• తెలంగాణలో ముందు ఏకాభిప్రాయం రావాలి
  • ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో సీహెచ్‌ విద్యాసాగర్‌రావు
  •  హైదరాబాద్‌ నగరం దేశ రెండో రాజధాని అయితే బాగుంటుందని బీజేపీ సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అభిప్రాయపడ్డారు. దీనిపై బీజేపీలో ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఈ అంశం బీజేపీకి సంబంధించినది కాదని, దీనిపై అన్ని పార్టీల్లో చర్చ జరగాల్సిన అవశ్యకత ఉందని అన్నారు. రెండో రాజధాని కోసం అన్ని పార్టీలు కేంద్రం వద్దకు వెళ్లాలని పేర్కొన్న ఆయన.. ఈ దిశగా వారికి నాయకత్వం వహించే ఉద్దేశం తనకు లేదన్నారు. దేశానికి రెండో రాజధాని అవసరమైతే అది తప్పనిసరిగా హైదరాబాద్‌ అవుతుందని రాజ్యాంగ నిర్మాత డా. అంబేడ్కర్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై గతంలో అన్ని పార్టీలు స్పందించాయి. పార్లమెంటులో చర్చ కూడా జరిగింది. ఈ అంశంపై ముందు తెలంగాణలో ఏకాభిప్రాయం రావాల్సి ఉంటుంది. ఆచరణ యోగ్యమైన చర్చ అవసరం అని విద్యాసాగర్‌రావు ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో చెప్పారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం వల్ల ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతోందని, అక్కడ జనవరి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.

Courtesy Andhrajyothy..