హక్కులకు ఒక తాత్వికత, ఒక ఆచరణాత్మక రూపకల్పన, అదే విధంగా దీని చుట్టూ ఒక ఆలోచనను, ఒక విధానాన్ని ఈ దేశంలో ప్రొమోట్ చేసిన ఏకైక వ్యక్తి తెలుగు నాట పుట్టి పెరిగిన తేజం -బాలగోపాల్. ఆయనకు హక్కులంటే ఉద్యమం ఒకటే కాదు, అదొక passion. ఆయన పదవ వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన వీలునామాలో ‘లెటర్ అండ్ స్పిరిట్’ను ఇంకా అర్థవంతంగా చదవాల్సిన అవసరం ఉంది.

పాశ్చాత్య దేశాలలో బడికెళ్ళే పిల్లాడు కూడా తన వాచికంలో హక్కు అనే పదం వాడుతాడు. మనకు హక్కులంటే ఒక థియరీ మాత్రమే. అవి కొన్ని సూత్రాలు మాత్రమే. 70 సంవత్సరాలు దాటిన ఈ స్వాంతంత్ర్యంలో హక్కు అని వాడ్డం ఒక హై ప్రొఫైల్ సబ్జెక్ట్‌లో వాడే పరిభాషలా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో హక్కు అన్నది తక్షణ అవసరాలకు సంబంధించినది మాత్రమే. తక్షణ అవసరం సద్దుమణిగాక, ఇక హక్కు అనేది జీవితంలో నిరంతరం కాన్షియస్‌గా ప్రొమోట్ చేయాల్సిన కాన్సెప్ట్‌లానే ఉండదు. ఈ హక్కులకు ఒక తాత్వికత, ఒక ఆచరణాత్మక రూపకల్పన, అదే విధంగా దీని చుట్టూ ఒక ఆలోచనను, ఒక విధానాన్ని ఈ దేశంలో ప్రొమోట్ చేసిన ఏకైక వ్యక్తి తెలుగునాట పుట్టి పెరిగిన తేజం బాలగోపాల్. ఆయనకు హక్కులంటే ఉద్యమం ఒకటే కాదు, అదొక passion.

ఆయన పదవ వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన వీలునామాలో ‘లెటర్ అండ్ స్పిరిట్’ను ఇంకా అర్థవంతంగా చదవాల్సిన అవసరం ఉంది. మానవ హక్కులపై పలు రకాలుగా, పలుకోణాల్లో, కొత్త కొత్త విధానాల్లో అణచివేత జరుగుతున్నపుడు, ఈ ధోరణులను పసిగట్టి దేశ పౌరులుగా ప్రతిస్పందించాల్సి ఉంది. దేశంలో జరుగుతున్న అతి ప్రమాద, అతి అసామాన్యమైన పద్ధతి ఏమంటే, ప్రతి ఒక్కరిని ఒక మూసలో బతకమని చెప్పే ధోరణి. ఇంతకు ముందు ఒక రాజ్యాంగ పద్ధతిని వయోలేట్ చేసారని హక్కులను కాల రాయడం ఉండేది. అది కూడా పోలీసులు, ప్రభుత్వం చేసేవి. ఇప్పుడు బ్రాహ్మణీయ రాజ్య స్థాపన కోసం ఒక సెక్షన్ ఒక ఆఫ్‌లైన్ రాజ్యాంగాన్ని సృష్టిస్తూ ముందుకెళ్తున్నది. ప్రభుత్వాలు తమ విధానంలో భాగంగా దానితో ప్రణయ కలహం మాత్రమే ప్రకటిస్తూ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాయి.

ఒకరు సెక్యూర్డ్ గా ఉండాలి అంటే ఎలా ఉండాలి? వెజిటేరియన్ తినాలి, అమ్మాయి అయితే నిండుగా బట్టలు కప్పుకోవాలి, మాటకు ముందూ తర్వాతా జై హింద్ లేదా భారత్ మాతా కీ జై అని చెప్పాలి, జై శ్రీ రాం ఒక యూనివర్సల్ నినాదంగా అంగీకరించాలి, బీఫ్‌ను వ్యతిరేకించాలి, అమెరికాను మెచ్చుకోవచ్చు గాని పాకిస్థాన్‌పై ఎటువంటి పలుచటి శాంతి వచనాలు కూడా పలుకరాదు. ఈ ఫ్రేంలో లేని వ్యక్తుల కోసం హంటింగ్ మొదలౌతుంది. ముస్లిములు, దళితులు, మహిళలు మూకుమ్మడిగా టార్గెట్ చేయబడుతారు. వారికి గుణపాఠం చెప్పాలనే దుగ్ధతో దాడులు మొదలౌతాయి.

ప్రభుత్వం మాత్రమే చట్టం చేసి పౌర హక్కులను కాల రాసే రోజులుపోయి, ఆర్ఎస్ఎస్ శిబిరాల్లో చర్చించుకున్నవి, ఎవరిపాటికి వాళ్ళు ప్రైవేటుగా వెళ్ళగక్కుకున్న అక్కసుకు ఒక రూపం ఫార్మల్‌గా వచ్చేసింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న దాడులకూ మోదీకీ సంబంధం లేదు. అమిత్‌ షా కు వాళ్ళు ఎవరో కూడా తెలీకపోవచ్చు. లోకల్ ఆర్ఎస్ఎస్ నాయకుడో, బజరంగ దళ్ నినాదకారుడో అయితే చాలు.. -దాడికి సన్నద్ధమయ్యే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మన చుట్టు ఒక మూర్ఖ సమాజం వృద్ధి అవుతున్న రోజులివి.

దేశం మొత్తం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ను బహిష్కరిస్తే అంబేడ్కర్ అటెండ్ అయి వచ్చాడు. తద్వారానే ఈ దేశంలో హక్కులు ఉండాల్సిన అవసరం లేని గుంపుగా పరిగణించబడుతున్న అశేషప్రజానీకం ప్రపంచ దృష్టిలో పడ్డారు. అంతకు ముందు జరిగిన పోరాటాలకు, ప్రేరేపిత పోరాటాలకు లేని పునాది, క్రమబద్ధమైన ఆలోచనా విధానం, పరిపూర్ణ ప్రామాణికం మీద కాక సాపేక్షిక ప్రామాణికం మీద ఆచరణ కార్యక్రమాన్ని పెంపొందించిన ఏకైక నాయకుడు అంబేడ్కర్‌. ఈ రోజు ఆ విజన్ మనం మన కళ్ళ ముందు చూస్తున్నాం. మెజారిటేరియనిస్ట్ బ్రాహ్మిణిజం ఈ దేశానికి పట్టిన చీడ అని దాని తీవ్రతను గుర్తించిన మొదటి వాడు, చివరి వాడు అంబేద్కర్ మాత్రమే. మానవ హక్కులకు ఈ దేశంలో conceptual framework ఇచ్చింది ఆయనే. ఆయన ఎంత ప్రాక్టికల్ గా హక్కుల ఉద్యమాన్ని నడిపాడో పూనా ఒడంబడిక సందర్భంలో ఆయన అప్రోచ్ తెలియజేస్తుంది. మనం టోకు పద్దుగా మిస్ అయిన పాయింట్ ఈ ఆలోచనా విధానమే.

ప్రజలను take -it -for- granted గా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలలో తీవ్రత, ఫ్రీక్వెన్సీ పెరగడం కూడా మనం గమనించాలి.

ప్రాణాలు తీస్తుందన్న ఆలోచన అయినా లేని, నిర్లక్ష్య ధోరణితో ఒక పనికి రాని డీమోనిటైజేషన్‌ను దేశంమీద బలవంతంగా రుద్దడం ఒక హీరోయిజం. మనం ప్రధాని ఎలా ఉండాలో కోరుకునే విధానమే మారుతుంది. మనకొక ఫ్రెండ్లీ నియంత కావాలి అనే వాదన బలపడుతుంది. జీఎస్టీని హడావిడిగా రుద్దడం, తర్వాత ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు.. అన్నిట్లో ఇదే జరుగుతుంది. ఇవన్నీ బ్రాహ్మణీయ మెజారిటేరియనిస్టులకు కావాల్సిన అనుకూల వాతావరణాన్ని బలపరిచే విధానాలు. ఈ రైట్‌వింగ్ ప్రభుత్వం వచ్చాక ఒక్క హైదరాబాదు పరిసర ప్రాంతాలలోనే 500 పైగా చర్చిలపై దాడులు, పాస్టర్లపై దాడులు హత్యలు జరిగాయి. ముస్లిం మతం అగ్రెసివ్ అని దాడి చేస్తారు, క్రిస్టియన్ మతం శాంతిపూర్వకం అయినా సరే, మత వ్యాప్తి చేస్తున్నదని దాడులు జరుపుతారు. మెజారిటేరియనిజాన్ని రాజ్యం ఒంట

బట్టించుకున్నాక – ప్రతి విషయాన్ని మెజారిటేరియన్ సాంఘిక విధేయత ఇష్యూ కింద చేస్తుంది. ప్రతి క్షణం మనకు ఈ సమాజంతో ఉన్న సోషల్ కాంట్రాక్టును బేరసారాల్లో ఉంచుతుంది.

కశ్మీరు ప్రజలతో సంబంధం లేకుండా ఆర్టికల్ 370 ని రద్దు చేస్తారు. పైకి చూడ్డానికి ఇది ఒక పరిపాలనా విధానాన్ని రుద్దడం మాత్రమే. రాజ్యాంగ బద్ధంగా చేసే ఇటువంటి సవరణలను కోర్టులు ఆపగలుగుతాయా? అన్నది అనిశ్చితే. ఇంతవరకు అయోధ్యతోనే ఎత్తు

గడల ఆట ఆడుతున్నది సుప్రీంకోర్టు. మన వ్యవస్థ మైనారిటీ సానుభూతిని అర్థం చేసుకునే కొద్దిపాటి సెన్సిటివిటీ ని కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది.

లాంఛన సంస్థలను (Formal institutions) విగ్రహ ప్రతిమల్లా ఉంచి అనియత సంస్థల (informal institu tions)ను వాడుకోవడం బ్రాహ్మణిజం ప్రత్యేకత. ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు, భగవద్గీతలు బ్రాహ్మణీయ సాంప్రాదాయిక భాష్యాలు. అయితే, వీటన్నిటికన్న శక్తివంతమైనది మనుస్మృతి. ఇది దైవికమైన విషయం కాదు. కానీ ఇదే ‘కోడ్ ఆఫ్ కండక్ట్’ గా బ్రాహ్మణీయత చలామణీ చేసింది. అలాగే ఈ రోజు చట్టాలు చేసేది తక్కువ, పరివార్ సంస్థల సానుభూతి పరులు, కేడర్, అనుచర గణం చేస్తున్న దారుణాలు ఎక్కువ. ఈ బ్రాహ్మణీయ ఎత్తుగడల యుద్ధంలో ఈ రోజు మనం హక్కుల ఉద్యమాన్ని నడుపుతున్నామని గమనించాలి. ఉపా చట్టాన్ని ఏక పక్షంగా ఎన్‌ఐఏ చేతిలో పెట్టింది ప్రభుత్వం. అనుమానం వస్తే చాలు ఎవరినైనా దోషిగా నిర్ణయించమని కూడా చెప్పేసింది. పైగా ఇది దుర్వినియోగం కాదు అని భరోసా ఇస్తుంది. బ్రాహ్మణీయత ప్రజలతో బేరామాడడంలో మరింత దూకుడుగా ముందుకెళ్తున్నది. ‘నన్ను నమ్మండీ’ అనడంలోనే ‘నా మంచి చెడ్డల నిర్ణయం మీద తప్ప వేరే ఎటువంటి ఆలోచనలు మీకుండరాదు’ అన్న భావన ఉంది.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా యురేనియం తవ్వకాల ఆలోచన చేసింది. అయితే, కేసీఆర్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించకపోగా, ప్రతిపాదన వచ్చాక ‘నేను వ్యతిరేకిస్తాను’ అని చెప్పారు. నిజానికి ఆ ప్రతిపాదన కేసీ

ఆర్‌ను సంప్రదించి రికమెండ్ చేసింది కాదు. మనం అనుసరిస్తున్న ఫెడరల్ వ్యవస్థ సెంట్రల్ గవర్నమెంట్ ఫాసిజం చేతిలో కీలు బొమ్మగా ఆడుతుంది. ఈ ఫెడరల్ హక్కు కాల

రాయబడుతుంటే కేసీఆర్‌ వ్యతిరేకించరు. వ్యతిరేకిస్తే- తన చేతిలో ఏమీ లేదు అని చెప్పాలి. అలా ఒప్పుకోవడం రాజకీయ హీరోయిజం కాదు. రేపు తవ్వకాలు జరిగితే తప్పు కేంద్రం మీద మోపొచ్చు. ఆంత వరకు అసెంబ్లీ తీర్మానాలు, కరెస్పాండెన్స్ నడుస్తాయి. ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేస్తున్నట్టు ఒక భ్రమ కల్పిస్తారు.

ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్న పరిస్థితుల్లో ఉన్నాం. ILFS లాంటి పెద్ద బేంకింగ్ సంస్థలు మూత బడ్డాయి. సుమారు 9.50 లక్షల కోట్ల మొండి బకాయిలు పేరుకుపోయాయి. ఇవి రోజు రోజుకు పెరగడమే తప్ప తగ్గడం లేదు. యూరోప్ ఆర్థిక వ్యవస్థ మందకొడిగా సాగుతున్నది. అంతో ఇంతో బాగున్న చైనా ఇప్పుడు అమెరికాతో ట్రేడ్‌వార్ వల్ల కుంటుతోంది. మన దేశంలో ఆరునెలల్లోనే ఆటో మొబైల్ రంగంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌ ఇండియా లాంటి సంస్థల్లో జీతాలు టైం కు ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వం ‘స్టిమ్యులస్’ పేరుతో కార్పోరేట్ లాభాలు పెంచే ప్రయత్నాలు చేసింది. కానీ, రిటెయిల్ వినిమయం ఎలా పెంచాలన్నదాన్ని మాత్రం పట్టించుకోలేదు. ఇవన్నీ ఇలా జరుగుతుండగా… మనల్ని మరింత సాంఘిక సంక్షోభంలో నెట్టేసే ఉపా సవరణ, ఆర్టికల్ 370 రద్దు, యురేనియం తవ్వకాలు ముందుకొస్తున్నాయి. దేశంలో ఇంత వరకు పెంచి పోషించిన సోషల్ కేపిటల్‌ను ప్రిజర్వ్ చేసుకోవడంతో పాటు ఎకనమిక్ కేపిటల్‌ను పరిరక్షించుకోవడమే దీని వెనుకనున్న బ్రాహ్మణీయ కేపిటలిస్ట్ అజెండా. ఎకనమిక్ కేపిటల్‌ను ప్రొటెక్ట్ చేయకపోతే ఫారిన్ పెట్టుబడులు రావు. ఇక మనం గొడ్డు పోయే పరిస్థితి ఉన్నట్టు ప్రవర్తించడం మొదలుపెడతాం.

విచిత్రంగా మన దేశ వ్యవస్థలో భాగస్వామ్యం కాని ప్రజలు 30 శాతం పైనే ఉంటారు. అంటే ఒక 40 కోట్ల మంది ఈ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కాకుండా వేరే ఏ నిమిత్తం లేకుండా బతికేస్తున్నారు. ఇదంతా మన వద్ద ఉన్న వెలికి

తీయని ఆర్థిక సామర్థ్యం. ఉదాహరణకు మన దేశంలో సినిమాలు చూసే వాళ్ళ శాతం 10 శాతం మాత్రమే. అంటే సినిమా మాల్స్, ఇవన్నీ కూడా ఈ అతి తక్కువ ప్రజానీకానికి సంబంధించినవే. కానీ, నూరుకోట్లమంది సినిమా చూస్తున్నట్టు మన చెవుల్లో ఒకటే పోటు. క్షేత్రస్థాయిలో ఒక సాధారణ పౌరుడి దగ్గరకు వెళ్ళ లేని 70 సంవత్సరాల ఆయుర్దాయం ఉన్న మన ఆర్థిక వ్యవస్థ పనితీరు మన హక్కుల విషయంలో ఉండే ప్రవర్తనను తెలియజేస్తుంది. ఒక కామన్ మ్యాన్‌ను ఆర్థిక వ్యవస్థలో ఎలా భాగస్వామ్యం చేయాలని కాక, తక్షణ అవసరాలకోసం, కేంద్రీకృతమైన లాభాపేక్షతో పనిచేసే వ్యవస్థ, మన బ్రాహ్మణీయ కేపిటలిస్ట్ వ్యవస్థను పాక్షిక దృష్టితోనే చూస్తుంది. ఈ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించే కొద్దీ ఫాసిజం కొత్త పుంతలు తొక్కుతుంది. ఎందుకంటే, చేసిన తప్పులను కవర్ చేసుకోవడానికి ఒక ఎత్తైతే, కొత్త గొంతులు తలెత్తకుండా ఉండడం కోసం మరో ఎత్తు చేపడుతుంది.

ఈ పరిణామాలను హక్కుల పోరాటంలో మనం మనసా వాచా ఆకళింపు చేసుకోవాలి. అమూర్తత (abstractisation) ను వదిలించుకోవాలి. ప్రతి స్టెప్‌ కూడా కాంక్రీట్‌గా ఫార్ములేట్ చేయాల్సి ఉంది. మన దేశంలో ఆర్గనైజ్డ్ గా బయలు దేరిన మొదటి మానవ హక్కుల ఉద్యమ కారుడు అంబేడ్కర్‌. ప్రవేశం కూడా లేని వ్యవస్థలో చొరబడి, అదే వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ఎత్తులు ఒక్కొక్కటిగా పాటించిన వ్యక్తి. ఆ క్లియర్ థింకింగ్ ఫలితాలు ఈ రోజు చూస్తున్నాం. బాల గోపాల్ వర్ధంతి సందర్భంగా మన చెవులు, కళ్ళు విశాలంగా తెరిచి ఒక సాకారమైన పద్ధతిలో ప్రతి ఒక్కరు అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. బాలగోపాల్‌లో ఉండే ప్రత్యేకత – పాపులిస్టుగా బతకడం కాక పర్పస్‌ఫుల్‌గా బతకడం. ఇప్పటివరకు నిర్మించబడ్డ స్థిర నియమాల (norms) మీద సూత్రీకరణ చేయడం మాత్రమే గాక, సామాజిక చలనానికి అనుగుణంగా పిడివాదాన్ని తోసిపుచ్చి ధైర్యంగా నిలబడడం. అందుకే ఆయన మీద ఎన్నైనా విమర్శలు ఉండి ఉండవచ్చు గాక ఆయన తర్వాత మానవ హక్కుల పోరాటంలో రెండో స్థానంలో ఉన్న వాళ్ళను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉందని మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు.

పి. విక్టర్ విజయ్ కుమార్
(అక్టోబర్‌ 8: బాలగోపాల్‌ పదవ వర్థంతి)