• నయీం బినామీ ఆస్తులు 1200 కోట్లు
  • భార్య పేర ఇల్లు, కొన్ని ప్లాట్లు
  • దర్జీ పని చేసి సంపాదించా
  • ఐటీశాఖ విచారణ వేగవంతం
  • బినామీల చట్టం కింద జప్తు!

హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) విచారణ వేగవంతం చేసింది. కేసు విచారణలో భాగంగా నయీం భార్య హసీనా బేగంను ఐటీ అధికారులు విచారించారు. నయీం ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని హసీనా బేగం ఐటీ అధికారులకు వెల్లడించారు. నల్లగొండలోని ఇంటితో పాటు మరికొన్ని ఆస్తుల్ని తాను దర్జీ పని(టైలరింగ్‌) చేసి సంపాదించినట్లు హసీనాబేగం ఐటీ అధికారులకు వివరించినట్లు తెలిసింది. ఇతర ఆస్తులకు సంబంధించి తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. నయీం ఇంట్లో పట్టుబడ్డ వంటావిడ ఫర్హానా పేరుతో ఉన్న ఆస్తుల గురించి కూడా ఐటీ అధికారులు హసీనా బేగంను ఆరా తీసినట్లు తెలిసింది. ఫర్హానా పేరుతో హైదరాబాద్‌, సైబరాబాద్‌తోపాటు రంగారెడ్డి, నల్లగొండలో సుమారు 30 నుంచి 40 ఇళ్లు, ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేసినట్లు సిట్‌ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఒక్క ఫర్హానా పేరుతో ఉన్న ఆస్తుల విలువ వందల కోట్లు ఉంటుందని గుర్తించిన ఐటీ అధికారులు ఆ కోణంలోను హసీనాబేగం నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు.

భూ సెటిల్మెంట్లతోనే..
ఎలాంటి ఆదాయ మార్గం లేకుండానే విలువైన భూముల సెటిల్మెంట్లతో నయీం పెద్ద మొత్తంలో సంపాదించాడని అధికారులు నిర్ధారించారు. నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత సిట్‌ నిర్వహించిన దర్యాప్తులో గుర్తించిన అంశాల్ని ఐటీ అధికారులు సేకరించారు. సిట్‌ నివేదిక ప్రకారం తా ము గుర్తించిన ఆస్తులు అనధికారికమైనవని, ఆయా ఆస్తులకు ఐటీ చెల్లించలేదని నిగ్గుతేల్చిన అధికారులు బినామీ ఆస్తుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. కిడ్నా్‌పలు, బెదిరింపులు, సెటిల్మెంట్లు, భూకబ్జాలతో నయీం సంపాదించిన ఆస్తులు అతని బినామీల పేర్ల మీద ఉన్నాయని ఐటీ శాఖ గుర్తించింది. నయీం ఎన్‌కౌంటర్‌ జరిగిన శంషాబాద్‌లోని మిలీనియం టౌన్‌షి్‌పలోని ఇల్లు నయీం బావమరిది సాజిద్‌ పేరుతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బంధువులు, గ్యాంగ్‌ సభ్యుల బినామీ పేర్లతో నయీం రిజిస్ట్రేషన్లు చేయించినట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో బహిర్గతమైంది.

నయీం బినామీ ఆస్తుల విలువ మార్కెట్‌ రేటు ప్రకారం సుమారు రూ.1200 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. విచారణ అనంతరం త్వరలోనే ఆయా ఆస్తుల్ని ఐటీ శాఖ స్వాధీనం చేసుకోనుంది. నయీం ఆస్తుల్ని అటాచ్‌ చేసేందుకు ఐటీ శాఖ రంగం సిద్ధం చేసింది. ఆస్తుల అటాచ్‌మెంట్‌ను అనుమతి కోరుతూ ఢిల్లీలోని అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీలో ఐటీ అధికారులు ఇదివరకే పిటిషన్‌ దాఖలు చేశారు. ఆదాయ మార్గం లేకుండా వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టడంతో సిట్‌ సేకరించిన ఆధారాల మేరకు ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది.

ఇదీ ఆస్తుల లెక్క
తెలంగాణలోని ఆయా జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, గోవా, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల్లో నయీంకు స్ధిరాస్తులు ఉన్నట్లు సిట్‌ విచారణలో వెలుగులోకి వచ్చింది. అరెస్టు సమయంలో నిందితులు ఇచ్చిన సమాచారం, సోదాల్లో లభించిన పత్రాల ఆధారంగా గ్యాంగ్‌స్టర్‌కు 1015 ఎకరాల భూములు, లక్షా 67 వేల 117 చదరపు అడుగుల ఇళ్ల స్థలాలు ఉన్నట్లుగా సిట్‌ గుర్తించింది. ఎన్‌కౌంటర్‌ తర్వాత హైదరాబాద్‌లోని నయీం డెన్‌లో నిర్వహించిన సోదాల్లో రూ.2.08 కోట్ల నగదు, 1.90 కిలోల బంగారు ఆభరణాలు, 258 సెల్‌ఫోన్స్‌, వేర్వేరు వ్యక్తుల పేర్లతో ఉన్న 203 ఒరిజినల్‌ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు, పేలుడు పదార్ధాలు, ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Courtesy AndhraJyothy…