మాడభూషి శ్రీధర్‌

మన భాగ్యనగరానికి కేంద్రపాలిత ప్రాంతమయ్యే ప్రమాదం ఉందా? దాని వల్ల ఎవరికి ప్రయోజనం? రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా దిగజార్చడమే రాజ్యాంగంపైన దాడి, ప్రజాస్వామ్యంపైన అత్యాచారం. సంవిధాన పరంగా మన దేశం రాష్ట్రాల సమాహారం. రాష్ట్రాలతోనే దేశం మనుగడ ముడిపడి ఉంటుంది. అనేక కారణాల వల్ల లదాక్‌ ప్రాంత ప్రజలు తము ఢిల్లీ పాలకుల అధీనంలో ఉండాలని కోరుకున్నారు. జమ్మూకశ్మీర్‌తో కలిసి ఉండడం వల్ల వారికీ ఏ ప్రయోజనమూ లేదని అభిప్రాయపడుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం కావడాన్ని లదాక్‌ ప్రజలు స్వాగతించారు. జమ్మూలోని అధిక సంఖ్యాక ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఇక కశ్మీర్‌ ప్రజల్లో చాలామంది తమ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని దిగజార్చడంగా భావిస్తున్నారు.

బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో 370 ఆర్టికల్‌ గురించి ప్రస్తావించిందేగానీ జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తానని చెప్పలేదు. కశ్మీర్‌ లోయలో వారే కాదు, సొంతంగా సమగ్ర రాష్ట్ర హోదాలో ఉన్న ఏ ప్రాంతం కూడా కేంద్రపాలిత ప్రాంతంగా దిగజారడానికి అంగీకరించదు. జమ్మూకశ్మీర్‌ను చీల్చి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడానికి కేంద్రం అనుసరించిన పద్ధతి, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించిన తీరు పరిశీలిస్తే, దేశంలో ప్రజాస్వామ్యానికి, ఏ రాష్ట్ర స్వరూపానిౖకైనా ప్రమా దం వాటిల్లుతుందనే భయాలు కలుగుతున్నాయి.

జమ్మూకశ్మీర్‌లో పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ, తర్వాత మద్దతును ఉపసంహరించి, కేంద్రంలో తన పాలనాధికారాన్ని ఉపయోగించి కేంద్రపాలనను రుద్దింది. రాజకీయ సంక్షోభాన్ని రాజ్యాంగ సంక్షోభంగా దురన్వయం చేసి నిరంకుశ నిర్ణయం తీసుకున్నది. ఆర్టికల్‌ 3గానీ, ఆర్టికల్‌ 370 గానీ, మరే ఇతర సంవిధాన సూత్రాలనుగానీ కేంద్రం లెక్కచేయలేదు. జమ్ముకశ్మీర్‌ రాజ్యాంగ సభ అంటే శాసనసభగా భావించాలని ఆర్టికల్‌ 370ని సవరించడం ఒకటి.  రద్దయిన శాసనసభ అధికారాలను పార్లమెంట్‌  వినియోగించు కోవచ్చనే మరో ఎమర్జన్సీ సూత్రాన్ని అత్యంత కీలకమైన రాజ్యాంగ సవరణకు దుర్వినియోగం చేయడం మరొకటి.

ఈ నేపధ్యంలో హైదరాబాద్‌ను కూడా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిపారేయడానికి ఈ దారిలో ప్రయాణిస్తారనే అభిప్రాయాన్ని మీడియాలో బీజేపీ అభిమానులు నాటారు. ఇక దీని మీద వ్యాసాలు, ఉపన్యాసాలు, చర్చలు, ట్విట్టర్‌లో తిట్లు, ఫేస్‌బుక్‌లో లైక్‌లు మొదలైనాయి. ఇదివరకు సినిమా, క్రికెట్‌ తారలకు అభిమానులుండేవారు. తారలు సమైక్యంగా ఉన్నా వారి అభిమానులు కొట్టుకునే వారు. ఇదేం పిచ్చి అనుకున్నారే కాని అది విస్తరించి రాజకీయాలను ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. భక్తులనే మాట వాడుకలోకి వచ్చింది. వీరభక్తి తెప్పలుగా ప్రవహించడం మొదలైంది. పక్కనే వీరద్వేషపు కాలుష్యం మరొకటి. ఇవన్నీ సోషల్‌ మీడియాలో పారే మురికితో కలిసి బలీయమైన అభిప్రాయ నిర్ణాయక భూతాలుగా పెరుగుతున్నాయి. ఒకాయనైతే మీరు బానిసలు మేం భక్తులం కనుక మేమే గొప్ప అని ఛాతీ విప్పి చాటుకుంటున్నారు. అసమ్మతిని, భిన్నాభిప్రాయాన్ని తిట్టడానికి రెచ్చగొట్టే పదజాలం వాడుతున్నారు. భక్తులని ఇదివరకు అనబడేవారు ఇప్పుడు గుడ్డిబానిసత్వంలో పడిపోయి కారణాల విచారణను వదిలేస్తున్నారు. పూర్తిగా సమర్థించకుండా, విద్వేషపు జల్లులతో వ్యతిరేకించకుండా, సమతుల్యమైన విశ్లేషణ చేయవచ్చనే వివేకం వదిలేస్తున్నారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఖతం చేయడానికో, ఆంధ్రలో రాజకీయంగా ఎదగడానికో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడమే బీజేపీ వ్యూహమని అనుకుంటే అది రాజకీయ విజ్ఞతను అనుమానింప చేస్తుంది. సాధారణంగా కేంద్రం ఈ విధంగా తెలంగాణ రాజధానిని కైవసం చేసుకునే వాతావరణం ఉందనిపించడం లేదు. అయినా ఆ పనిచేస్తే తెలుగు ప్రజలలో అది కొత్త ముసలమై తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమానికి కొత్త ఊపిరులూదుతుంది. బీజేపీకి ఏవిధంగా లాభిస్తుందో వారే ఆలోచించుకోవాలి. దక్షిణాదిలో కూడా అగ్నిగుండాన్ని రాజేసే చర్యలు మంచివి కావనే సద్బుద్ధి వికసించాలి మరి.

 

 

 

 

వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌

 

(Courtacy Sakshi)