లరి పిల్లల్లో అద్భుత మార్పులు, ఎగిరే క్లాస్‌రూం, మోగ్లీ జంగిల్‌ బుక్‌ కథలు వంటి పుస్తకాల ప్రచురణకు వందేసి రూపాయలపైనే ఖర్చయ్యింది. వాటిని కేవలం పది రూపాయల చొప్పున అందుబాటులోకి తెస్తున్నాం. ఇంకొన్ని అయిదు రూపాయలు, రెండు రూపాయలకే ఇస్తున్నాం. మొక్కపాటి నరసింహశాస్త్రి రచన బారిస్టరు పార్వతీశం, ఎస్‌.జయ రాసిన దేశమంటే మార్కెట్‌ కాదోయ్‌ వంటివి కేవలం ఒక్క రూపాయికే అందుబాటులో ఉంచాం. మరికొన్ని ఉచితంగానూ అందిస్తున్నాం. హైదరాబాద్‌లో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. యువతరంలో విజ్ఞాన తృష్ణను, చదివే అలవాటును పెంచేందుకే ఈ ప్రయత్నమంతా.

* మేం కూడా కేవలం సాహిత్యమే కాకుండా అనేక విషయాలపై పుస్తకాలు ప్రచురిస్తున్నాం. ఆరోగ్యం, పరిశోధనలు, ప్రముఖుల జీవిత చరిత్రలు ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. దీనికి ఆయా రంగాల్లో ప్రముఖుల సహకారం తీసుకుంటున్నాం. ఉదాహరణకు ఆరోగ్యంపై బీపీ, కీళ్లనొప్పులు, దంతాల సమస్యలు… ఇలా ఇరవై మూడు విషయాలపై విస్తృత పరిజ్ఞానం కలిగించే పుస్తకం తీసుకొచ్చాం. మూలికా వైద్యం, పిల్లల సంరక్షణ, వైద్యుడు లేనిచోట… ఈ విషయాలపై మూడు ప్రచురణలు అందుబాటులో ఉన్నాయి. మానసిక వైద్యంపై మంచి పుస్తకం ప్రచురించాం.


ఇంట్లో పిల్లలను ఎలా పెంచుతున్నాం… వాళ్లకు ఏం చెబుతున్నాం అన్నదాన్ని బట్టి భావి సమాజం ఉంటుంది. ముఖ్యంగా మగ పిల్లలకు నువ్వే మహారాజు… నువ్వు చెప్పినట్లు మిగిలిన వాళ్లు వినాలి… అనే ధోరణితో పెంచుతున్నారు. దీంతో తాము బలవంతులం, ఆడపిల్లలు బలహీనులనే భావం వారిలో నాటుకుపోతోంది. దీని వల్లే ఆడపిల్లలపై దాడులు జరుగుతున్నాయి. మగ పిల్లలను పెంచే పద్ధతి, వారికి నేర్పే విషయాల్లో మార్పులు వస్తేనే ఆడపిల్లలపై దృక్పథం మారుతుంది.


పుస్తకాలు జనంలోకి బాగానే వెళుతున్నాయి. మాకు నిధులు బయటి నుంచి రావు. పుస్తకాలు అమ్మిన డబ్బుతోనే సంస్థను నడపాలి. ఇప్పటికైతే ఇబ్బంది లేదు. కానీ పిల్లలందరూ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలకు వెళుతుండటం, తెలుగు చదివే పిల్లల సంఖ్య తగ్గుతుండడం పుస్తకాల అమ్మకాలపై భవిష్యత్తులో ప్రభావం చూపుతుందని అనిపిస్తోంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మాతృభాషలోనే బోధిస్తారు.  విస్తృతమైన సాహిత్యం అందుబాటులో ఉంది. కాబట్టి అక్కడ పిల్లలు త్వరగా అర్థం చేసుకోగలుగుతారు.

Courtesy Eenadu