కోటా, జోధ్ పుర్, అహ్మదాబాద్, రాజ్ కోట్ లో విషాదాలు జోధ్ పుర్

(రాజస్థాన్): కోటాలోని జెఎన్ ప్రభుత్వాసుపత్రిలో దాదాపు వందమంది శిశువుల మరణం తాలూకు విషాదజ్ఞాపకం మరుగున పడక ముందే జోధ్ పుర్ లోని రెండు సర్కారు దవాఖానాల్లో దాదాపు అదే సంఖ్యలో పసివారు మృతి చెందిన ఘటన వెలుగుచూసింది.

కోటా, జోధ్ పుర్ ఘటనల తర్వాత గుజరాత్ లోని రాజ్ కోట్, అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రుల్లోనూ శిశువులు అసువులు బాసిన విషయం వెల్లడైంది. * డిసెంబరులో జోథపులోని ఉమెయిద్, ఎండీఎం ఆసుపత్రుల్లో మొత్తం 146 మంది చిన్నారులు మరణించగా వీరిలో నవజాత శిశువుల ఐసీయులో చికిత్స పొందుతూ మృతిచెందిన వారి సంఖ్య 102గా ఉంది. ఎస్.ఎన్ వైద్యకళాశాల సమర్పించిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. * రాజ్ కోట్ జిల్లాలోని సివిల్ ఆసుపత్రిలో డిసెంబరులో 11 మంది శిశువులు మరణించగా, అహ్మదాబాద్ లోని ప్రభుత్వాసుపత్రిలో అదేనెలలో 88 మంది పసికందులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం వడోదరలో విలేకరులు ఈ విషయంపై ప్రశ్నించగా గుజరాత్ సీఎం విజయ్ రూపాని సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు.

Courtesy Eenadu