సోవియట్‌ యూనియన్‌ లోని తాష్కెంట్‌లో భారత కమ్యూనిస్ట్‌ పార్టీ మొట్టమొదటిశాఖ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అక్టోబర్‌ 17, 2020 ఒక చారిత్రాత్మక రోజుగా ప్రత్యేకత సంతరించుకుంది. వంద సంవత్సరాల కమ్యూనిస్ట్‌ ఉద్యమం 20వ శతాబ్దంలో ఎనిమిది దశాబ్దాలు, 21వ శతాబ్దంలో రెండు దశాబ్దాలను చూసింది. భారతకమ్యూనిస్ట్‌ పార్టీ పుట్టుక, అభివృద్ధి భారతదేశంలోని స్వాతంత్య్ర పోరాటంతో ముడిపడి ఉంది. సామాజిక, రాజకీయ మార్పును కోరే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న వివిధ వర్గాలకు చెందిన పోరాట యోధులు, సామ్రాజ్యవాద వ్యతిరేకత బలంగా ఉన్న కమ్యూనిస్ట్‌ పార్టీతో కలిశారు. ప్రారంభం నుంచి తీవ్రమైన అణచివేతను ఎదుర్కొన్న కమ్యూనిస్టులు వేల సంఖ్యలో కొన్ని సంవత్సరాల పాటు జైళ్ళలో గడిపారు. ఫ్యూడల్‌ వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలలో ముఖ్యంగా యుద్ధానంతరం 1945-47 మధ్య కాలంలో అనేక మంది అమరులైనారు.

అణచివేత స్థాయి, నాడున్న కమ్యూనిస్టులు చేసిన త్యాగాల సూచికను, 1943లో బొంబాయిలో జరిగిన మొదటి పార్టీసభలో పాల్గొన్న 138మంది ప్రతినిధులు జైలు జీవితం. మొత్తం 414సంవత్సరాలు (అంటే ప్రతివారు సగటున మూడేండ్లు). కార్మికులు, రైతులు ఆర్థికంగా, సామాజికంగా విముక్తి చెందితేనే సంపూర్ణ స్వరాజ్యానికి అర్థం ఉంటుందని కమ్యూనిస్టులు విశ్వసించారు. ట్రేడ్‌ యూనియన్ల ద్వారా కార్మికులను, కిసాన్‌ సభల ద్వారా రైతులను జాతీయోద్యమంలోకి తీసుకొని రావడంలో కమ్యూనిస్టులు చాలా కీలకమైన పాత్రను పోషించారు.

స్వాతంత్య్రానంతరం, బూర్జువా, భూస్వామ్య కూటమిగా ఉన్న కొత్త పాలకవర్గం ప్రజాస్వామిక విప్లవాన్ని పూర్తి చేసే పనిని చేయకుండా తిరస్కరించింది. బడా బూర్జువా నాయకత్వంలోని బూర్జువా, భూస్వామ్య కూటమి, పెట్టుబడిదారీ వ్యవస్థ మార్గంలో అభివద్ధిని సాధించే ఒక కొత్త పనిని మొదలు పెట్టేందుకు ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకుంది. ఈ కొత్త మార్గం భూస్వామ్య విధానంతో రాజీ చేసి, పురాతన కాలం నాటి భూమి సంబంధాల నుంచి రైతులను విముక్తి చేయడంలో వైఫల్యం అయ్యేలా చేసి, వారిపై పెట్టుబడిదారీ దోపిడీని విధించేట్టు చేసింది. ఎంచుకున్న ఈ విధానాలు పెద్ద గుత్త సంస్థలకు, గ్రామీణ ధనిక వర్గాలకు అనుకూలంగా ప్రభావితం చేసేలా ఉన్నాయి.

కమ్యూనిస్ట్‌ పార్టీ ”దున్నే వారికే భూమి” నినాదాన్ని నిజం చేయడం, భూసంస్కరణల కోసం పోరాటాలు చేయడం ద్వారా వ్యవసాయక సంబంధాలను ప్రజాస్వామ్యయుతం చేసే పనిని చేపట్టింది. ఈ పోరాటాలే భూసంస్కరణలను అమలు చేసేందుకు కేరళలో మొట్టమొదటి కమ్యూనిస్ట్‌ పార్టీ మంత్రివర్గాన్ని, ఆ తరువాత పశ్చిమ బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాలలో వామపక్ష ప్రభుత్వాల ఏర్పాటుకు దారి తీశాయి. కమ్యూనిస్ట్‌ పార్టీనే, స్వాతంత్య్రానంతర తొలి దశాబ్దాలలో భారత రాజకీయా లలో భూసంస్కరణలను తీసుకొని వచ్చింది.

కమ్యూనిస్టులు నాయకత్వ పాత్రను పోషించిన మరొక పెద్ద పోరాటం, భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఉద్యమం. స్వాతంత్య్రానికి ముందు కూడా, భాషా నియమంపైన ఆధారపడి రాష్ట్రాలన్నింటినీ కలిపి ఒక ఇండియన్‌ యూనియన్‌గా ఉండే సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టులు ప్రారంభం నుంచి కోరినారు.

కమ్యూనిస్టులు భారతదేశ రాజకీయ వ్యవస్థలో లౌకికతత్వం, ప్రజాస్వామ్యాల స్థిరమైన సంరక్షకులుగా ఉద్భవించారు. కాంగ్రెస్‌, ఇతర లౌకిక బూర్జువా పార్టీలు లౌకికతత్వం అంటే అన్ని మతాలు సమానత్వంతో ఉండి, ప్రభుత్వం, రాజకీయాలలో జోక్యం చేసుకునేందుకు సమాన హక్కులు కలిగి ఉండడం అనే భావనను కలిగిఉండగా, కమ్యూనిస్టులు మతాన్ని ప్రభుత్వం మరియు రాజకీయాల నుంచి వేరుచేయాలన్న స్థిరమైన భావన వైపు ఉన్నారు. కమ్యూనిస్ట్‌లకు లౌకికతత్వం పట్ల ఉన్న నిబద్ధతను వివిధ సందర్భాలలో పశ్చిమ బెంగాల్‌, కేరళ, త్రిపుర రాష్ట్రాలలో వామపక్ష ప్రభుత్వాల పాత్ర నిరూపించింది. ఈ విషయంలో, పశ్చిమ బెంగాల్‌లో రికార్డు స్థాయిలో 34సంవత్సరాల వామపక్ష ప్రభుత్వ పాలన దేశానికే ఆదర్శం. 1990వ దశకంలో హిందూత్వ శక్తులు పెరిగినప్పుడు, కమ్యూనిస్టులు, వామపక్ష పార్టీలు మాత్రమే, అయోధ్య లాంటి సమస్యలపై రాజీపడకుండా మతతత్వ శక్తులను తిప్పికొట్టేందుకు దఢంగా నిలబడినాయి.

కమ్యూనిస్టులు దేశంలో ప్రజాస్వామ్యం పటిష్ఠమైన, విశాలమైన అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారు. పాలకవర్గాలు నిత్యం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను పరిమితం చేయాలని అనుకున్నాయి. ప్రారంభం నుంచి కమ్యూనిస్టులు ముందస్తుగా నిర్బంధంలోకి తీసుకునే చట్టాలను (ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ లాస్‌) వ్యతిరేకించారు. వారు ప్రతీ సందర్భంలోనూ ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను రక్షించాలని కోరుతున్నారు. కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్టు) అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించింది, వివిధ స్థాయిల్లో ఉన్న ఆ పార్టీ నాయకులు ఎమర్జెన్సీలో జైళ్ళలో ఉన్నారు.

మూడు దశాబ్దాల క్రితం పాలకవర్గాలు నయా ఉదారవాద విధానాలను అవలంబించడం ప్రారంభం అయిన తరువాత మొత్తం పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనా మారింది. కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ, ఇతర అన్ని బూర్జువా పార్టీలు నయా ఉదారవాద విధానాలను స్వీకరించాయి. కానీ కమ్యూనిస్టులు ఈ నయా ఉదారవాద విధానాలను, అదేవిధంగా పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనా మార్పులో భాగంగా ఉన్న సామ్రాజ్యవాద అనుకూల మార్పును కూడా వ్యతిరేకించారు. మధ్య తరగతి, బలహీన వర్గాలకు చెందిన సంఘాల్లో పనిచేస్తున్న కమ్యూనిస్టులు ఈ విధానాలను ప్రతిఘటించేందుకు అవసరమైన సమీకరణకు నాయకత్వ పాత్రను పోషిస్తూ ఉన్నారు. వారు ప్రమాదకరమైన నయా ఉదారవాద విధానాలను తిప్పికొట్టేందుకు చాలా విశాలమైన కార్మికవర్గ ఐక్యతను నిర్మించేందుకు కృషి చేస్తున్నారు. ఐక్య కార్మికవర్గ ఉద్యమం గడిచిన మూడు దశాబ్దాలలో నయా ఉదారవాద పాలనా కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 19 దేశ వ్యాప్త సాధారణ సమ్మెలను నిర్వహించింది. 20వ సాధారణ సమ్మె ఈ నవంబర్‌ 26న జరుగనుంది.

కమ్యూనిస్టులు, వామపక్ష ఉద్యమం పట్ల పాలక వర్గాలకు ఉన్న వ్యతిరేకత, వామపక్ష ఉద్యమ కార్యకర్తలు, క్యాడర్‌పై కొనసాగుతున్న దాడులు రుజువు చేశాయి. 1970లలో పశ్చిమ బెంగాల్‌లో, ఆ పది సంవత్సరాల తరువాత త్రిపురలో అర్థఫాసిస్టు సెమీ ఫాసిస్ట్‌ భయోత్పాత కాలాన్ని, తీవ్రతరమైన వర్గపోరాటాల ఫలితంగానే పాలక వర్గాలు సృష్టించాయి. రెండు రాష్ట్రాల్లో కూడా కమ్యూనిస్ట్‌ వ్యతిరేకతతో కూడిన భయోత్పాతం, హింస పునరావృతం అయ్యాయి. కేరళలో కూడా ఇన్ని సంవత్సరాలుగా వందల సంఖ్యలో సీపీఐ(ఎం) కార్యకర్తలు, ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు పాలకవర్గాల చేతిలో హత్యకు గురయ్యారు.

కమ్యూనిస్టులు మహిళల విముక్తి కోసం సమగ్రమైన వైఖరిని రూపొందించడంలో ఒక మార్గదర్శక పాత్రను పోషించి, అన్ని రంగాల్లో మహిళల హక్కుల కోసం పోరాడారు. నిజమైన విముక్తికి సామాజిక అణచివేత, పితస్వామిక వ్యవస్థ అంతం కావడం అవసరం. 1931 ప్రారంభంలో ‘కమ్యూనిస్ట్స్‌ డ్రాఫ్ట్‌ ప్లాట్‌ ఫామ్‌ ఆఫ్‌ ఆక్షన్‌’ కుల వ్యవస్థ రద్దును, అంటరాని వారికి విముక్తి కలిగించడాన్ని సమర్ధించింది. కమ్యూనిస్టులు, వర్గపోరాటం సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా జరిగే పోరాటంతో మిళితం కావాలని కోరుకున్నారు.
నయా ఉదారవాదంతో సమానంగా హిందూత్వ శక్తులు అభివృద్ధి చెందాయి. ఇది కమ్యూనిస్టు ఉద్యమం, వామపక్ష ప్రజా తంత్ర శక్తుల ముందు ఒక పెద్ద సవాల్‌గా మారింది. నయా ఉదార వాద పెట్టుబడిదారీ విధానం వర్గాల కూర్పు, నిర్మాణంలో అనేక మార్పులను తీసుకొని వచ్చింది. ఆ మార్పుల్లో కొన్ని కార్మిక వర్గ అభివృద్ధి, రైతాంగ ఉద్యమాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. అన్ని రంగాల్లో శరవేగంతో జరుగుతున్న ప్రయివేటీకరణ, మధ్యతరగతి వర్గాల ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఈ కాలంలో వామపక్ష ప్రభుత్వాలు కూడా ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేయడంలో పరిమితులను, తీవ్రమైన అవరోధాలను ఎదుర్కొన్నాయి. కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్ట్‌), వామపక్ష శక్తులు ఈ సమస్యల పరిష్కారం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ, కొత్త వ్యూహాత్మక విధానాలు, నినాదాలు రూపొందిస్తూ ఉన్నాయి.

2014లో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఒక గుణాత్మకమైన మార్పు వచ్చింది. మొట్ట మొదటిసారిగా హిందూత్వ భావజాలంపై ఆధారపడి, ఫాసిస్ట్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ అదుపులో ఉన్న ఒక పార్టీ ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారాన్ని చెలాయిస్తూ ఉంది. లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, శ్రామిక ప్రజల సంక్షేమం పట్ల చాలా ఆందోళనకరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో ఏ విధమైన పాత్ర పోషించని, ఆ పోరాటం యొక్క సామ్రాజ్యవాద వ్యతిరేక లౌకిక సంస్కతిలో భాగస్వామ్యంలేని ఒక రాజకీయశక్తి ఇప్పుడు రాజ్యాంగాన్ని అంతమొందించి, నిరంకుశ పాలనను స్థాపించే పనిలో నిమగమైంది. ఇదంతా తిరోగమనం మరియు అభివృద్ధి నిరోధకమైన జాతీయవాదం పేరుతో జరుగుతున్నది.

ఈ కుహానా జాతీయవాదాన్ని సామ్రాజ్యవాద వ్యతిరేకతతో, లౌకిక (అందరినీ కలుపుకొని పోయే) జాతీయతా భావంతో ఎదుర్కొనే సవాల్‌ మన ముందుంది. కమ్యూనిస్టులు స్వాతంత్య్రం కోసం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకొనిపోతారు కాబట్టి, వారు ఆ సవాల్‌ను ఎదుర్కొనేదుకు సిద్ధంగా ఉన్నారు. ఇతర ప్రజాస్వామిక, లౌకికశక్తులను సమీకరించేందుకు కమ్యూనిస్టులు, వామపక్ష శక్తుల ఐక్యతను నిర్మించడం ఈ సమయంలో చాలా కీలకం.

భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి మార్క్సిజం-లెనినిజం సైద్ధాంతిక పునాదిగా ఉంటూ వస్తుంది. రివిజనిజంకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పాటు చేసిన పోరాట ఫలితంగానే 1964లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్టు) ఏర్పడింది. అది ఏర్పడిన అనంతరం, పార్టీ వామపక్ష దుందుడుకు వాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చింది. భారతీయ సమాజంలో నిర్దిష్ట పరిస్థితులకు మార్క్సిజం-లెనినిజాన్ని అన్వయిస్తూ, సీపీఐ(ఎం) ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుంది. ఈ కార్యక్రమం సోషలిజం సాధించే మార్గాన్ని సులభతరం చేసే జనతా ప్రజాస్వామ్యాన్ని సాధించే లక్ష్యాన్ని కలిగిఉంది. భారతదేశంలో విప్లవోద్యమం వర్గ దోపిడీ, సామాజిక అణచివేతల నుంచి విముక్తి చేసే సమాజ నిర్మాణ దిశగా ముందుకు పోయేందుకు అవసరమైన శాస్త్రీయ సిద్ధాంతం, ఆచరణను సిద్ధం చేసుకుంది.

– పీపుల్స్‌ డెమెక్రసీ సౌజన్యంతో
అనువాదం: బోడపట్ల రవీందర్‌,